అంతర్జాతీయంరాజకీయాలు

కరోనాపై జీ20 దేశాల ఉమ్మడి పోరు

కరోనా(కోవిడ్-19) వైరస్ పేరు చెబితేనే ప్రపంచం గజగజలాడిపోతుంది. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ అన్ని దేశాలకు పాకింది. భారత్ లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో 21రోజులపాటు లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 5లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం. దీంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇటలీ, స్పెయిన్, యూకే, అమెరికా లాంటి దేశాల్లో అత్యధిక ప్రభావం చూపుతోంది. దీంతో అన్ని దేశాలు కలిసికట్టుగా ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి.

కరోనా మహమ్మరిని కలిసి కట్టుగా ఎదుర్కొనేందుకు జి-20 దేశాలు ముందుకొచ్చాయి. గురువారం సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ అధ్యక్షతన అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, భారత ప్రధాని మోదీ తదితరులు పాల్గొన్నారు. కరోనాపై ఐక్య పోరాటానికి జీ20 దేశాలు కట్టుబడి ఉన్నామని ఆయా దేశాలు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి.

కరోనా దెబ్బతో ఆర్థిక మాద్యం పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని జీ20 దేశాలు భావించాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మాంద్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు సుమారు 5లక్షల కోట్ల డాలర్లను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించాలని జీ20దేశాల ప్రతినిధులు నిర్ణయించారు. కేవలం ఆర్థిక లక్ష్యాలను కాకుండా మానవాళి వికాసానికి ఉపయోగపడేలా జీ20 దేశాలు కలిసి పని చేయాలని ప్రధాని మోదీ సూచించారు. వైద్య పరిశోధన సేవలు ఉచితంగా అన్ని దేశాలకూ అందాలని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు జీ20 దేశాలు తీసుకుంటున్న చర్యలపై ఆయా దేశాల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.