తెలంగాణరాజకీయాలుసంపాదకీయం

ఎన్నికలు కాని ఎన్నికలు జిహెచ్ఎంసి ఎన్నికలు

కెసిఆర్ స్టైలే వేరు, వైరంలో ఎప్పుడూ పైచేయే

కెసిఆర్ అధికారంలోకి వచ్చినదగ్గరనుంచి ఒక్కసారి పరిశీలిస్తే రాజకీయ ఎత్తుగడలు వేయటంలో తనకు ఎవరూ సాటిరారు. మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం అరకొర మెజారిటీనే వుండేది. కానీ ఆ తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్షపార్టీని మింగేసి బలం పెంచుకున్నాడు. అదేమంటే నా ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు పన్నుతున్నారని,సాధించిన తెలంగాణా నిలబడాలంటే ఈ మాత్రం రాజకీయాలు అవసరమని ప్రజలకు నమ్మబలికాడు. అందుకనే ప్రజలు దాన్ని తప్పుగా చూడలేదు. తను ఏమి చేసినా,ఏది చెప్పినా అది తెలంగాణా కోసమేనని ప్రజలు నమ్మేటట్లు చేయగలగటం తన చాతుర్యం. చివరకు ఒక్క మహిళకు కేబినేట్ లో స్థానం కల్పించకపోయినా,కుటుంబ సభ్యులు ఏకంగా ముగ్గురు కేబినేట్ లో వున్నా ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకోగలిగాడు. కాకపోతే దేనికైనా ఒకరోజు వస్తుందని అంటారు. ఆరోజు వచ్చినట్లే కనబడుతుంది. దుబ్బాక ఎన్నికలో ఓటమి అందుకు అడుగు పడినట్లు కనిపిస్తుంది. కెసిఆర్ కోటలో తెరాస ఓడిపోవటం చిన్న విషయమేమీ కాదు. దానితో కెసిఆర్ కి అర్జెంటు గా ఏదైనా చేసి ఇమేజి కాపాడుకోవాలనే ఆరాటం మొదలయ్యింది. అదీకాక కెసిఆర్ ఓటమిని తట్టుకోలేడు. వైరివర్గం విజయాన్ని తేలికగా తీసుకోలేడు. తనను ఎవరైనా ప్రశ్నిస్తే తట్టుకోలేడు. అందుకే అప్పుడు రేవంత రెడ్డిని తెలివిగా ఓటుకునోటు కేసులో ఇరికించాడు. చంద్రబాబు నాయుడుని ఆంధ్రా పారిపోయేటట్టు చేసాడు. ఉత్తమకుమార్ రెడ్డిని ఎన్నికల్లో డబ్బులతో దొరకబుచ్చాడు. ఇదే మనస్తత్వం రఘునందన రావు బంధువుల ఇళ్ళలో డబ్బులు పట్టించింది. ఇదోరకమైన మనస్తత్వం. ఈ ధోరణిలో ఎప్పుడూ తను పైచేయిలోనే వుండాలి. అందుకోసం ఏమైనా చేయాలి. కొంతవరకు ఇదే ధోరణి మేనల్లుడు హరీష్ రావు కి కూడా వచ్చింది. సాగినంతకాలం ఇది సాగుతుంది. వికటిస్తే ఒక్కసారి సౌధం కుప్పకూలుతుంది. అందుకే కెసిఆర్ అధికారంలో వున్నంతకాలం తనకు ఎదురు లేకుండా చూసుకుంటాడు. మొట్టమొదటిసారి తన ఆధిపత్యానికి,అహంకారానికి సవాలు ఎదురయ్యింది. అదే బిజెపి రంగప్రవేశం. లోక్ సభ ఎన్నికల్లో మొదలయ్యి, దుబ్బాకలో తొడగొట్టి జిహెచ్ఎంసి లో ఎదురునిలిచింది.

జిహెచ్ఎంసి ఎన్నికలు ధర్మయుద్ధం కాదు

కెసిఆర్ దుబ్బాక ఫలితంతో లోలోపల రగిలి పోతూ వున్నాడు. ఓటమిని భరించలేని కెసిఆర్ తిరిగి ప్రజల్లో తనకి తిరుగులేదని నిరూపించుకోవాలని తహతహ లాడుతున్నాడు. అందుకే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పధకం రచించాడు. అంతవరకూ ఓకె, ఒక రాజకీయ నాయకుడుగా తనకా హక్కుంది. కాకపోతే ధర్మ యుద్ధం చేయాలి. అందరికి పోటీకి అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత ప్రజలకు నీ తళుకులు, బెళుకులు చూపించి గెలవొచ్చు. అంతేగాని అసలు అవతలివాడికి పోటీకి అవకాశం ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించటం కెసిఆర్ భయాన్ని, పిరికితనాన్ని చూపిస్తుంది. ఒకవైపు వరదలొచ్చి ప్రజలు నానాయాతలు పడుతుంటే వాళ్ళను ఓదార్చి సాధారణ పరిస్థితులు నెలకొనటానికి చర్యలు చేపట్టకుండా ముందస్తు ఎన్నికలు నిర్వహించటం పిరికితనం కాక మరేమిటి? వరదసాయం కింద 10 వేల రూపాయలు ఇచ్చాం కాబట్టి కృతజ్ఞతతో ఒటేస్తారనుకోవటం ప్రజల విజ్ఞతను తక్కువగా అంచనా వేయటమే. ఎన్నికలముందు ఆస్తి పన్ను తగ్గించటం, మున్సిపల్ నాలుగో తరగతి కార్మికులకు జీతాలు పెంచటం ఇవన్నీ ఎన్నికల తాయిలాలని గమనించలేనంత అమాయకులు కాదు ప్రజానీకం. అంతవరకూ ప్రతి రాజకీయనాయకుడు చేసేదే.

కాని డివిజన్లు పునర్విభజన చేయకపోవటం,రిజర్వేషన్లు పునః సమీక్షించక పోవటం, వోటర్ల లిస్టులు లోపభూయిష్టంగా వుండటం, అవి ప్రజలకు అందుబాటులో లేకపోవటం, పోలింగ్ బూతులు ముందుగా ప్రకటించక పోవటం ఇవన్నీ అట్టిపెట్టుకొని ఒక్కసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం ధర్మ యుద్ధం కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటనకి,నోటిఫికేషన్ కి మధ్య గ్యాప్ లేకపోవటం అసలు ధర్మ యుద్ధం కాదనే చెప్పాలి. కనీసం ఒకవారం గ్యాప్ అయినా ఇచ్చి వుండాల్సింది. సాంకేతికపరంగా అడ్డంకులు ఉండకపోవచ్చు. కానీ ఇలాచేయటం మాత్రం సంప్రదాయం కాదు. అందుకనే ఇవి ఎన్నికలు కాని ఎన్నికలని పిలుస్తున్నాము.

కెసిఆర్ నా మజాకానా ?

ఇంతకుముందే చెప్పినట్లు కెసిఆర్ స్టైలే వేరు. అందరిలాగా రాజకీయాలు చేస్తే కెసిఆర్ ఎందుకవుతాడు? అవతలివాడి ఆలోచనలకి ఒకమెట్టు పైనే ఉంటాడు. ఏమాటకామాట చెప్పాలి, ఈ రాజకీయ చాణక్య మే తెలంగాణా తీసుకురావటానికి ఉపయోగపడింది. కేవలం ప్రదర్శనలు,ఆందోళనలు,ఉద్యమాల ద్వారానే తెలంగాణా వచ్చిందనుకుంటే పొరబాటు. డిల్లీలో చక్రం తిప్పటంలో,మాయమాటలు చెప్పి కాంగ్రెస్ నాయకులను బుట్టలో వేసుకోవటంలో కెసిఆర్ చూపిన నేర్పరితనం ఖచ్చితంగా తెలంగాణా సాధనకు ఉపయోగపడింది. అది తన దృష్టిలో తప్పుకాదు. తెలంగాణా సాధించటానికి దెయ్యాన్ని కావలించు కోవటానికైనా సిద్ధమని ప్రకటించటంలో అంతర్యాన్ని అర్ధంచేసుకోవచ్చు. కాని తెలంగాణా ఏర్పడిన తర్వాత అవే మాయమాటలు ప్రజలకు కూడా చెబితే క్షంతవ్యం కాదు.

బిజెపి ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భూపేంద్ర యాదవ్ ని స్వయంగా ఇన్ చార్జిగా ప్రకటించట మంటేనే దాని సీరియస్ నెస్ ని అర్ధం చేసుకోవచ్చు. కాకపోతే తను హైదరాబాద్ వచ్చి ఇక్కడ పరిస్థితుల్ని అవగాహన చేసుకునే లోపలే ఎన్నికలు అయిపోతాయి. ఒకవిధంగా బిజెపి భూపేంద్ర యాదవ్ ని ఇన్ చార్జి గా ప్రకటించటం కెసిఆర్ ఇంకొంచెం ముందుకి ఎన్నికలు జరపటానికి ప్రేరేపించి ఉండొచ్చు. భూపేంద్ర యాదవ్ ఏమిటో కెసిఆర్ కి తెలుసు. ముఖ్యంగా అభ్యర్ధుల ఎంపికకి టైం లేకపోవటం బిజెపికి ప్రతిబంధకం కావొచ్చు. కేటిఆర్ ఇప్పటికే కావాల్సిన భూమికను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ప్రతిపక్షాలకు ఆ అవకాశం ఇవ్వకుండా చేయటమే ఈ ముందస్తుకు కారణం. అయినా బిజెపి ని తక్కువ అంచనా వేయలేము. నిజంగా ప్రజల్లో అందరూ చెబుతున్నట్లు అంత వ్యతిరేకత వుంటే ఈ ట్రిక్కులు, జిమ్మిక్కులు పనిచేయవు. రెండు వారాల్లో ప్రజలు అద్భుతాలు సృష్టించ గలరు. తిమ్మిని బమ్మిని చేయగలరు. ఓ వారానికి కొంత పరిస్థితి అర్ధమవుతుంది. ఇంత తక్కువ సమయం ఇవ్వటంతో పోటీ ద్వైపాక్షికం అవుతుంది. కాంగ్రెస్ కి ఇంత త్వరలో అన్ని సమకూర్చుకొని పోటీలో సమవుజ్జీగా నిలబడటం కష్టం. తెరాస-మజ్లిస్ ఒకవైపు బిజెపి మరోవైపు యుద్ధం చేస్తాయ్. ఇప్పటికయితే తెరాసకి అనుకూలం. అయితే అభ్యర్ధుల ఎన్నిక,ప్రచార సరళి,ఓటర్ల మనోగతం ఇవన్నీ కలగలిపి పోలింగ్ రోజు దగ్గరపడే కొద్దీ సమీకరణలు జరుగుతాయి. కనీసం ఇంకో వారం పోతేగాని అసలు ఓటరు నాడి ఎలావుందో తెలుసుకోగలం. బీహార్ ఎన్నికలు మొదలయ్యేనాటికి ఎన్డిఎ కి అనుకూలంగా వుంది. పోటీ మొదలైన తర్వాత తేజస్వి యాదవ్ వైపు గాలి మళ్ళింది. మళ్ళీ మోడీ ప్రచారం వుధృతం చేసిన తర్వాత ఎన్నికల సరళి మారింది. చివరకు కాంగ్రెస్ అత్యాశకు ఫలితం వేరే విధంగా వచ్చింది. కాబట్టి 13 రోజులు తక్కువేమీ కాదు. ఏమైనా జరగొచ్చు. వేచి చూద్దాం.

Back to top button