జాతీయంరాజకీయాలుసంపాదకీయం

మత సామరస్యం సాధ్యమేనా ? ( Part 3)

ఇంతకుముందు వ్రాసిన రెండు భాగాలలో ప్రధానంగా హిందూ-ముస్లిం మతాలు, వాటి వివరాలు, ఆలోచనా సరళి గురించే  చర్చించుకోవటం జరిగింది. కానీ ఇందులో ఇంకో పాత్రధారి  క్రైస్తవమతం గురించి విశ్లేషించు కోవటం జరగలేదు. దీనిపై కూడా సమగ్ర అవగాహన లేకుండా మత సామరస్యం గురించి మాట్లాడుకోలేము. ఈ భాగం లో భారత్ లో  క్రైస్తవమతం ఉనికి, వ్యవహారశైలి గురించి చర్చించుకుందాం.

భారత్ లో క్రైస్తవమత పుట్టుపూర్వోత్తరాలు 

భారత్ లో క్రైస్తవ ప్రవేశం క్రీస్తు శకం మొదటి శతాబ్దం లోనే జరిగింది. మలబారు తీరం దీనికి ఆశ్రయమిచ్చింది. వీళ్ళు ప్రస్తుత సిరియా, ఇరాక్ ప్రాంతం నుంచి వచ్చారు. ఇప్పటికీ వీరిని సిరియన్ క్రైస్తవులుగా పిలుస్తారు. ఆ తర్వాత దాదాపు 14 శతాబ్దాలు దీని చాయలు లేవు. తిరిగి వాస్కోడిగామా భారత్ యాత్రతో క్రైస్తవం కూడా వచ్చింది. ప్రధానంగా పోర్చుగీసు వారి ద్వారా పశ్చిమతీరం లో వ్యాప్తిచెందింది. ఆ తర్వాత డచ్, ఫ్రెంచ్ వారు కూడా క్రైస్తవ మత వ్యాప్తికి తోడ్పడ్డారు. 1600 తర్వాత బ్రిటిష్ వారి ప్రవేశంతో మిగాతాదేశాల ప్రభావం తగ్గింది. కానీ బ్రిటిష్ వారు 1757 ప్లాసీ యుద్ధం వరకూ పెద్దగా మతవ్యాప్తి పై దృష్టి సారించలేదు. వాస్తవానికి 1813, 1833 బ్రిటిష్ చార్టర్ చట్టాల తర్వాతే పూర్తిగా మిషనరీ సంస్థలు కార్యకలాపాలు పెద్దఎత్తున కొనసాగించాయి. మొదట్లో రోమన్ కాథలిక్ చర్చిలు, తర్వాత ఆంగ్లికన్, ప్రొటెస్టెంట్  చర్చిలు ప్రధాన భూమిక పోషించాయి. 1857 ప్రధమ స్వాతంత్ర పోరాటం తర్వాత పరిపాలన బ్రిటిష్ రాణి ప్రత్యక్ష పరిపాలన కిందకు వచ్చింది. ఈ తిరుగుబాటు కి మత వ్యవహారాలుకూడా ఒక కారణమని గుర్తించింది. మతం విషయంలో తటస్థ వైఖరి అవలంబిస్తామని ప్రకటించింది. కొన్నాళ్ళు దానితో మత ప్రచారం ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ మిషనరీ లు మళ్ళీ పెద్దఎత్తున కార్యకలాపాలు సాగించాయి. భారత పశ్చిమ, తూర్పు కోస్తా తీరం లోని కేరళ, కొంకణ్, తమిళనాడు , ఆంధ్ర ప్రాంతాలు ఈ కార్యకలాపాలకు కేంద్ర మయ్యాయి.

దేశంలో మత కార్యక్రమాలు ప్రొటెస్టెంట్ సంస్థలు ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలనుంచి రావటంతో ముమ్మరమయ్యాయి. 20 వ శతాబ్దం నుంచి ఈ కార్యక్రమాలు మరింత వేగం పుంజుకున్నాయి. దేశం లో దక్షిణాన , ఈశాన్య భారతం లో క్రైస్తవమతం బాగా వ్యాప్తి చెందింది. దక్షిణాన వుమ్మడి మద్రాసు లోని తమిళనాడు, ఆంధ్ర కోస్తా తీరం, రాయలసీమ లలో కార్యకలాపాలు జోరందుకున్నాయి. మొదట్లో ఆంధ్ర లో అగ్రకులాల వారు ఆకర్షించ బడగా తర్వాత దళితులు పెద్ద సంఖ్యలో చేరారు. అదే ఈశాన్య భారతం లో 1931-51మధ్య , ముఖ్యంగా 41-51 మధ్య ఎక్కువమంది క్రైస్తవమతం లోకి మారారు. 1951 కల్లా మిజోరాం లో దాదాపు 80 శాతం పైగా చేరారు. అలాగే ఆదివాసీ జనాభా ఎక్కువగా వున్న నాగాలాండ్, మేఘాలయ లలో కూడా స్వాతంత్రం వచ్చేనాటికి గణనీయంగా చేరారు. మొత్తం మీద చూస్తే స్వతంత్రం వచ్చేనాటికి దక్షిణాదిలో, ఈశాన్యం లో గణనీయంగా క్రైస్తవ జనాభా పెరిగింది.

స్వాతంత్రానంతర మత వ్యాప్తి 

దేశ స్వాతంత్రానంతరం పెద్ద ఎత్తున మత  మార్పిడులు జరిగింది క్రైస్తవమతం లోకే. కానీ మత ఘర్షణలు ఎక్కువగా హిందువులకు, ముస్లింలకు మధ్య జరిగినా, ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నా ఒకమతం నుంచి రెండో మతం లోకి మార్పిడులు లేవు. అదే చాపకింద నీరులాగా మత మార్పిడులు జరిగింది, జరుగుతున్నది క్రైస్తవ మతం లోకి. దీనికి కారణాలు అన్నిచోట్లా ఒకలాగా లేవు. ఈశాన్య భారతం లో ఆదివాసీలు ఎక్కువ వున్న చోట మతమార్పిడులు వేగంగా , విస్తారంగా జరిగాయి. స్వాతంత్రం వచ్చేటప్పటికి మిజోరాం లోనే దాదాపు మొత్తం క్రైస్తవం లోకి మారారు. ఆ తర్వాత నాగాలాండ్ లో వేగంగా చర్చి విస్తరించి 1951 లో సగం వుంటేఇప్పుడు  90 శాతానికి చేరింది. మేఘాలయ లో ప్రస్తుతం 75శాతానికి మత వ్యాప్తి జరిగింది. మణిపూర్ లో 1951లో 12 శాతం వుంటే ఇప్పుడు హిందువులతో సమానంగా 41 శాతానికి చేరింది. అంటే మణిపూర్ లోయలోని హిందువులు తప్ప బయటవున్న ఆదివాసు లందరూ చేరారు. 1971 లో అరుణాచల్ ప్రదేశ్ సివిల్ పరిపాలన కిందకు వచ్చేటప్పటికి అసలు క్రైస్తవులు లేరు. బుద్ధిస్టులు మెజారిటీ లో వుండేవారు. అటువంటిది ఇప్పుడు అన్నింటికన్నా పెద్ద మతం క్రైస్తవ మయ్యింది. హిందువులు మెజారిటీగా వున్న అస్సాం లో క్రైస్తవం పెద్దగా వ్యాప్తి చెందలేదు. అక్కడా ఆదివాసీ ప్రాంతాల్లోనే మత వ్యాప్తి జరిగింది. 1970 దశకం లో భారత్ లో చేరిన ఇంకో ఆదివాసీ రాష్ట్రం సిక్కిం లో త్వరితగతిన విస్తరిస్తుంది. 1971 లో 0.8 శాతం వుంటే  2011 కి 10 శాతానికి పెరిగింది. ఆశ్చర్యంగా త్రిపుర లో 30 శాతం ఆదివాసులున్నా పెద్దగా విస్తరించలేదు. మొత్తం మీద చూస్తే స్వాతంత్రానంతరం అతి వేగంగా ఈశాన్య భారతం లో క్రైస్తవమత మార్పిడులు జరిగాయి. అయితే దక్షిణాది లో లాగా హిందూమతం లోని కుల వివక్షకు గురై ఇక్కడ మత మార్పిడి జరగలేదు. ఆదివాసీ లు గుంప గుత్తగా చేరారు. దీనివెనక మత సంస్థలతో పాటు స్వయంగా క్రైస్తవరాలైన సోనియా గాంధీ రాజకీయ మద్దత్తు పూర్తిగా వుందని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్రానంతరం విస్తృతంగా వ్యాప్తిచెందింది. దళితుల్లో దాదాపుగా అందరూ క్రైస్తవ మతం లోకి మారారు. ఇటీవలి కొన్ని దశాబ్దాల్లో ఉత్తర ఆంధ్ర లోని ఆదివాసుల్లో ఎక్కువభాగం క్రైస్తవమతం పుచ్చుకున్నారు. ఇదంతా చాపకింద నీరు లాగా పెద్ద గా మీడియా లో ప్రచారం కాకుండా జరిగిపోతుంది. అదే తెలంగాణాలో ఇంత స్థాయిలో మత మార్పిడి జరగలేదు. తమిళనాడు లో కూడా ఆంధ్రలో లాగే దళితుల్లో , ఆదివాసుల్లో విస్తారంగా మత వ్యాప్తి జరిగింది. ఈరోజుకీ ఆంధ్రలోని  గ్రామాల్లో క్రైస్తవ మత సంస్థల ప్రచారం జోరుగా సాగుతుంది. స్వాతంత్రానంతరం దేశ పశ్చిమప్రాంతం లోని మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ సరిహద్దులోని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా క్రైస్తవ మిషనరీల ప్రచారం జరుగుతుంది. భిల్లు జాతికి చెందిన ఈ ఆదివాసులు చరిత్రలో ముస్లిం పాలకులను, ముఖ్యంగా మొఘలాయిలను దీర్ఘకాలం ఎదిరించి వీరోచిత పోరాటాలు చేసిన వారు. వారు ప్రస్తుతం క్రైస్తవ మత వ్యాప్తి లో పాత్రదారులయ్యారు. ఇటీవల ఇద్దరు హిందూ సాధువులను దారుణంగా చంపిన పాల్ఘార్ ప్రాంతం ఈ ప్రాంతానికి చెందినదే. ఇందులో పాల్గొన్నది ఈ భిల్ జాతి గిరిజనులే నని వార్తలొస్తున్నాయి. ఝార్ఖండ్, ఒరిస్సా, చత్తీస్ గడ్ లోని ఆదివాసుల్లో కూడా క్రైస్తవమత వ్యాప్తి గణనీయంగా జరిగింది, జరుగుతుంది. అదే అక్కడ మత ఘర్షణలకు దారితీస్తుంది. అదే సమయం లో ఉత్తర భారతం లో క్రైస్తవ మత వ్యాప్తి అంత గణనీయంగా జరగలేదు. దళితుల్లో ఎక్కువమంది ఇప్పటికీ హిందువులుగానే వున్నారు.

అంబేద్కర్ – బౌద్ధం 

ఇక్కడే అంబేద్కర్ ఉదంతాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. హిందూ సమాజం లో వున్న కుల వివక్ష కు వ్యతిరేకంగా జీవితాంతం పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్. జీవితం చరమాంకంలో 1946లో బౌద్ధ మత దీక్ష తీసుకున్నాడు. ఆయనతో పాటు అనేకమంది దళితులు  మహారాష్ట్రలో బౌద్ధమతంలోకి మారారు. దురదృష్టవశాత్తూ ఆ తర్వాత నాలుగు నెలలకే అంబేద్కర్ మరణించాడు. దానితో బౌద్ధ మత విస్తరణ కూడా ఆగిపోయింది. ఇక్కడో విషయం ప్రస్తావించాల్సి వుంది. అంబేద్కర్ హిందూ మతం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ మతం లో చేరతాడనేది పెద్ద ప్రశ్నగా మారింది. కుల వివక్ష కు గురైన దళితులు దక్షినాదిన పెద్ద ఎత్తున క్రైస్తవం లో చేరటం తో ఎక్కువమంది క్రైస్తవం లో చేరతాడని ఊహించారు. క్రైస్తవ మత పెద్దలతో పాటు ఇస్లాం మత పెద్దలు కూడా అంబేద్కర్ ని కలిసి తమ మతాల్లోకి ఆహ్వానించారు. కానీ వాళ్ళ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ బౌద్ధమత దీక్ష తీసుకున్నాడు. దానికి కారణాలు కూడా చెప్పాడు. తను ఇంకొంతకాలం బతికుంటే బౌద్ధమత విస్తరణ జరిగివుండేది.

ఆ తర్వాత ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితుడైన కాన్షిరామ్ సామాజిక కార్యకలాపాల నుండి 1980 దశకం లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి బహుజన  సమాజ్ పార్టీ ని స్థాపించి ఓ పెద్ద సామాజిక విప్లవాన్నే సృషించాడు. తను చివరలో 2006 సంవత్సరం లో పెద్ద ఎత్తున 50 లక్షల మందితో బౌద్ధమత దీక్ష తీసుకుందామని నిర్ణయించుకొని నిర్ణీత సమావేశ తేదీకి 5 రోజులముందు మరణించాడు. అనుకున్నప్రకారం ఆ సమావేశం జరిగివుంటే బౌద్ధమతం ఉత్తర భారతం లో విస్తరించి వుండేది. ఆయన వారసురాలు మాయావతి మత మార్పిడులపై మాట మార్చింది. ఇప్పుడు చేరితే కొద్దిమందిగానే మిగులుతాం , కేంద్రం లో అధికారం లోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అందరినీ బౌద్ధం లోకి మారుస్తామని అప్పటివరకు మత మార్పిడి కార్యక్రమం ఉండదని చెప్పింది. ఆ విధంగా రెండోసారి వచ్చిన అవకాశం చేజారింది. అదేజరిగివుంటే దాని ప్రభావం క్రైస్తవ మతం లోకి మారిన దక్షిణాది దళితులపై కూడా వుండి  వుండేదేమో. అంబేద్కర్ ఆశయాలకు అంకితమైన ప్రజానీకం ఆ విధంగా ప్రస్తుతం క్రైస్తవులుగా, హిందువులుగానే వుండిపోయారు. బౌద్దులుగా మారలేదు. కేవలం లక్నో లో అంబేద్కర్ స్మృతి చిహ్నంగా వెలసిన రాతి కట్టడాల పార్కులో మాత్రమే బౌద్ధం బందీ అయ్యింది. విస్తృత ప్రజానీకం లోకి రాలేకపోయింది. ఈ పరిణామం ఓ విధంగా దళితుల్లో క్రైస్తవాన్ని సుస్థిరం చేసిందని చెప్పొచ్చు, ముఖ్యంగా దక్షిణాదిలో.

క్రైస్తవ మత విస్తరణకు ప్రధాన కారణాలు 

మొత్తం మీద చూస్తే క్రైస్తవమత వ్యాప్తి భారతం లో కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువగా వ్యాపించింది. దేశవ్యాప్తంగా గిరిజనుల్లో క్రైస్తవం స్థానం సంపాదించ గలిగింది. ఆదివాసులు నిజానికి ఒకమతానికి సంబంధించిన వాళ్ళుగా చెప్పలేము. వాళ్ళ మత విశ్వాసాలు వేల సంవత్సరాలనుంచి ప్రత్యేకంగా ఉండేవి. అదే సమయం లో అవి భారతీయ మూలాల తోనే ఉండేవి. కొన్నింటిలో హిందూ సంప్రదాయాలకు దగ్గరగా వున్నా పూర్తిగా ప్రధాన హిందూ విశ్వాసాలతో మమేకమయి లేవు. ఈ ప్రత్యేక మతాచారాలు , వాళ్ళలోని వెనకబాటుతనం సమాజానికి , అభివృద్ధికి దూరంగా వుండటం క్రైస్తవ మత ప్రచారకులకు కలిసివచ్చిందని చెప్పొచ్చు.

అలాగే దక్షిణాదిన హిందూ సమాజం లో అంటరాని తనానికి గురై ఆత్మ న్యూనత తో బాధపడుతున్న దళితులకు క్రైస్తవ మతం గొప్ప స్వాంతన నిచ్చింది. క్రైస్తవ మత ప్రచారకులు ఈ సామాజిక దురాచారాన్ని తెలివిగా మత విస్తరణకు వుపయోగించుకోగలిగారు. అదేపని ఉత్తర భారతం లో చేయలేకపోయారు. అక్కడ ఎప్పుడూ హిందూ-ముస్లిం ఘర్షణలతో సమాజం సమీకరించ బడటం, ఎక్కువభాగం బ్రిటీష్ ప్రత్యక్ష పరిపాలనలో లేకపోవటం , దక్షిణాదిలో లాగా అంత చిత్తశుద్ధితోపనిచేసే ప్రచారకులు లేకపోవటం, హిందూ మత భావాలు బలంగా వుండటం, ముస్లిం లు కూడా అంతే బలంగా తమ మత విశ్వాసాలను నమ్మటంతో ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో క్రైస్తవం వేల్లూనుకోలేక పోయింది. దానితో పాటు దళితుల్లో నుంచి వచ్చిన రాజకీయ నాయకులు  కూడా అక్కడ ఎవరూ క్రైస్తవం వైపు మొగ్గకపోవటం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.

క్రైస్తవ మత విస్తరణలో సామాజిక కార్యక్రమాలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. విద్య, వైద్య రంగాల్లో అనేక స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు స్థాపించటం క్రైస్తవ మతంపై సానుకూల వాతావరణం కల్పించింది. బ్రిటీష్ ప్రభుత్వ సహాయ, సహకారాలు కూడా కారణమే. వీటన్నింటితో పాటు అమెరికా , యూరప్ నుంచి వచ్చిన, వస్తున్న నిధులు కూడా ప్రధాన కారణం. ముస్లిం పాలకులు దౌర్జన్యంతో సాధించలేనిది లౌక్యంతో క్రైస్తవ మత ప్రచారకులు సాధించటం లో కొంతమేర సఫలీ కృత మయ్యారు. ఏది ఏమైనా అటు వెయ్యి సంవత్సరాల ముస్లిం దాడులు, పరిపాలన ,  ఇటు దాదాపు 500 సంవత్సరాల క్రైస్తవ మత ప్రచారం కూడా భారత్ లోని మెజారిటీ ప్రజల్ని తమ మతాన్నుంచి మార్చలేకపోయినవనేది చారిత్రక సత్యం. అంటే దాదాపు 1500 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులెదురైనా ప్రజలు తమ మత విశ్వాసాలను కాపాడుకుంటూ వచ్చారు. అదే పర్షియా, మిగతా పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా లలో చాలా తేలికగా ఇస్లాం మత వ్యాప్తి జరిగింది. అలాగే యూరప్ మొత్తం క్రైస్తవానికి మారింది. ఆ మార్పునకు గురికాకుండా నిలబడింది భారత్ ఒక్కటే. ఇది ఇంకా లోతుగా సామాజిక శాస్త్ర వేత్తలు పరిశోధించాల్సిన అంశం.

అయినా దేశం లో మత ఘర్షణలు జరుగుతున్న వాటిలో హిందూ- క్రైస్తవ ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. క్రైస్తవులపై హిందువుల దాడులు, హిందువులపై  క్రైస్తవుల దాడులు ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న సంఘటనలు అనేకం వింటున్నాము. ఇంతకుముందే చెప్పినట్లు ఇటీవల  పాల్ఘార్లో జరిగిన ఇద్దరు సాధువుల హత్య ఇందులో భాగంగానే చెప్పొచ్చు. మరి దీనికి కారణాలేమిటి , ఇందుకు పరిష్కార మార్గాలేమిటి లాంటి అనేక విషయాలు వచ్చే భాగం లో మాట్లాడుకుందాం.

( సశేషం)