జాతీయంరాజకీయాలుసంపాదకీయం

నెహ్రూ కుటుంబం చేతిలో కాంగ్రెస్ భవిష్యత్తు

కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు పై రకరకాల కధనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత చాలామంది కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నించటం మొదలుపెట్టారు. వరసగా మహారాష్ట్ర, హర్యానా ల్లో ఓటమి , ఝార్ఖండ్ లో ముందుగానే ఝార్ఖండ్ ముక్తి మోర్చా కి పీఠం ఇవ్వటానికి ఒప్పందం చేసుకొని జూనియర్ పార్టనర్ గా సెటిల్ కావటం, ఢిల్లీ ఎన్నికల్లో పూర్తిగా బొక్కబోర్లా పడటం ఈ ఆలోచనకు కారణమయ్యింది. దీనికి తోడు రాహుల్ గాంధీ నాయకుడుగా అన్నిరంగాల్లో విఫలంగావటం , ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఏరోజైనా జైలుకు వెళ్తాడానే వార్తలు , సోనియా గాంధీ ఆరోగ్య కారణాలతో చురుకుగా లేకపోవటం ఓ విధంగా పార్టీ సంక్షోభంలో ఉందనే చెప్పాలి. ఒకవేళ వచ్చే నాలుగేళ్లలో బీజేపీ పై వ్యతిరేకత పెరిగినా దాన్ని అందిపుచ్చుకునే సత్తా కాంగ్రెస్ కి లేదనేది ప్రస్తుత పరిస్థితులు సూచనలు ఇస్తున్నాయి.

ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునే సత్తా కాంగ్రెస్ కి లేదా? అసలు కాంగ్రెస్ భవిష్యత్తు అంధకార బంధురమేనా ? మొదటి ప్రశ్నకి గట్టిగానే వుంది అని చెప్పొచ్చు. అలాగే రెండో ప్రశ్నకి కాదనే చెప్పొచ్చు. దానికి సహేతుకమైన కారణాలే వున్నాయి. భారత్ సువిశాల, వైవిధ్య భరిత, పలు సంస్కృతుల సమూహం. ఏ ఒక్క పార్టీ గుత్తాధిపత్యం సాధించలేదు. బీజేపీ కి ఎన్ని సానుకూల అంశాలున్నాయో అన్ని ప్రతికూల అంశాలు కూడా వున్నాయి. అలాగే కాంగ్రెస్ కి ఎన్ని ప్రతికూల అంశాలు వున్నాయో అన్ని సానుకూల అంశాలు కూడా వున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం.

ఒకటి, ఘనమైన వారసత్వం. దానితో ప్రతి రాష్ట్రం లో కొంత ఓటు బ్యాంకు ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఉంటుంది. అయితే ఢిల్లీ ఎన్నికల్లో అదికూడా లేకుండా పోవటం ఆశ్చర్యం. రెండోది, బీజేపీ వ్యతిరేక ఓటు దేశంలో బలంగా ఉండటం. అది అనేక బీజేపీయేతర పార్టీల మధ్య చీలిపోయి వుంది. దేశవ్యాప్తంగా బీజేపీ తర్వాత ఎక్కువమంది నాయకులు కూడా ఇప్పటికీ కాంగ్రెస్ కే వున్నారు. మూడోది, దేశవ్యాప్తంగా మేధావులు, ఉదారవాదులు ఇప్పటికీ కాంగ్రెస్ కే అండగా వున్నారు.జాతీయ ప్రచార సాధనాల్లో కూడా బీజేపీ తో దాదాపు సమానంగా కాంగ్రెస్ కి సానుభూతిపరులు వున్నారు. నాలుగు, పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో వుంది. అందులో హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ మరియు పంజాబ్ లో స్వంతగానే అధికారంలో వుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబై కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం చేతుల్లోనే వుంది. మరి ఇన్ని అనుకూల పరిస్థితులు వుండికూడా కాంగ్రెసుపై పరిశీలకులకు నమ్మకం ఎందుకు లేదు?

కాంగ్రెస్ కి పట్టుకున్న గ్రహణం , కాంతి రెండూ నెహ్రూ కుటుంబమే. అనేక సందర్భాల్లో నెహ్రు కుటుంబ ప్రతిష్టే కాంగ్రెస్ ని కాపాడింది. కానీ ఇప్పుడు అదే ప్రతిబంధకం అయ్యింది. 2014 తర్వాత నెహ్రూ కుటుంబం దశ దిశ రివర్స్ గేర్ లో నడుస్తుంది. ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత అది వేగం పుంజుకుంది. ఈ రివర్స్ గేర్ ని ఆపే అవకాశం వుందా? ఖచ్చితంగా వుంది. దానికి కావాల్సిందల్లా నెహ్రూ కుటుంబం విశాలంగా పార్టీ ప్రయోజనాల్ని దృష్టిపెట్టుకొని కొన్ని చర్యలు చేపట్టాలి. వాళ్ళ మీద వున్న రివర్స్ ట్రెండ్ ని సానుకూలంగా మార్చుకోవాలంటే ప్రజలకు తిరిగి విశ్వాసం కలిగించే టట్లు గా ప్రవర్తించాలి. అందుకు ఒక్కటే మార్గం. పార్టీని ప్రజాస్వామీకరించటం. ఇప్పటికే శశి థరూర్ , సందీప్ దీక్షిత్ లాంటి వాళ్ళు దీనిపై అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తపరిచారు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు దీన్ని అందిపుచ్చుకొని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ని ప్రాతినిధ్య ఎన్నికద్వారా పూరించాలి. అప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. నిజం చెప్పాలంటే ఈ సారికి నెహ్రూ కుటుంబం పోటీ నుంచి తప్పుకుంటే ప్రజలకు నూతనోత్సాహం వస్తుంది. అంతేగాని రాహుల్ గాంధీ స్థానంలో ప్రియాంక గాంధీని తీసుకొస్తే కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఒక్కసారి నెహ్రు కుటుంబం లేకుండా ఎన్నికలు జరిగితే మోడీకి చెప్పటానికి పదునైన అస్త్రం ఉండదు. ఇన్నాళ్లనుంచి నెహ్రూ కుటుంబమే మోడీకి ప్రచారాస్త్రం. అందుకని ఈ ప్రయోగం బీజేపీ వ్యతిరేక ప్రజానీకం లో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. లేకపోతే ఈ బంగారు అవకాశం జారవిడుచుకున్నవాళ్లవుతారు. ఇప్పటికే ఆప్ ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాజకీయాల్లో నాలుగు సంవత్సరాలు చాలా ఎక్కువ. నెహ్రూ కుటుంబం పార్టీ శ్రేయస్సు రీత్యా పదవుల్ని పక్కనపెట్టి అంతర్గత ప్రజాస్వామ్యం వైపు పయనిస్తుందని ఆశిద్దాం.