ఆరోగ్యం/జీవనంలైఫ్‌స్టైల్

ఊపిరి స‌మ‌స్య‌కు ఇలా చెక్ పెట్టండి!

క‌రోనా రోగులకు ప్రాణాంత‌కంగా త‌యారైన‌ స‌మ‌స్య‌ల్లో మొద‌టిది ఆక్సీజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోవ‌డం. ఆసుప‌త్రుల్లో చేరిన వారితోపాటు హోం ఐసోలేష‌న్లో ఉన్న‌వారికి సైతం ఇది పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడానికి సైతం ఇదే కార‌ణం అవుతోంది. ఇటు చూస్తే.. మెడిక‌ల్‌ ఆక్సీజ‌న్ అందుబాటులో ఉండ‌ట్లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. శ‌రీరానికి ఆక్సీజ‌న్ అందించే ప‌ద్ధ‌తుల‌ను సూచించింది కేంద్ర ఆరోగ్య‌శాఖ‌. ఈ విధానం ద్వారా.. శ‌రీరంలో ఆక్సీజ‌న్ స్థాయిని పెంచుకోవ‌చ్చ‌ని చెబుతోంది.

కేంద్రం సూచించిన ఈ విధానాన్ని ఇంగ్లీష్ లో ’ప్రోనింగ్‌’ అంటారు. అంటే.. ఒక ప్రత్యేకమైన పొజిషన్లో పడుకొని ఊపిరి తీసుకోవడం అని అర్థం. ఈ పద్ధతి ద్వారా శ్వాస క్రియను మరింతగా మెరుగు పరుచుకోవచ్చని తెలిపింది. ఈ విధానం వైద్యపరంగా ధృవీక‌ర‌ణ పొందింద‌ని ప్ర‌క‌టించింది. మ‌రి, ఆ ప‌ద్ధ‌తి ఏంట‌న్న‌ది చూద్దాం.

1. ముందుగా బెడ్ పై బోర్లా ప‌డుకోవాలి.
2. ఆ త‌ర్వాత మెత్త‌టి దిండు తీసుకొని మెడ భాగంలో పెట్టుకోవాలి.
3. ఛాతి నుంచి తొడ‌ల వ‌ర‌కు ఒక‌టి లేదా రెండు దిండ్లు పెట్టుకోవ‌చ్చు.
4. మ‌రో రెండు దిండ్ల‌ను మోకాలు నుంచి పాదాల వ‌ర‌కు ఉండేలా చూసుకోవాలి.

ఇక‌, ఒకే ప‌ద్ధ‌తిలో కాకుండా.. మ‌రికొన్ని ప‌ద్ధ‌తుల‌ను కూడా అనుస‌రిస్తూ.. వాటిని మారుస్తూ ప్రోనింగ్ కొన‌సాగించొచ్చు. వాటిని ఏ విధంగా పాటించాల‌నేది రెండో చిత్రంలో చూడొచ్చు. ప్ర‌తీ ప‌ద్ధ‌తిలో రెండు గంట‌ల‌పాటు ఉండొచ్చని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

దీనివ‌ల్ల శ్వాస మార్గంపై ఒత్తిడి ప‌డ‌కుండా.. ఫ్రీగా ఆక్సీజ‌న్ శ‌రీరానికి అందుతుంది. అయితే.. క‌రోనా సోకిన ప్ర‌తీవారికి ఈ ప్రోనింగ్ అవ‌స‌రం లేదు. శ్వాస స‌మ‌స్య‌లు త‌లెత్తిన‌ప్పుడు.. ఆక్సీజ‌న్ స్థాయి 94 శాతం క‌న్నా త‌గ్గిన‌ప్పుడు అవ‌స‌రం. అయితే.. ఐసోలేష‌న్లో ఉన్న‌వారు త‌మ శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను, ఆక్సీజ‌న్ స్థాయిని, షుగ‌ర్ లెవ‌ల్స్ ను ప‌రిశీలించ‌డం ఎంతో ముఖ్యం.

ఇక‌, క‌రోనా సోకిన‌వారు ప‌లు జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాలి. భోజ‌నం చేసిన త‌ర్వాత గంట వ‌ర‌కు ప్రోనింగ్ చేయ‌కూడ‌దు. పొట్ట నిండుగా ఉంటుంది కాబ‌ట్టి.. అసౌక‌ర్యంగా అనిపిస్తుంది. ఫ్రీగా అనిపించినంత వ‌ర‌కే ప్రోనింగ్ చేయాలి. క‌ష్టంగా అనిపించిన‌ప్పుడు మానేయాలి. రోజు అత్య‌ధికంగా 16 గంట‌ల‌పాటు ఈ ప్రోనింగ్ చేయొచ్చు. అయితే.. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, వెన్నుముక స‌మ‌స్య‌లు ఉన్నారితోపాటు గ‌ర్భిణులు ఈ ప‌ద్ధ‌తికి దూరంగా ఉండాలి. దిండ్లు అనుకూలంగా ఉండేలా మార్చుకోవాలి.

అ విధానం వ‌ల్ల శ‌రీరంలో ఆక్సీజ‌న్ స్థాయి ఎంతో పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఆక్సీజ‌న్ కొర‌త వేధిస్తున్న ఈ స‌మ‌యంలో.. ఇది చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంటున్నారు. అయితే.. ఈ ప్రోనింగ్ పాటించడానికి మీ శ‌రీరం అనువుగా ఉందా? లేదా? అన్న‌ది చూసుకోవాల‌ని, ద‌గ్గ‌ర్లోని వైద్యుడిని సంప్ర‌దించిన త‌ర్వాత మొద‌లు పెడితే బాగుంటుంద‌ని చెబుతున్నారు.

Back to top button