క్రీడలు

IPL 2021: ఐపీఎల్ ఫ్యాన్స్ కు రెండు శుభవార్తలు

ఐపీఎల్-2021 క్రికెట్ మైదానాల్లోకి ప్రేక్షకులను అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయం

కరోనా కారణంగా ఓ ఎంటర్ టైన్ మెంట్ లేదూ పాడూ లేదు. అటు సినిమాలు, ఇటు క్రికెట్ లాంటి ఎంతో ప్రజాదరణ ఉన్న రెండూ ఆగిపోయాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా అందరూ ఇంట్లోనే బందీ అయిపోయారు. ఇంట్లో ఉండి ఉండి నరకం అనుభవిస్తున్నారు. బయటకొద్దామన్నా మొదటి, రెండో వేవ్ అంటూ కరోనా విరుచుకుపడుతూనే ఉంది. ఇప్పటికైతే సెకండ్ వేవ్ తగ్గింది. ఇప్పుడు మూడో వేవ్ కు కాస్త గ్యాప్ వచ్చింది.

ఈ క్రమంలోనే మళ్లీ సినిమాలు, క్రీడలు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 మిగిలిన సీజన్ ను దుబాయ్, ఓమన్ లో నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అయ్యింది. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెకండ్ ఎడిషన్ మ్యాచ్ లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డులు కలిసి గుడ్ న్యూస్ చెప్పాయి. ఐపీఎల్ ఇండియాలో జరిగిన మొన్నటి ఎడిషన్ లో ప్రేక్షకులను మైదానాలకు కరోనా కారణంగా అనుమతించలేదు. అయితే ఐపీఎల్ సెకండ్ షెడ్యూల్ లో యూఏఈలో జరిగే మైదానాలకు ప్రేక్షకులను అనుమతించబోతున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీనికి యూఏఈ ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపింది.

ఇక మరో శుభవార్త ఏంటంటే.. వచ్చే సంవత్సరం 2022 నుంచి ఐపీఎల్ లో ఇప్పుడున్న 8 జట్లను 10 జట్లకు పెంచుతున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. మరిన్ని మ్యాచ్ లు ప్రేక్షకులకు మజా ఇస్తాయని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఆ రెండు టీంలు, ఫ్రాంచైజీలు ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు.

యూఏఈ మైదానాల్లోకి ఐపీఎల్ చూసేందుకు 60శాతం ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తారు. అయితే మ్యాచ్ చూడాలనుకునే ప్రేక్షకులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకొని ఉండాలని కండీషన్ పెట్టారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న అభిమానులు సర్టిఫికెట్ సమర్పిస్తేనే గ్రౌండ్ లోకి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.

Back to top button