ఆంధ్రప్రదేశ్

బాధ్యత మరిచిన ఎంపీడీవో మత్తు.. చిందులతో చిత్తు

MPDO Ramachandra Rao

ఆయనో ప్రభుత్వ అధికారి. మండలానికి బాస్. బాధ్యతగా ఉండాల్సిన ఆయన బరితెగించారు. మద్యం మత్తులో చిందులేశారు. తన కార్యాయలంలోనే వికృత చేష్టలతో స్టెప్పులేశాడు. పనివేళల్లోనే తోటి ఉద్యోగులతో కలిసి డాన్సులు చేశాడు. ఎవరైనా చూస్తే పరువు పోతోందనే కనీస మర్యాద లేకుండా కన్నుమిన్ను కానకుండా మద్యం తాగాడు. మత్తులో జోగాడు. బాధ్యతలను మరిచి బరితెగింపుగా ప్రవర్తించాడు.

మద్యం మత్తులో చేసిన అసభ్యకర ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. దీనిపై జిల్లా కలెక్టర్ సూర్యకుమారి స్పందించారు. ఎంపీడీవో రామచంద్రరావుపై విచారణకు ఆదేశించారు. మండల అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాల్సిన ఓ అధికారి దారి తప్పి వికృతంగా ప్రవర్తించడంపై కన్నెర్ర జేశారు. వృత్తికి కట్టుబడి ఉండాల్సిన వ్యక్తే దారి తప్పి ప్రవర్తిస్తే ఎలాగని ప్రశ్నించారు.

ప్రజా సమస్యల పరిష్కారంపై పట్టించుకోవాల్సిన అధికారి ఇలా చేయడంపై పలు కోణాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయ ఆవరణలోనే మద్యం సేవించి నియంతలా ప్రవర్తిస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవడం తప్పనిసరే. ఆయనపై గతంలో కూడా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై జిల్లా రెవెన్యూ అధికారి గణపతి రావును విచారణ అధికారిగా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వానికి బాధ్యులుగా ఉండాల్సిన అధికారులే దారి తప్పుతుంటే ఇక ప్రజల బాగోగులు ఏం చూస్తారు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ప్రజాసేవలో ఉండాల్సిన అధికారులు మద్యం మత్తులో జోగడం సామాన్య విషయం కాదు. మండల అభివృద్ధి అధికారిగా ఉండి విధులు నిర్వహించకుండా దారి తప్పి ప్రవర్తించడంతో కింది స్థాయి అధికారులకు సైతం బాధ్యతలు కానరావడం లేదు.

Back to top button