ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

క‌రోనాతో మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి క‌న్నుమూత‌

Sabbam Hari
క‌రోనా మ‌హ‌మ్మారి వారూ వీర‌నే తేడా లేకుండా అంద‌రినీ బ‌లిగొంటోంది. ఈ వైర‌స్ బారిన ప‌డి సామాన్య జ‌నం నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కూ మృత్యువాత ప‌డుతున్నారు. తాజాగా విశాఖ‌ప‌ట్నం మాజీ ఎంపీ సబ్బం హ‌రి క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొద్ది రోజుల క్రిత‌మే కొవిడ్ సూచ‌న‌లు క‌నిపించ‌డంతో ప‌రీక్ష చేయించుకున్నారు. దీంతో.. ఆయ‌న‌కు పాజిటివ్ రిపోర్టు వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో వైద్యుల సూచన‌ల మేర‌కు హోం ఐసోలేష‌న్లో ఉన్నారు. కానీ.. ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మార‌డంతో.. విశాఖ‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న‌ప్ప‌టికీ.. ఆరోగ్యంలో మార్పు రాలేదు. నిన్న‌టి నుంచి ప‌రిస్థితి మ‌రింత విష‌మించ‌డంతో.. ఇవాళ మ‌ధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. క‌రోనాతోపాటు ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా సబ్బం హ‌రి మృతికి కార‌ణ‌మ‌య్యాయ‌ని వైద్యులు తెలిపిన‌ట్టు స‌మాచారం.

స‌బ్బం హ‌రికి రాజ‌కీయాల్లో సుదీర్ఘ‌మైన అనుభ‌వం ఉంది. విశాఖ కాంగ్రెస్ లో ఆయ‌న కీల‌క నేత‌గా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత వైఎస్ చ‌నిపోయిన‌ప్పుడు.. జ‌గ‌న్ కు అండ‌గా ఉన్నారు. ఓదార్పు యాత్ర‌లో సైతం జ‌గ‌న్ తో క‌లిసి న‌డిచారు. కానీ.. ఆ త‌ర్వాత ప‌రిణామాలు మారిపోవ‌డంతో జ‌గ‌న్ కు దూర‌మ‌య్యారు. ఆ త‌ర్వ‌త టీడీపీలో చేరారు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భీమిలీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్ప‌టి నుంచి ఇంటికే ప‌రిమితం అయ్యారు. రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌గా ఉన్న ఆయ‌న‌.. ఇలా క‌రోనా బారిన ప‌డి ప్రాణాలు కోల్పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తమ‌వుతోంది. స‌బ్బం హ‌రి మృతిప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నేత‌లు సంతాపం తెలిపారు.

Back to top button