జాతీయంరాజకీయాలుసంపాదకీయం

మత సామరస్యం సాధ్యమేనా? (Part 2)

దేశం లో మత సామరస్యం సాధ్యమేనా? ( Part1)
దాదాపుగా కరోనా మహమ్మారి రాకముందు మూడు నెలలుగా ముస్లిం సమాజం ఆందోళన లో వుంది. ఇటీవలికాలం లో ఇన్నాళ్ళు సుదీర్ఘంగా మతపరమైన ఆందోళనలు జరగలేదు. ఎవరో కావాలని రెచ్చగొడితే ఇంత విస్తృత పరిధిలో జరగదు. ముమ్మూరు తలాఖ్ వివాదం లో కొంతమేర ఆందోళన జరిగినా ఈ స్థాయి లో జరగలేదు. నిజంగానే ముస్లిం సమాజం లో అశాంతి వుండబట్టే ఇన్నాళ్ళు నిలబడగలిగింది. వాళ్ళ భయాందోళనలలో వాస్తవముందా లేక కేవలం కొంతమంది సృష్టించిన ప్రచారం లో కొట్టుకుపోయారా అనేది లోతుగా పరిశీలించాల్సి వుంది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి రావటంతో ఈ ఘర్షణకు తాత్కాలిక ఫులుస్టాప్ పడింది. ఈ లోపల డిల్లీలో ఎంతోమంది అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పుడైనా ఈ విరామసమయం లో ఈ సమస్యకు పరిష్కార దిశగా అడుగులు పడాల్సి వుంది.

ప్రస్తుత ఆందోళనలు దేనిపై ?

ఈ అల్లర్లు ప్రధానంగా పౌరసత్వ బిల్లు ఆమోదం పొందినదగ్గర్నుంచి మొదలయ్యాయి. పౌరసత్వ బిల్లు భారతదేశం లోని పౌరులకు సంబంధించినది కాదు. బయట దేశాలనుంచి వచ్చి భారతదేశం లో వుంటున్న వాళ్ళలో కొంతమందికి పౌరసత్వం త్వరగా రావటానికి ఉద్దేశించింది. అయితే అది మతపరమైన విచక్షణ చూపుతుందని భారత రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు, మేధావులు , ఇస్లాం మతపెద్దలు నిరసన తెలిపారు. ప్రభుత్వం మాత్రం ఇది రాజ్యాంగ సూత్రాలకు అనుకూలంగానే రూపొందించామని అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఇతరదేశాల్లో వేధింపులకు గురికాబడి ఇక్కడకు పారిపోయి వచ్చిన ఆదేశ మైనారిటీలకు ఇస్తున్నామని దీనితో ఈ దేశ పౌరులకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించింది. ఈ బిల్లు పౌరసత్వం ఇవ్వటానికి మాత్రమే అవకాశం కల్పిస్తుంది కానీ ఎవరి పౌరసత్వం తీసివేయటానికి కాదని వివరణ ఇచ్చింది. అయినా ఈ అలజడి సద్దుమణగ లేదు. దీన్ని జాతీయ జనాభా పట్టిక, జాతీయ పౌరసత్వ పట్టిక ల తో జతచేసి ప్రచారం చేయటం తో ముస్లిం ప్రజలు తమ పౌరసత్వం ప్రమాదం లో పడిందని నిజంగానే ఆందోళనకు గురయ్యారు. ప్రధానమంత్రి స్వయంగా జోక్యంచేసుకొని అసలు జాతీయ పౌరసత్వ పట్టిక తయారి పై ప్రాధమిక చర్చలు కూడా జరగలేదని, ఎటువంటి నిర్దిష్ట విధానం రూపొందకుండానే భయాందోళనలు చెందనవసరం లేదని వివరణ ఇచ్చినా ఆందోళనలు సద్దుమణగ లేదు. ఇందులోని యోగ్యతాయోగ్యతల జోలికి ప్రస్తుతం వెళ్ళటం లేదు. అనేకసార్లు దీనిపై ఇంతకుముందు చర్చించటం జరిగింది. మన ప్రస్తుత చర్చనీయాంశం పైనే ప్రధానంగా దృష్టి సారిద్దాం.

ఈ ఆందోళన వెనక వున్న అసలు కారణాలు 

మోడీ అధికారం లోకి వచ్చినతర్వాత వాళ్ళు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలకు అనుకూలంగా కొన్ని సామాజిక చర్యలకు ఉపక్రమించాడు. అందులో ముఖ్యమైనది ముమ్మూరు తలాఖ్ బిల్లు. మొదటి దఫా అధికారం లోకి వచ్చినప్పుడు ఈ బిల్లు ని ప్రవేశపెట్టినా రాజ్యసభలో మెజారిటీ లేనికారణంగా ఆమోదింప చేసుకోలేకపోయాడు. రెందోదఫా అధికారం లోకి వచ్చిన తర్వాత ఈ బిల్లు ని ఉభయసభల్లో ఆమోదింప చేసి చట్టం చేయగలిగాడు. ఇది ఇస్లామిక్ సంప్రదాయవాదులకు మింగుడుపడలేదు. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా ఆర్టికల్ 370 ని రద్దుచేసి జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర ప్రాంత ప్రాంతాలుగా విడగొట్టారు. ఇదీ సంప్రదాయవాదులకు మింగుడుపడలేదు. ఎప్పటినుంచో అపరిష్కృతంగా వున్న బాబ్రీ మసీదు-రామ మందిర్ వివాదం పై సుప్రీం కోర్టు తీర్పు రావటం అది హిందువులకు అనుకూలంగా రావటం కూడా మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్లు అయ్యింది. అయినా అది సుప్రీం కోర్టు తీర్పు కాబట్టి మిన్నకుండాల్సి వచ్చింది. అలాగే మోడీ ప్రభుత్వం మద్రసాలను నియంత్రణలోకి తీసుకొని ఆధునిక విద్యను ప్రవేశపెట్టటం, ఒంటరిగా స్త్రీలు హజ్ యాత్రకు వెళ్ళే సదుపాయం కల్పించటం కూడా సంప్రదాయ వాదులకు మింగుడుపడలేదు.

వీటితోపాటు ముందు ముందు వుమ్మడి పౌర స్మృతి చట్టాన్ని తీసుకు వస్తామని , బహుభార్యత్వం , నిఖా హలాలా లాంటి సంప్రదాయాల్ని రద్దుచేస్తామని , జనాభా నియంత్రణ చట్టాలు చేస్తామని కొంతమంది బిజెపి నాయకులు ప్రకటనలు చేయటం కూడా ఇస్లామిక్ సంప్రదాయవాదులకు కంటగింపుగా మారింది. ఆ ప్రకటనలు చేసిన నాయకులు అంత ప్రాముఖ్యత గల నాయకులు కాకపోయినా మీడియా వాటికిచ్చిన ప్రచారం మత సమీకరణాలకు మరింత ఆజ్యం పోశాయి.అలాగే మొదటి దఫా అధికారం లోకి వచ్చినప్పుడు జరిగిన గో వధ అల్లర్లు కూడా మత సమీకరణాలకు ఆజ్యం పోసింది. ఇలా ఒక్కొక్కటే పేరుకుపోయి ఇస్లామిక్ సంప్రదాయవాదుల్లో మోడీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కి దారి తీసింది. వీటన్నింటి పర్యవసానమే ఈ ఆందోళనకు ప్రధాన కారణం. సిఎఎ పై ఆందోళన కేవలం ప్రేరణ మాత్రమే.

ఇందులో నిజా నిజాలెంత ?

ఒక్కసారి చరిత్ర లోకి తొంగిచూస్తే స్వాతంత్రంవచ్చిన తర్వాత రాజ్యాంగ మండలి చర్చల్లో సామాజిక మార్పు కోసం, భారత సెక్యులర్ భావాలకు అనుకూలంగా , గుర్తింపు రాజకీయాలకు చరమగీతం పాడటానికి చాలామంది పెద్దలు వుమ్మడి పౌర స్మృతి ని తీసుకురావాలని ప్రయత్నం చేసారు. అయితే ఆ ప్రయత్నం విఫలమయ్యింది. ఆ తర్వాత డాక్టర్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన హిందూ స్మృతి బిల్లు కొంతమేర హిందూ సమాజం లో మార్పులకు దోహదపడింది. రాజరామమోహన రాయ్ , ఈశ్వరచంద్ర విద్య సాగర్ లాంటి సంఘ సంస్కర్తలు , అంబేద్కర్ లాంటి మేధావుల పుణ్యామా అని హిందూ సమాజం లో ఎన్నో మార్పులొచ్చాయి. సతీసహగమనం, బహు భార్యత్వం, బాల్య వివాహాలు, చిన్నతనంలోనే భర్తను కోల్పోతే జీవితాంతం విధవగా గుండుగీయించుకొని తెల్ల వస్త్రాలు ధరించి జీవనం సాగించటం, ఆస్తిలో మహిళకు వాటా లేకపోవటం లాంటి అనేక దురాచారాలనుండి హిందూ మహిళ ఈ రోజు విముక్తయ్యింది. అలాగే నిచ్చెన మెట్ల లాంటి కుల వ్యవస్థ, అంటరాని తనం, దళితులకు దేవాలయ ప్రవేశ నిషిద్దం, విద్యాభ్యాసం కేవలం కొన్ని కులాలకే పరిమితం లాంటి అనేక సాంఘిక దురాచారాలు కూడా చాలావరకు మార్పులకు గురయ్యాయి. ఈ సంస్కరణలు అంత  తేలికగా రాలేదు. సంప్రదాయవాదుల వ్యతిరేకతల నడుమ ఈ మార్పులు జరిగాయని మరిచిపోవద్దు.

అదే ముస్లిం సమాజం లో వున్న కొన్ని దురాచారాల్లో ఇప్పటికీ మార్పురావకపోవటం శోచనీయం. దీనికి ప్రధాన కారణం సంప్రదాయవాదుల పట్టు సమాజం పై అధికంగా వుండటం. ఎటువంటి సంస్కరణలు రావటానికి ఈ వర్గం ఇష్టపడకపోవటం తో ముస్లిం ప్రజలు , ముఖ్యంగా మహిళలు నష్టపోతున్నారు. ముమ్మూరు తలాఖ్ పై ముస్లిం మత పెద్దలు చేసిన రభస ఇంతా అంతా కాదు. దాన్ని ముస్లిం సమాజం పై దాడిగా అభివర్ణించారు. బహు భార్యత్వం , నిఖా హలాలా ఈరోజుకీ కొనసాగుతున్నాయి . ఆస్తి హక్కు లో మహిళకు అన్యాయం జరుగుతూనే వుంది. దేశంలో అత్యంత పేదరికం అనుభవిస్తున్నవారు ఎవరంటే ముస్లిం ప్రజానీకమే. దీనికి కారణం ఎవరు? బిజెపి గత అయిదు సంవత్సరాలనుంచే అధికారం లో వుంది. అంతకు ముందంతా సెక్యులరిస్ట్ లుగా ముద్రపడి ముస్లిం ల పై అతి ప్రేమ ఒలకపెట్టే వారే అధికారం లో వున్నారు. మరి ఎందుకు ముస్లిం లు అందరికంటే కడు పేదరికం లో వున్నారో వారే చెప్పాలి. వాళ్లకు మద్దతిచ్చే మత పెద్దలు కూడా ఇందుకు జవాబుదారే నని మరవొద్దు. ముస్లిం సమాజం లో ఎటువంటి సంస్కరణ తీసుకొచ్చినా ఈ సంప్రదాయవాదులు వ్యతిరేకించటం పరిపాటయ్యింది.

ఇరువైపులా వచ్చిన మార్పులేంటి?

హిందూ సమాజం అదివరకటి కన్నా సంఘటిత మయ్యింది. మత ఆచారాలు పాటించినా పాటించకపోయినా సమస్యపై ఒకటిగా ప్రతిస్పందించటం ఇటీవలి కాలంలో పెరిగింది. ఇది వాస్తవం. బిజెపి అధికారం లోకి రావటం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇదివరకటి మైనారిటీ సంతూష్టీకరణ విధానాలను అనుసరించకపోవటం, తమ ఎన్నికల వాగ్దానాలను పటిష్టంగా అమలు చేయటం లాంటి చర్యలతో హిందూ సమాజం మరింత సంఘటిత మయ్యింది. దీనికి కొంతమేర సాంఘిక మాధ్యమం, టీవీ ప్రచార మాధ్యమం కూడా కారణమే. ముస్లిం సమాజం లో పెరుగుతున్న అతివాద పోకడలు కూడా కొంతమేర హిందూ సమాజం మరింత సంఘటితం కావటానికి దోహదపడింది.

ఇకపోతే ముస్లిం సమాజం లో గత కొన్నిదశాబ్దాలలో ఆలోచనల్లో గణనీయమైన మార్పు వచ్చింది.  చారిత్రకంగా భారత ఉపఖండం సూఫీ ఇస్లాంకి పుట్టినిల్లు. ముస్లిం రాజులు  రాజ్యాలు జయించినా ప్రజాబాహుళ్యం లో ఇస్లాం మతాన్ని దగ్గరకు చేర్చింది సూఫీ తత్వవేత్తలు, ప్రచారకులే. అందుకే మన దేశం లో మసీదులు కన్నా దర్గాలు ఎక్కువ. కానీ ఇటీవలి కాలం లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. సౌదీ వహాబిజం మన దేశం లో త్వరితంగా విస్తరిస్తుంది. ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో సూఫీ మసీదులు ఒక్కొక్కటి వాహబ్బి మసీదులుగా మారుతున్నాయి. ఈ పరిణామం గత కొన్ని దశాబ్దాలుగా గల్ఫ్ డబ్బులతో జరుగుతుంది. ఇది ఉదారవాద , బిజెపి వ్యతిరేక ఇంగ్లీష్ ఛానలు గా పేరుపడిన ఎన్ డి టీవీ 24/7 లో శ్రీనివాస్ జైన్ పరిశోధన  జరిపి రెండు భాగాలుగా కొన్ని సంవత్సరాల కింద ప్రచారం చేసింది. ఇంత విపులంగా ఇది వుదహరించటానికి కారణముంది. సలాఫీ ఉద్యమం పేరుతో ఎటువంటి మార్పులు చేయకుండా 7 వ శతాబ్దం లో మహమ్మద్ ప్రవక్త చెప్పినవి, ఖురాన్ లో వున్నవి ఖచ్చితంగా అమలుచేయాలనే ప్రచారం వాహబిజం ద్వారా వ్యాప్తిచెందటం కొన్ని అనర్ధాలకు దారి తీస్తుంది. మారిన సామాజిక మార్పుల కనుగుణంగా ఇస్లాం సమాజం లో వచ్చిన మార్పుని ఈ వహాబిజం తిరస్కరిస్తుంది. ఇస్లాం భారత్ కి వచ్చేటప్పటికి ఇక్కడి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చెందిన మార్పులను ఒప్పుకోదు. చివరకు వాళ్ళు దర్గాలను కూడా ఇస్లాం వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. షియాలను , ఇతర ఉప తెగలను ఇస్లామేతర సిద్ధాంతాలుగా ప్రచారం చేస్తుంది. మత వుద్రిక్తలు పెరగటం లో ఈ మారిన ఆలోచన కూడా వుందనేది ఒక వాదన.                                                                                                                                                                                                                                                                                                                                       బిజెపి అధికారం లోకి వచ్చిన తర్వాత  ఆ పార్టీకి చెందిన కొంతమంది  నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేయటం , వాటిని పార్టీ ఖండించక పోవటం కూడా ఇస్లాం సమాజం లో ఆందోళనకు , సంఘటితం కావటానికి కారణమయ్యింది. అధికారం లో వున్న పార్టీ మరింత భాధ్యతా యుతంగా వ్యవహరించి కింది నాయకులను కట్టడి చేసి వుండాల్సింది.మూడోది మనం ఇంతకుముందు మాట్లాడుకున్న సంప్రదాయవాదుల సంస్కరణల వ్యతిరేకత. వీటిలో చివరకు విద్యావేత్తలు కూడా ప్రభావితం కావటం సమాజం రెండుగా మానసికంగా విడిపోవటం ఇటీవలి కాలం లో జరిగిన పరిణామం.

ప్రభుత్వం ఏం చేసి వుండాల్సింది?

ముస్లిం సమాజం లో ఎటువంటి సంస్కరణ తీసుకొచ్చినా సంప్రదాయవాదుల నుంచి పెద్ద ప్రతిఘటన వస్తుందని ప్రభుత్వానికి తెలుసు. అటువంటప్పుడు సంప్రదింపుల ప్రక్రియను ముమ్మరంగా చేసి వుండాల్సింది. ఏ మాత్రం తటస్థంగా వున్న వాళ్ళను కూడా సంప్రదింపుల్లో భాగస్వాములను చేసివుండాల్సింది. బిజెపి మిత్ర పక్షాలనే పూర్తి సంప్రదింపుల్లో భాగస్వామ్యం చేయకపోవటం కూడా లోపంగా భావించాలి. అలాగే ప్రజా సంబంధాల ప్రక్రియను ఇంకా సమర్ధంగా చేయాల్సింది. ముస్లిం లలోని అతి పేద వర్గాలకు ప్రత్యెక ప్యాకేజి ప్రకటించటం కూడా ఇందులో భాగంగా వుండాల్సింది. అన్నింటికన్నా ముఖ్యంగా మంత్రులుగా వున్న వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టే ప్రకటనలు ఇస్తున్నప్పుడు వాళ్ళను మందలించటం అవసరమైతే క్రమశిక్షణా చర్యలు తీసుకొని వుంటే బాగుండేది. ఎందుకంటే ప్రభుత్వం లోని అతి ముఖ్యులు అటువంటి ప్రకటనలు ఎప్పుడూ ఇవ్వకపోయినా మంత్రివర్గ సహచరులు రెచ్చగొట్టే ప్రకటనలు ఇచ్చినప్పుడు మందలించక పోవటం కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయని మరిచిపోవద్దు.

మొత్తం మీద తిలా పిడెకడు తలా కొంచెం లాగా అందరూ కలిసి సామాజిక ఉద్రిక్తతలు పెరగటానికి దోహదం చేశారు. అవే చివరకి చిలికి చిలికి గాలివాన లాగా అయ్యాయి. డిల్లీ నిరసనలు పైకి కనబడేటట్టు సిఎఎ వ్యతిరేక నిరసనలు కాదు. ఇన్నాళ్ళు గూడుకట్టుకున్న అపార్ధాలు, అనుమానాలు , భయాలు కలగలిపి పెల్లుబికాయని చెప్పొచ్చు. మరి దీనికి తాత్కాలికంగా కరోనా మహామ్మరితో తెరపడినా తిరిగి మళ్ళీ రాజుకోదని గ్యారంటీ ఏమీ లేదు. ఈ లోపలే దీనికి తగు పరిష్కారం కనుగొనాలి. అది ఎలా? ఎవరు చేయాలి? ఏయే  పాత్రధారులు, సూత్రధారులు ఈ పరిష్కారానికి అవసరం?

( సశేషం)