జాతీయంరాజకీయాలుసంపాదకీయం

మత సామరస్యం సాధ్యమేనా? ( Part 5 )

ఇంతకుముందు ఇస్లాం, క్రైస్తవ మతాల గురించి క్లుప్తంగా చర్చించుకున్నాం. ఇప్పుడు భారత్ లో ఎక్కువమంది విశ్వసించే హిందూ మతాన్ని గురించి కూడా వచ్చే కొన్ని భాగాల్లో క్లుప్తంగా చర్చించుకుందాం. ఈ వ్యాస పరంపర మొదలుపెట్టినప్పుడు కేవలం అతి క్లుప్తంగా రెండు భాగాల్లో నా అభిప్రాయాల్ని వ్యక్తం చేద్దామనుకున్నాను. కానీ తర్వాత ఆలోచనా ధోరణి మారింది. ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న అతి పెద్ద క్లిష్టమైన సమస్య ఇదే కావటంతో అభిప్రాయాన్ని మార్చుకొని ఇంకొంచెం విపులంగా చర్చించుకోవాల్సి వచ్చింది. అందుకనే మొదటి భాగాల్లో కంటే తర్వాత దశలో క్రైస్తవంపై మరింత విపులంగా వుంది. ఇకపోతే హిందూమతం దాదాపుగా 75 శాతం  మంది ( నా అంచనా ప్రకారం అంతకూడా లేదు, వివరణ ఇంతకుముందు భాగాల్లో ఇచ్చాను ) అనుసరిస్తున్నారు కాబట్టి మరింత వివరంగా ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. హిందూ మత సిద్ధాంతాన్ని గురించి వివరించటం పెద్ద సాహసమే అవుతుంది, ఎందుకంటే అది ఓ పట్టాన అర్ధం కావటం తేలిక కాదు కాబట్టి. అయినా నా వంతు ప్రయత్నం చేస్తాను.

హిందూ మత పుట్టు పూర్వోత్తరాలు

క్రైస్తవం లాగానో, ఇస్లాం లాగానో హిందూ మత పుట్టుకకు ఒక తేదీని, సంవత్సరాన్ని గుర్తించటం అసాధ్యం. అసలు ఎన్ని ఏళ్ళ నుంచి వుంది అనే దానిపై కూడా ఏ ఇద్దరు చరిత్రకారుల అభిప్రాయాలు ఒకటిగా లేవు. అందుకనే వర్తమానంలో మనుగడ సాగిస్తున్న ప్రపంచంలోని అత్యంత  సనాతన ధర్మంగా చెప్పుకుందాం. వాస్తవానికి హిందూ మతమనేది ఇటీవలి ఆధునిక చరిత్రలో పెట్టిన పేరు. దీన్ని వైదిక మతంగా, సనాతన ధర్మంగా, బ్రాహ్మణ మతంగా చెప్పిన ఉదాహరణలు చరిత్రలో వున్నాయి. అయితే  ప్రస్తుతం వాడుకలోకి వచ్చిన హిందూమతంగానే మాట్లాడుకుందాం. ఈ మతానికి సంబంధించి మనకు అందుబాటులో వున్న అత్యంత పురాతన సాహిత్యం వేదాలు. దాని గ్రంధకర్త ఎవరో తెలియదు. ఎన్నో వందల ( వేల ) ఏళ్ళు అనుశ్రుతి గా వస్తున్న వాటిని క్రోడీకరించి ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం వేద వ్యాసుడు. వీటికి వ్యాఖ్యానంగా తరువాత వెలువడినవి బ్రాహ్మణికాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు . ఆ తర్వాత వెలువడినవి అష్టాదశ పురాణాలు. వీటన్నింటికన్నా అత్యంత ప్రజాదరణ పొందినవి రామాయణ , మహాభారత , భాగవత ఇతిహాసాలు. అవి కొన్ని వేల  ఏళ్ళనుంచి హిందువుల నిత్య జీవితం లో భాగమయ్యాయి. అలాగే గీతోపదేశం కూడా అత్యంత పవిత్రమైన , ప్రజాదరణ పొందిన గ్రంధం.

విజ్ఞానపరంగా చూస్తే పంచాంగం కాలాన్ని లెక్కించటం లో అప్పటి కే అత్యంత అభివృద్ధి చెందిన శాస్త్రం. అది చెప్పే ముహూర్తాలపై అందరికీ ఏకాభిప్రాయం లేకపోయినా, కాలాన్ని లెక్కించటం లో ఆ రోజులకే కాక ఈ రోజుకీ ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వటం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. గత చరిత్ర కాలాన్ని అంచనా వేయటం లో ఈ పంచాంగాన్ని అందులోని తిధులు, నక్షత్రాల ఆధారంగా ఎందుకు అంచనా వేయటంలేదో అర్ధంకాదు. రామాయణ, మహాభారత కాలాలతో పాటు బుద్ధుని కాలాన్ని, హిందూ రాజుల పరిపాలనా కాలాన్ని అంచనా వేయటం లో ఈ పంచాంగం ఎంతగానో వుపయోగపడుతుంది. ఇటీవలికాలంలో వీటిపై పరిశోధనచేసి వీటి కాలాన్ని చాలామంది ప్రచురించారు. వాటిని పుక్కిటి పురాణాలుగా కొట్టేయకుండా తిరిగి కాలాన్ని పునపరిశీలించటం అవసరం. అలాగే ఖగోళ శాస్త్ర విజ్ఞానంలో మన మిగతా పురాతన శాస్త్రవేత్తలు అద్భుతమైన ప్రగతిని సాధించారు.  ఇక వైద్య పరంగా ఆయుర్వేదం సాధించిన ప్రగతిని గురించి చెప్పాల్సిన పనిలేదు.

అన్నింటికన్నా విశ్వవ్యాప్తి చెందిన యోగా , ధ్యానం హిందూ మతానికి సంబందించినవే . ఇవి అత్యంత ప్రాచీన హిందూ ధర్మాలు. యోగాభ్యాసం అప్పటికీ , ఇప్పటికీ నిత్య నూతనమే. ఈ రోజు యోగా ప్రపంచం ఆమోదించిన హిందూ ధర్మమని చెప్పొచ్చు. అదే స్థాయి లో బహుళ ప్రాచుర్యం పొందింది ధ్యానం. బుద్ధుడు ధ్యానానికి మూలం సనాతన ధర్మం లోని మూలాలే నని మరిచిపోవద్దు. ఈ రెండూ ప్రపంచానికి హిందూ ధర్మం ప్రసాదించిన బహుమతులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది.  ఇది ఇంతటితో ఆపేద్దాం. దీనిలో సారాంశమేమిటంటే హిందూ మతం సాహిత్యపరంగా , వారసత్వ పరంగా , నాగరికత పరంగా, శాస్త్ర పరంగా ఎంతో అభివృద్ధి చెందినదిగా చెప్పొచ్చు. చరిత్రకు కావాల్సిన ఎన్నో వేల గ్రంధాలు , గ్రంధాలయాలు, దేవాలయాలు  తగలబెట్టబడటం మనందరికీ తెలిసిందే. అవే వుండివుంటే మన చరిత్ర పై ఇంకా స్పష్టమైన వెలుతురూ ప్రసరించి వుండేది. దానితో పాటు చారిత్రక విషయాల్ని కొత్తగా వెలుగులోకి తీయటం లో గత 73 సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ పురోగతి లేదు.  అది ప్రభుత్వానికి ప్రాధాన్యతా అంశం కాకపోవటం కూడా దురదృష్టకరం. ఇక హిందూ తత్వ శాస్త్రాన్ని గురించి కూడా క్లుప్తంగా పరిచయం చేసుకుందాం.

తత్వ శాస్త్ర అభివృద్ధి

హిందూ మతాన్ని గురించి చెప్పుకోవాలంటే దానికున్న అద్భుత వారసత్వ సంపదల్లా దాని తత్వశాస్తమే. ఆశ్చర్యమేమంటే ఈ రోజు మనం మాట్లాడుకునే ఉదారవాద సిద్ధాంతానికి మూలాలు అక్కడే వున్నాయని చెప్పొచ్చు. తాత్విక చర్చ హిందూ సమాజం లో భాగంగా వుండేది. వివిధరకాల తాత్విక ఆలోచనలను గౌరవించేవాళ్ళు. వాటిపై అనేక చర్చలు జరిగేవి. అంటే ఏక సిద్ధాంతాన్ని అందరిపై రుద్దకుండా చర్చల్లో అవతలి వ్యక్తులను ఒప్పించటానికి ప్రయత్నించేవాళ్ళు. ఈ ఫిలాసఫీ ల్లో ముఖ్యమైనవి సాంఖ్య, వైశేషిక, యోగ, న్యాయ, మీమాంస, చార్వాక సిద్ధాంతాలు. సాంఖ్య సిద్దాంతం దేవుడి ని గురించి ఏమీ మాట్లాడకపోతే, వైశేషిక మాత్రం ఏదో ఒక మహా శక్తి ( సూపర్ పవర్ ) ఉనికిని గుర్తిస్తుంది. అయితే సృష్టి మాత్రం ఆ సూపర్ పవర్ సృష్టించిందని మాత్రం చెప్పలేదు. చార్వాకుడు లోకాయత సిద్ధాంతానికి ఆద్యుడు. ఆయన దేవుడి ఉనికిని గుర్తించ నిరాకరించటం, పురోహితులను, వేదాలను తూలనాడటం కూడా పురాతన గ్రంధాల్లో నిక్షిప్తమయ్యింది. అయితే ఆ సిద్ధాంతాన్ని కూడా తాత్విక చర్చల్లోకి తీసుకురావటం చూస్తే ఇంతకన్నా ఉదారవాద మేముంది. అన్ని ఆలోచనల్ని గౌరవించటమే ఉదారవాదం. ఈ ప్రక్రియ హిందూ సమాజం లో మొదట్నుంచీ వుంది. తర్వాత బౌద్ధ ధర్మం లో వచ్చిన శ్రమనిక తత్వ శాస్త్రం కూడా తాత్విక చర్చల్లో భాగమయ్యింది.

జైనులు మొదట్నుంచీ వేదాలను ఒప్పుకోలేదు. బుద్దుడు సనాతన ధర్మం లోని జంతు బలి, వర్ణ వ్యవస్థలను , మిగతా క్రతువులను వ్యతిరేకించాడు. అయినా ఈ మతాలన్నీ ఎన్నో ఏళ్ళు సహజీవనం చేసాయి. హిందూ మతం స్థానంలో  బౌద్ధం వ్యాప్తిచెందినా , జైనులు వేదాలని విమర్శించి ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినా వాళ్ళ మత విశ్వాసాల్ని ప్రచారం చేసుకున్నా పూర్తి స్వేచ్చ సమాజం లో వుండేది. రాజులు అన్ని మతాల వారిని సమానంగా ఆదరించే వారు. అయితే దీనికి విరుద్ధంగా కొంతమంది రాజులు, మతాధికారులు పనిచేసినమాట వాస్తవం. బౌద్దాదికారుల్ని భౌతికంగా నిర్మూలించినమాట కూడా వాస్తవం. సుదీర్ఘ కాలంలో ఈ ఘటనల కాలం చాలా తక్కువ. కానీ మన చరిత్రకారులు ఆ కాలాన్ని , ఆ రాజుల్నే చూపించి మొత్తం హిందూ సమాజం హింసాత్మకంగా బౌద్ధాన్ని అణిచి వేసిందని ప్రచారం చేయటం తప్పని తర్వాత వెలుగులోకి వచ్చిన చారిత్రాకాధారాలు తేటతెల్లం చేశాయి. భారత్ లో ముందుగా ప్రక్షాళన చేయాల్సింది చరిత్ర గ్రంధాల్ని. దానిపై వేరే సందర్భంలో వివరణాత్మకంగా మాట్లాడుకుందాం. స్థూలంగా చెప్పొచ్చేదేమిటంటే ప్రాచీన హిందూ సమాజం అన్ని తాత్విక చింతనలను సమానంగా ఆచరించటమే కాకుండా కలిసి మెలసి సహజీవనం చేశాయి.

హిందూ  తత్వ శాస్త్రం బౌద్ధం తర్వాత దశలో శంకరుడి అద్వైతం తో వేదాలు, ఉపనిషత్తులు సారాన్ని విడమరిచి చెప్పే పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఆ తర్వాత కూడా ఎంతోమంది సాధువులు, సంతులు ఈ హిందూ మతసారాన్ని తమదైన రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేశారు. అందులో ప్రముఖులు ద్వైతాన్ని ప్రచారం చేసిన మధ్వాచార్యులు, విశిష్టా ద్వైతాన్ని ప్రచారం చేసిన రామానుజుడు. ఇంకా ఎంతోమంది ప్రాంతాలవారీగా ప్రముఖపాత్ర పోషించారు. హిందూ మతం లో పొడచూపిన సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఎంతోమంది పనిచేశారు. బుద్ధుడు పురాతన కాలం లో ఆ పనిచేస్తే తర్వాత దశలో ఎంతోమంది సాధువులు ఆ పని చేశారు. దక్షిణాదిన బసవేశ్వరుడు వీర శైవం పేరుతో హిందూ సమాజం లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాడు.

హిందూ మతం లో సామాన్య జనం లో మూడు ప్రధాన స్రవంతులు వున్నాయి. శైవమూ, వైష్ణవం, శక్తి ఆరాధన . హిందూ మతం అనేది నిజానికి ఏక సిద్ధాంత మతం కాదు. కాలానుగుణంగా సామాజిక మార్పుల్ని తనలో ఇముడ్చుకుంటూ సాగుతున్న ధర్మంగా చెప్పొచ్చు. అందుకనే ఇప్పటికీ హిందుత్వ వాదులు దీన్ని హిందూ ధర్మంగానే ప్రచారంచేస్తున్నారు. ఇందులో హిందూ మూలాలున్న అన్ని తదనంతర మతాలూ, విశ్వాసాలు కూడా ఈ ధర్మం లో భాగమేనని చెబుతారు. వీరి వాదనను పూర్తిగా కొట్టివేయలేము. బౌద్ధం భారత్ లో అంతరించినా దాని ప్రభావం తదనంతర   హిందూ మతం పై గణనీయంగా వుంది. ప్రస్తుతం మనం పాటించే అహింసా సిద్ధాంతం బౌద్ధ ప్రభావమే. భారత్ లో విస్తృతంగా వున్న శాఖాహార ప్రభావం కూడా బౌద్ధ, జైన ప్రభావమని చెప్పొచ్చు. ప్రపంచం లోనే ఇంత శాతం ఒక దేశం లో శాకాహారులుండటం రికార్డు. మాంసా హారుల్లో కూడా ప్రతిరోజూ తీసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కాబట్టి ఈరోజు హిందూ మతం ఓ చట్రం లో ఇమిడే  మతంగా పరిగణించలేము. హిందూ ధర్మమనటమే సబబనిపిస్తుంది.

చరిత్రలో అన్యాయం 

మొత్తం మీద చూస్తే ఆధునిక భారతం లో హిందూ మతాన్ని సమదృష్టితో అధ్యయనం చేసి విశ్లేషించటం జరగలేదని చెప్పాలి. ముందుగా ప్రాశ్చాత్య చరిత్రకారుల విశ్లేషణలను రెండుగా చూడాల్సివుంది. ఒకటి క్రైస్తవ మత మిషనరీ లు పనిగట్టుకొని చేసిన ప్రచారాలు, రెండోది, హిందూ తత్వ శాస్త్రం, చరిత్ర అర్ధం చేసుకోవటంలో వైఫల్యం కావటం. హిందూ ధర్మాన్ని విశ్లేషించటం లో , ప్రపంచానికి పరిచయం చేయటం లో ఈ విధంగా అన్యాయం జరిగిందనేది వాస్తవం. చివరకు హిందూ రాజుల కాలాన్ని నిర్ణయించటం లో కూడా ఎన్నో తప్పులు జరిగాయి. ఉదాహరణకు మౌర్య చంద్ర గుప్తుడు ని, గుప్త కాలపు చంద్ర గుప్తుడ్ని కలిపి చూడటం, అలగ్జాండర్ కాలం లో వున్న చంద్రగుప్తుడు ఎవరనేదాంట్లో ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలకి సమాధానం లేకపోవటం, అలాగే విక్రమాదిత్యుడి విషయం లో కూడా ఎంతోమంది అదే పేరుతో వుండటం లాంటి అనేక విషయాల్లో ప్రాశ్చాత్య చరిత్రకారులు కాల నిర్ణయం లో తప్పటడుగులు వేసినట్లు తెలుస్తుంది. స్వాతంత్రం తర్వాత ప్రాబల్యంలో వున్న మార్క్సిస్ట్ చరిత్రకారులు కూడా ఈ తప్పిదాన్ని సరిదిద్దకుండా అదే మూసలో కొనసాగించటం హిందూ సమాజానికి అన్యాయం చేసినట్లే. అంటే దీనర్ధం హిందూ ధర్మం లో తప్పులు లేవనికాదు. కానీ చరిత్రలో విశ్లేషించేటప్పుడు అన్నింటిని సమదృష్టితో చూడలేదనేదే. ముందు ముందు మనం హిందూ మతం లోని మంచీ చెడులను కూడా స్పర్శిద్దాం .  వచ్చే భాగం లో హిందూ మతంపై మరిన్ని విశ్లేషణలు చేద్దాం. అంతవరకూ సెలవు.

( సశేషం)