టాలీవుడ్సినిమా

చిరు మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న హాసిని..!

‘బొమ్మరిల్లు’ సినిమాలో హ..హ. హసినిగా నటించి జెనీలియా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ మూవీలో ఆమె నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. జెనిలియా అంటే తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే బొమ్మరిల్లు హసినే గుర్తుకొస్తోంది. జెనీలియా తెలుగులో యంగ్ హీరోలందరికీ సరసన నటించింది. బన్నీతో కలిసి ‘హ్యపీ’ రాంచరణ్ తో ఆరెంజ్, ఎన్టీఆర్ తో సాంబా, తరుణ్ తో శశిరేఖ పరిణయం, నితిన్ తో సై, వెంకటేష్ తో సుభాష్ చంద్రబోస్ తదితర మూవీల్లో నటించి అభిమానులను మెప్పించింది. జెనీలియా తెలుగులో చివరగా రానాతో కలిసి ‘నా ఇష్టం’ అనే మూవీలో నటించింది.

ఆ తర్వాత బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానం. పిల్లలు స్కూల్ కు వెళుతుండగా జెనీలియా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మంచి సినిమా కథ దొరికితే సినిమాల్లో నటించేందుకు సిద్దమేనంటూ గతంలోనే జెనీలియా ప్రకటించింది. ఈనేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి త్వరలో నటించే మూవీలో జెనీలియా రీ ఎంట్రీ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవి 153వ చిత్రంగా ‘లూసీఫర్’ మలయాళ మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ మూవీని దర్శకుడు సుజిత్ తెరకెక్కించబోతున్నాడు. ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం జెనీలియాను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తోంది. తన సినీ కెరీర్ కు ఈ మూవీ టర్నింగ్ అవుతుందని జెనీలియా భావిస్తుందట. మెగాస్టార్ మూవీ ద్వారానే జెనీలియా సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. దీంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.