తెలంగాణరాజకీయాలు

పడిపోయిన హైదరాబాద్ గ్రాఫ్‌.. 2014లో 4వ ర్యాంక్.. ఇప్పుడు 24..

Hyderabad Rank
వీలు దొరికినప్పుడల్లా టీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వ పెద్దలు మన హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని అంటుంటారు. కానీ..అదేంటో ప్రస్తుతం హైదరాబాద్‌లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. 2014లో నివాసానికి అనుకూలంగా ఉన్న సిటీల జాబితాలో నాలుగో స్థానంలో ఉండేది హైదరాబాద్. కానీ.. ఆరేండ్లలో పరిస్థితి నానాటికీ దిగజారింది. 2020 నాటికి 24వ స్థానానికి దిగజారిపోయింది. గురువారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈజ్ఆఫ్లివింగ్ ఇండెక్స్ 2020 నివేదికలో హైదరాబాద్‌కు కనీసం టాప్టెన్‌లోనూ చోటు దక్క లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 111 సిటీలపై గతేడాది జనవరి 16 నుంచి మార్చి 20 వరకు 32.2 లక్షల మంది జనాల అభిప్రాయాలను తీసుకుని కేంద్రం ఈ సర్వే చేసింది.

Also Read: మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు జగన్ గుడ్ న్యూస్

జాబితాలో హైదరాబాద్ కన్నా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మెరుగైన స్థానంలో నిలిచింది. 55.4 ఓవరాల్ స్కోరుతో హైదరాబాద్‌కు 24వ ర్యాంకు దక్కితే.. 57.28 స్కోరుతో విశాఖపట్నం 15వ స్థానంలో నిలిచింది. అయితే.. 2014లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. కానీ.. ఇప్పుడు 20 స్థానాలు కిందకు జారిపోయింది. దక్షిణాది పరంగా చూసుకున్నా హైదరాబాద్‌కు మెరుగైన స్థానం దక్కలేదు. రీజియన్‌లో మొత్తం 8 సిటీలను సర్వేలో కవర్ చేస్తే మన సిటీ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ జాబితాలో బెంగళూరే మొదటి స్థానంలో నిలవగా.. చెన్నై రెండో ర్యాంకు సాధించింది.

క్వాలిటీ లైఫ్, ఆర్థిక స్థితిగతులు, పచ్చదనం, ప్రజాభిప్రాయం అనే నాలుగు అంశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం సిటీల్లో జీవన స్థితిగతులపై సర్వే చేసింది. ఆ నాలుగు విభాగాలనూ సబ్ గ్రూపులుగా విభజించింది. క్వాలిటీ లైఫ్‌లో చదువు, ఆరోగ్యం, ఇల్లు, నీళ్లు-డ్రైనేజీ వసతి, రవాణా సదుపాయం, భద్రత వంటి వాటిని లెక్కలోకి తీసుకుంది. ఆర్థిక స్థితిగతుల్లో ఆర్థికాభివృద్ధి స్థాయి, ఆర్థికావకాశాల ఆధారంగా సర్వే చేసింది. పచ్చదనం విభాగంలో పర్యావరణం, పచ్చదనం-భవనాలు, కరెంట్ వాడకం వంటి వాటిని లెక్కలోకి తీసుకుంది. మొత్తం స్కోరులో 70 శాతం ఈ 3 విభాగాలకు కేటాయించగా.. 30 శాతం స్కోరును ప్రజాభిప్రాయాలకు ఇచ్చింది.

10 లక్షల కన్నా ఎక్కువ మంది ఉన్న సిటీలు, 10 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న సిటీలుగా సర్వేను కేంద్రం విభజించింది. 10 లక్షలపైన జనాభా ఉన్న సిటీల జాబితాలో.. దేశ సిలికాన్ వ్యాలీగా పిలుచుకునే బెంగళూరు మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ సిటీకి మొత్తంగా 66.70 స్కోరు వచ్చింది. తర్వాతి స్థానంలో పూణె నిలిచింది. అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీ ముంబై, కోయంబత్తూరు, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబైలు టాప్ టెన్‌లో నిలిచాయి. ఇక.. పది లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న సిటీల జాబితాలో సిమ్లా ఫస్ట్ ర్యాంకును సాధించింది. ఈ జాబితాలో ఏపీకి చెందిన కాకినాడ నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. అదే సమయంలో తెలంగాణ నుంచి ఒక్క సిటీకీ టాప్ టెన్‌లో చోటు దక్కలేదు. భువనేశ్వర్, సిల్వాసా, సేలం, వెల్లూరు, గాంధీనగర్, గురుగ్రామ్, దావనగెరె, తిరుచురాపల్లిలు టాప్ టెన్‌లో నిలిచాయి. వరంగల్ 19, కరీంనగర్ 22వ స్థానాల్లో నిలిచాయి.

భారీ వానలు పడినప్పుడు ఆ వరద నీటిని మళ్లించే సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా సిటీలో లేదని నివేదిక పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరులోనూ ఆ పరిస్థితి ఉందని వెల్లడించింది. మొన్నటి వరదలతో హైదరాబాద్ జనం ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు చాలా మంది వరద నీటిలోనే బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ నీటిని తొలగించే కనీస చర్యలూ కరువయ్యాయి. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థలతో రోడ్లపైన ఎక్కడికక్కడ నీళ్లు నిలిచాయి. మురికివాడలు అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది ముంబై మహానగరమే. కానీ.. దాంతో పాటు మరికొన్ని సిటీలూ ఆ జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. విశాఖపట్నం, ఆగ్రా, భువనేశ్వర్, లక్నో, పుణె వంటి ప్రధాన సిటీల్లోనూ మురికివాడల్లో బతుకుతున్న వారు ఎక్కువగానే ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు కాకపోవడం వల్లే ఈ పరిస్థితులున్నాయని నివేదిక పేర్కొంది.

Also Read: ఆ వ్యూహంలో భాగమేనా.. శశికళ రాజీనామా..!

సర్వేలో నాలుగో అంశమైన ‘జనం మెచ్చిన సిటీ’ల జాబితాలోనూ హైదరాబాద్ పరిస్థితి అంతంతే ఉంది. ఈ విషయంలో 90 స్థానంలో నిలిచింది. మంచి స్కోరే వచ్చినా హైదరాబాద్ కన్నా ముందు చాలా సిటీలు చోటు సంపాదించాయి. ఓవరాల్‌గా ఈ విభాగంలో హైదరాబాద్‌కు వచ్చిన స్కోరు 70. ఒడిశా రాజధాని భువనేశ్వర్ 94.8 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. 85.4 స్కోరుతో కాకినాడ 8వ ర్యాంకు సాధించింది. విశాఖపట్నం కూడా మన కన్నా ముందే ఉంది. 77 స్కోరుతో 45వ ర్యాంకును దక్కించుకుంది. వరంగల్ కూడా హైదరాబాద్ కన్నా మెరుగైన స్థానంలో నిలిచింది. 72.3 స్కోరుతో 82వ ర్యాంకు సాధించింది.

ఆరోగ్య రంగం విషయంలోనూ హైదరాబాద్‌కు నిరాశే ఎదురైంది. పేరుకు గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ వంటి పెద్ద పెద్ద ఆస్పత్రులున్నా.. ఆయా నెట్‌వర్క్‌లలో అందుతున్న సేవలు అంతంత మాత్రమేనని కేంద్ర నివేదిక వెల్లడించింది. సర్వేలోని 50 శాతం సిటీల్లో ప్రభుత్వం నుంచి అందుతున్న ఆరోగ్య సేవలు 1 శాతం కన్నా తక్కువేనని చెప్పింది. జాబితాలో హైదరాబాద్‌నూ చేర్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన నాణ్యతా ప్రమాణాలను పాటించట్లేదని వెల్లడించింది. ఆయా సిటీల్లో ప్రైవేట్ దవాఖానాల నెట్ వర్క్ ఎక్కువగా ఉందని పేర్కొంది. కొన్ని ఆస్పత్రులు ప్రభుత్వ రూల్స్‌నూ పట్టించుకోవట్లేదని తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం హరితహారం. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నా.. వాటిని కాపాడే బాధ్యతను మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. సిటీలో పచ్చదనం విపరీతంగా తగ్గిపోతోందని వెల్లడించింది. మన సిటీతోపాటు మరికొన్ని సిటీలూ పచ్చదనం, పర్యావరణం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నాయని రిపోర్ట్ వెల్లడించింది. ఆర్థికాభివృద్ధిలోనూ హైదరాబాద్ వెనుకబడుతోందని కేంద్ర నివేదిక పేర్కొంది. మన దగ్గర ఆర్థికాభివృద్ధి దేశ సగటు కన్నా తక్కు వగానే నమోదవుతోందని పేర్కొంది. హైదరాబాద్‌తోపాటు మరో 72 సిటీలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే.. ఆర్థికావకాశాలను సృష్టించుకోవడంలో మాత్రం మన సిటీ మంచి స్థానంలోనే ఉందని నివేదిక పేర్కొంది. ఈ కేటగిరీలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా, బెంగళూరు, హైదరాబాద్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Back to top button