క్రీడలుతెలంగాణ

హైదరాబాద్‌కు లక్కీ చాన్స్.. ఐపీఎల్ వస్తోందా?

IPL
హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో నెలకొన్న విభేదాల కారణంగా ఇక్కడ ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ అంతగా ఆసక్తి చూపలేదు. అయితే.. ఈ విషయంలో నేరుగా తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌‌ రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు పెట్టాలని బీసీసీఐని కోరారు. కానీ.. బీసీసీఐ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎంపిక చేసిన ఆరు వేదికల్లో హైదరాబాద్‌కు చోటివ్వలేదు.

అయితే.. ఇప్పుడు అంతా రివర్స్‌ అయింది. బీసీసీఐనే ఇప్పుడు హైదరాబాద్‌ను బతికిమాలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో ఐపీఎల్‌ పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఐపీఎల్ ప్రారంభోత్సవం జరగాల్సిన ముంబై వాంఖడే స్టేడియం సిబ్బందిలో పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. 14వ తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఓ వైపు వాంఖడే టెన్షన్ ఉండగా.. మరోవైపు మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ లాక్‌డౌన్‌పై నేడో రేపో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో వస్తున్న కరోనా కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముంబైలో ఐపీఎల్ పెట్టడం సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా అందరి చూపు హైదరాబాద్‌పై పడింది. హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి. ఆటగాళ్లందరికీ సరిపడా ఆతిథ్యం ఇవ్వడానికి హోటళ్లుఉన్నాయి. అంతర్జాతీయ స్టేడియం ఉంది. సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్నింటి కంటే కరోనా తీవ్రత ఎక్కువగా ఏమీ లేదు. దీంతో హైదరాబాద్ విషయంలో బీసీసీఐ పెద్దల్లో ఆలోచన ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది.

అయితే.. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఈ సారి కాస్త ఎక్కువగానే ఉంది. ఐపీఎల్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లు కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. ఢిల్లీ ఆటగాడు అక్షర్ పటేల్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చెన్నై ఆటగాడు ఒకరికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముందు ముందు ఇంకెంత మందికి పాజిటివ్‌ వస్తుందో తెలియకుండా ఉంది. ఈ తరుణంలో ఐపీఎల్ ప్రారంభమయ్యే వరకూ నిర్వహణ డౌటే అన్నట్లుగా పరిస్థితి మారుతోంది.

Back to top button