క్రీడలు

ఐపీఎల్: పంజాబ్‌ జట్టు ఫామ్‌లోకి ఎందుకు రావట్లేదు..?

IPL: Why Punjab team did not come into form ..?

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లు దుమ్మురేపుతున్నాయి. ఈ ఐపీఎల్‌లో ఎనిమిది జట్లు తలపడుతున్నాయి. అయితే.. అన్ని జట్ల పరిస్థితి ఒకలా ఉంటే.. పంజాబ్‌ జట్టు పరిస్థితి మాత్రం ఇంకోలా ఉంది. గెలవాల్సిన మ్యాచ్‌లనూ రాహుల్‌ టీం చేజేతులా ప్రత్యర్థులకు అప్పగిస్తోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ అవకాశాలపై ఆశలు సన్నగిల్లిన నేపథ్యంలో గతరాత్రి బెంగళూరుపై విజయం సాధించి కాస్త ఆశలు మొలకెత్తించింది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. నిన్న జరిగిన మ్యాచ్‌లోనూ చివరి వరకూ ఉత్కంఠనే కనిపించింది.

Also Read: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న దినేశ్‌ కార్తీక్‌..

ఈ సీజన్‌లో ఢిల్లీతో ఆడిన ఫస్ట్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడింది. 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేలా పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. 157 పరుగులు చేసి టైగా ముగించింది. సూపర్‌‌ ఓవర్‌‌లో ఆడి గెలవాల్సి ఉన్నా.. కేవలం 2 పరుగులకే పరిమితమైంది. తర్వాత రాజస్థాన్‌పై 223 పరుగుల భారీ స్కోర్‌‌ చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించడం ఏ జట్టుకైనా అంత  తేలికేం కాదు. చివరి ఐదు ఓవర్లలో రాజస్థాన్‌ విజయానికి 83 పరుగులు అవసరం ఉండే. కానీ.. పంజాబ్‌ బౌలర్లు పట్టు కోల్పోయారు.

డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేసే కాట్రెల్‌ను రాహుల్‌ తెవాతియా 18వ ఓవర్‌‌లో ఉతికి ‘ఆరే’శాడు. ఐదు సిక్సులు బాది మ్యాచ్‌ స్వరూపాన్నే తనవైపు తిప్పాడు. దాంతో పంజాబ్‌ ఓటమి పాలైంది. ఈ విజయంతో రాజస్థాన్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రికార్డు కూడా సృష్టించింది. ఇక కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో రాహుల్‌ టీం కేవలం 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వీటన్నింటిని చూస్తే ఆ జట్టు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: సన్‌‘రైజ్‌’ కావాలంటే మార్పులు చేయాల్సిందేనా?

తాజాగా.. బెంగళూరుతో రెండోసారి తలపడిన పంజాబ్‌ తేలిగ్గానే విజయం సాధించేలా కనిపించింది. ముందుగా బ్యాంటింగ్‌కు దిగిన కోహ్లి సేన 171 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో ఓపెనర్లుగా వచ్చిన రాహుల్‌ (61*), మయాంక్‌ (45) తొలి వికెట్‌కు 78 పరుగులు చేశారు. మయాంక్‌ ఔటయ్యాక క్రిస్‌గేట్‌ (53)తో జోడీ కట్టిన కెప్టెన్‌ రాహుల్‌.. మ్యాచ్‌ను తేలిగ్గా గెలిపించేలా కనిపించాడు. ఇద్దరూ సిక్సర్లతో హోరెత్తించారు. 18 ఓవర్లలోనే పంజాబ్‌ విజయం సాధిస్తుందని అనిపించింది. కానీ.. ఆఖర్లో బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. చివరగా 18 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన స్థితిలో క్రిస్‌మోరిస్‌ మాయ చేశాడు. ఆ ఓవర్‌‌లో కేవలం నాలుగే పరుగులు ఇచ్చాడు. ఆపై ఇసురు ఉడాన 19వ ఓటర్‌‌లో 5 పరుగులే ఇచ్చాడు. దీంతో చివరి ఓటర్‌‌లో రాహుల్‌ టీం విజయానికి 2 పరుగులే అవసరం అయ్యాయి. కానీ.. ఆ రెండు పరుగులు తీయడానికి కూడా క్రిస్‌గేల్‌, రాహుల్‌ తడబడ్డారు. చివరి బాల్‌ వరకూ ఉత్కంఠను తీసుకొచ్చారు. చాహల్‌ వేసిన ఆ ఓవర్‌‌లో గేల్‌ ఫస్ట్‌ టూ బాల్స్‌ మెడిన్‌ చేశాడు. మూడో బాల్‌కు సింగిల్‌ తీశాడు. దీంతో స్కోర్‌‌ సమమైంది. రాహుల్‌ నాలుగో బంతిని ఆడలేకపోయాడు. ఐదో బంతికి సింగిల్‌ తీసి విజయాన్ని అందుకోవాలని చూశారు. కానీ.. బెంగళూర్‌‌ ఫీల్డర్‌‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ వెంటనే త్రో విసరడంతో గేల్‌ రనౌటయ్యాడు. దీంతో ఒక్కసారిగా పంజాబ్‌ విజయంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరి బంతికి పూరన్‌ సిక్సర్‌‌ బాదడంతో పంజాబ్‌ బయటపడింది.

Back to top button