Uncategorizedజాతీయంరాజకీయాలుసంపాదకీయం

మత సామరస్యం సాధ్యమేనా? (Part 6)

గత భాగం లో హిందూ మత పుట్టు పూర్వోత్తరాలు , తత్వ శాస్త్ర అభివృద్ధి తదితర అంశాలు చర్చించుకున్నాం. ఈ భాగం లో హిందూ మతం ఇన్ని వేల సంవత్సరాలు ప్రయాణం చేస్తూ నిరంతరం మనుగడ సాగించిన నేపధ్యంలో మిగతా మతాల్లాగా దాని వునికి ప్రమాదం లో పడిన సంఘటనలు ఉన్నాయా , వుంటే వాటిని ఎలా అధిగమించిందో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసి ఎన్నో మతాలు వునికి కోల్పోయిన దృష్టాంతాలు మన కళ్ళముందే వున్నాయి. జొరాష్ట్రియన్ మతం ప్రస్తుత ఇరాన్ ప్రాంతంలో హిందూ మతం లాగానే విస్తృత ప్రజాదరణ కలిగిన మతం . కానీ అతితక్కువ సమయం లో మొత్తం ప్రజలు ఇస్లాం లోకి మారారు. మిగిలిపోయిన మతస్తులు వివిధప్రాంతాలకు పారిపోయారు. అలా మనదేశం వచ్చిన వాళ్ళే పార్శీలు. ఇప్పటికీ ముంబై దాదర్ లో వాళ్ళ ఆరాధ్యదైవమైన అగ్ని దేవాలయాలు వున్నాయి. వున్న కొద్ది మంది  ముంబై, గుజరాత్ లోనే వున్నారు. ఆ విధంగా ఆ మతం కనుమరుగయింది. ఈజిప్ట్ లో కూడా పురాతన మతం వుండేది. క్రైస్తవం, ఆ తర్వాత ఇస్లాం విస్తరణతో ఆ మతం ఉనికిని కోల్పోయింది. గ్రీక్ లో అతి పురాతన మతం వుండేది. అదీ తన ఉనికిని కోల్పోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచం లోని అనేక ప్రాంతాల్లో అప్పుడున్న మతాలూ, విశ్వాసాలు తర్వాత వచ్చిన మతాల ధాటికి తట్టుకోలేక ఉనికిని కోల్పోయినాయి. అటువంటిదే యూదు మతం కూడా. తర్వాత వచ్చిన మతాల ధాటికి తట్టుకోలేక చెల్లాచెదరయిన యూదులు వెయ్యి సంవత్సరాలకు పైగా తమ అస్తిత్వాన్ని నిలుపుకొని ప్రస్తుతం తిరిగి తమ స్వంత ప్రదేశానికి చేరటం ఒక్కటే వీటన్నింటిలో మినహాయింపు. మరి ఇటువంటి పరిస్థితి హిందూ మతానికి వచ్చిందా అంటే అవుననే సమాధానం వస్తుంది.

ప్రమాదపుటంచుల్లో హిందూ మత వునికి 

బౌద్ధంతో ఘర్షణ 

హిందూ మతం చరిత్రలో రెండుసార్లు వునికి కోల్పోయే ప్రమాదమొచ్చింది. ఒకటి అంతరంగికంగా, రెండోసారి బయటనుంచి. ఈ రెండూ సంఘటనలు హిందూ మతం అంతరించి పోతుందేమో నన్నంత తీవ్ర ఘటనలే. మొదటిది గౌతమ బుద్ధుని తిరుగుబాటు. ఇది మొత్తం ప్రజల్ని హిందూ మతం నుంచి బౌద్ధానికి మార్చింది. అప్పటికే అనేక దురాచారాలు, అవలక్షణాలు, అసమాన మానవ సంబంధాలతో కునారిల్లుతున్న హిందూ సమాజానికి బుద్ధుని బోధనలు స్వాంతన నిచ్చాయి. ఆ ప్రభావం తో ప్రజలు హిందూ మతాన్ని వదిలి బౌద్ధమతం లో చేరారు. ఇది ఓ సామాజిక, ఆధ్యాత్మిక విప్లవం. ఇందులో వర్ణ బేధం , వర్గ బేధం, ప్రాంతీయ బేధం లేదు. అందరూ సమానులే. ఆధ్యాత్మికంగా , హేతుబద్దంగా కూడా తాత్విక చర్చల్లో పాల్గొని మేధావులను, పామరులను సమానంగా ఆకర్షించగలిగింది. ఇది యుద్ధాల ద్వారానో , దౌర్జన్యాల ద్వారానో , భయ పెట్టో కాకుండా ప్రజల హృదయాలను, మనసులను, మేధస్సులను గెలిచి  తమ అక్కున చేర్చుకుంది. బుద్ధుని కాలంపై కూడా అనేక వివాదాలున్నాయి. కొంతమంది హిందూ చరిత్రకారులు బుద్ధుడు క్రీస్తు పూర్వం 19 వ శతాబ్దానికి చెందినవాడుగా పుట్టిన తేదీ , నక్షత్రం బట్టి లెక్క వేసి మరీ చెబుతున్నారు. అంటే  ప్రస్తుత అధికారిక లెక్కలకి ఇంకో 1200 సంవత్సరాలు    వెనక్కన్న మాట . ఆ లెక్కల ప్రకారం బౌద్ధం వ్యాప్తి చెంది ప్రాచుర్యంలో వున్న కాలం దాదాపు రెండు వేల సంవత్సరాల పై మాటే. ఆ సమయం లోనే కళలు, సాహిత్యం పూర్తిగా విలసిల్లినవి. తక్షశిల , నలంద లాంటి విశ్వవిద్యాలయాలు అధ్యయన కేంద్రాలుగా ఉండేవి. అక్కడున్న వేల  గ్రంధాలు తగలబెట్టకుండా వుండివుంటే బౌద్ధ చరిత్రతో పాటు హిందూ చరిత్ర కూడా మరింత తెలిసి వుండేది. బౌద్ధం బలవంతపు మార్పిడులు చేయలేదు కాబట్టి హిందూ మతస్తులు కూడా పక్క పక్కనే సహజీవనం చేశారు. తర్వాత దశలో బౌద్ధారామాలు , బౌద్దాచార్యులు పూర్తిగా పాత పద్ధతుల్ని విడిచి అన్య మార్గాల్లో నడవటం తో ప్రజల మన్ననలు కోల్పోయారు. దానితో పాటు శంకరుడు లాంటి హిందూ తత్వ శాస్త్రాలు హిందూ మతాన్ని పునరుజ్జీవనం చేయటం లో కృత క్రుత్యులయ్యారు. కొంతమంది రాజులు ముఖ్యంగా పుష్యమిత్రుడు హయాం లో బౌద్ధ బిక్షువుల్ని భౌతికంగా నిర్మూలన చేసినట్లు ఆధారాలున్నాయి. అయినా తర్వాత కూడా చాలా ఏళ్ళు రెండు మతాలూ సహజీవనం చేసినట్లు చారిత్రక ఆధారులున్నాయి. వాస్తవానికి రెండూ భారత మూలాలున్నవి  కావటంతో ప్రజలు వేరు వేరుగా చూడలేదు. మొత్తం మీద బౌద్దం స్థానం లో హిందూ మతం తిరిగి ప్రజల్లో మన్ననలు పొందగలిగింది. ఇందుకు ఎంతోమంది సాధువులు కృషి చేశారు.  అంటే దాదాపు కనుమరుగైన తర్వాత కొన్ని వందల ఏళ్ళకు తిరిగి పునరుజ్జీవనం పొందింది. ఇది మొదటి పునరుజ్జీవనం.

ఇస్లాం దాడి 

బౌద్ధం మనసులు, హృదయాలు గెలుచుకోవటానికి ప్రయత్నిస్తే  ఇస్లాం బలవంతంగా మత మార్పిడులు చేసింది. ఇది దాదాపు వెయ్యి ఏళ్ళు కొనసాగింది. మొదటి ఖలీఫా ఉస్మాన్ ఖాన్ దగ్గర్నుంచి మొదలయ్యి ఔరంగజేబు వరకు ఈ ఒరవడి కొనసాగింది. మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత వచ్చిన ఖలీఫాల కాలం లో మొత్తం పశ్చిమ ఆసియా , మధ్య ఆసియా , ఉత్తర ఆఫ్రికా , ఐబీరియా ద్వీపకల్పం అతి కొద్ది కాలం లోనే ఇస్లాం కిందకు వచ్చినా భారత ఉపఖండం ఆ విస్తరణను అడ్డుకుంది. ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, రాజస్తాన్, లాంటి పశ్చిమ ప్రాంతాలన్నీ కూడా ఈ ప్రతిఘటనలో పాల్గొనటం తో భారత్ కి విస్తరణ ఆలస్యమయ్యింది. మహమ్మద్ బీన్ ఖాసిం తో మొదలయ్యి ఆ తర్వాత చానాళ్లకు మహమ్మద్ ఘోరితో విస్తరణ ప్రారంభమయ్యింది. అయినా మిగతా ప్రాంతాల లాగా భారత్ ప్రజలను మత మార్పిడి చేయలేకపోయారు. వెయ్యి ఏళ్ళు పరిపాలించినా మార్చగలిగింది కొద్ది శాతం మందినే. అదీ తర్వాత వచ్చిన సూఫీ మత ప్రవక్తల ద్వారానే. దీనికి అనేక కారణాలున్నా యి. ఒకటి  ఎప్పుడూ హిందూ రాజులతో యుద్ధాలు కొనసాగటం, బౌద్ధం లాగా మనసుల్ని గెలవటానికి ప్రయత్నం చేయక పోవటం , ఎప్పుడూ యుద్ధాలు జరుగుతుండటం తో హిందూ సమాజం సమీకరించబడటం, హిందూ సమాజం రక్షణాత్మక చర్యలు చేపట్టటం లాంటి అనేక పరిణామాలు ఇస్లాం మత మార్పిడిని నిరోధించగలిగాయి. ఉదాహరణకు కుల స్థిరీకరణ ఈ కాలం లోనే జరిగింది. ఇది ఇస్లాం నుంచి రక్షణ కవచంగా ఉపయోగపడింది. అదే తర్వాత ఆధునిక సమాజం లో హిందూ మతానికి గుదిబండలా తయారయ్యింది. దీనిపై వేరే భాగం లో సవివరంగా చర్చించుకుందాం.

వీటితో పాటు చివరివరకు చాలా భూభాగాలు ఇస్లాం విస్తరణను అడ్డుకోవటం కూడా ఒక కారణం. ఉదాహరణకు ఈశాన్య భారతం లోకి విస్తరించాలని చేసిన ప్రయత్నం వందల సంవత్సరాలు అహోం ( ప్రస్తుత అస్సాం ) రాజులు ప్రతిఘటించి ఎన్నో యుద్ధాలు, ఎన్నో వేలమంది మరణించినా ప్రతిఘటించ గలగటం తో అటువైపు విస్తరణ ఆగిపోయింది. అలాగే దక్షిణాదిన మొదట్లో కాకతీయులు,  యాదవరాజులు ప్రతిఘటించినా అది ఎక్కువకాలం నిలవలేదు. ఖిల్జీ సేనాని మాలిక్ కాఫర్ కాలం లో దక్షిణాది లోపలి భాగాలకు    విస్తరించినా తర్వాతికాలం లో వచ్చిన 200 సంవత్సరాల విజయనగర రాజుల ప్రతిఘటన దక్షిణాదికి విస్తరించకుండా ఆపింది. అలాగే పశ్చిమం లో శివాజీ వీరోచిత ప్రతిఘటన అందరికీ తెలిసిందే. రాజస్తాన్ లోని మేవాడ్ రాజులు  దాదాపు వెయ్యేళ్ళు పోరాటాలు చేస్తూనే వచ్చారు. చివరకు మొఘలులు కూడా వాళ్ళను జయించలేకపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశం లో ఎప్పుడూ ఎక్కడోచోట ప్రతిఘటన జరుగుతూనే వుంది. వీటితోపాటు హిందూ రాజులు చాలా సార్లు ధర్మ యుద్ధం పేరుతో తీవ్ర నష్ట పోయారు. అలా కాకుండా గెరిల్లా పోరాటం చేసి విజయాలు నమోదు చేసుకుంది మహారాణా ప్రతాప్, శివాజీ లు. అలాగే కొంతమంది సనాతన వాదుల మూలంగా కూడా పెద్ద మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఉదాహరణకు కాశ్మీర్ లో 14 వ శతాబ్దం లో రించన సేనాపతి  అప్పటి రాజుని సంహరించి రాజ్యంతో పాటు తన కూతురు కోటా దేవి ని కూడా పెళ్ళాడాడు. ఆమె తనని హిందూ మతం స్వీకరించమని ఒత్తిడి చేస్తే అందుకు అతను సమ్మతించాడు. కానీ కాశ్మీరీ బ్రాహ్మణ పండితులు తనని చేర్చుకోవటానికి మతం ఒప్పుకోదని నిరాకరించారు. దానితో అవమానంగా భావించి ఇస్లాం స్వీకరించి హిందూ దేవాలయాల్ని కూలగొట్టి , హిందువులను నానారకాల హింసలకు గురిచేశాడు. అలాగే 19 వ శతాబ్దం మొదట్లో పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్ కాశ్మీర్ ని జయించిన తర్వాత బలవంతంగా మతం మారిన ఇస్లాం ప్రజల్ని తిరిగి హిందూ మతం లోకి ఆహ్వానించాడు. అప్పుడుకూడా కాశ్మీరీ బ్రాహ్మణ పండితులు, హిందూ ధర్మాచార్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలా జరిగివుండకపోతే  కాశ్మీర్ చరిత్ర వేరేలాగా వుండేది. సనాతన వాదులు వాళ్ళ మూఢ ఆచారాల వలన ఇలా ఎన్నో సార్లు హిందూ మతానికి నష్టం చేకూర్చారు. అయినా హిందూ మతం రెండో సారి తన ఉనికిని కాపాడుకోగల్గింది . ఇది ప్రపంచ చరిత్రలో అరుదైన సంఘటన. దీనికి పోలిక ఎక్కడా లేదు. హిందూ మతం లో పేరుకు పోయిన దురాచారాలు, మూఢ ఆచారాలపై మాత్రమే దృష్టి పెట్టే ఉదారవాదులు దీనిపై కూడా సమ దృష్టితో పరిశీలించి వుంటే బావుండేది.

మూడో ప్రమాదం 

యూరోప్ దేశస్తులు మనదేశంలోకి వ్యాపార నిమిత్తంతో పాటు క్రైస్తవ మత వ్యాప్తి కోసం కూడా ప్రవేశించారు. ముఖ్యంగా ముందుగా వచ్చిన పోర్చుగీసు వారికి మత వ్యాప్తి కూడా ప్రధానమే. తర్వాత వచ్చిన డచ్ , ఫ్రెంచ్ వాళ్ళు కూడా తమవంతు ప్రయత్నం చేసారు. తర్వాత పరిపాలనా పగ్గాలు చేపట్టిన బ్రిటిష్ వారు ముందు వాళ్ళంత కాకపోయినా క్రైస్తవ మత వ్యాప్తికి కృషిచేసారు. వీళ్ళు ప్రధానంగా హిందూ మతం లోని కుల వివక్ష పై దృష్టి పెట్టారు. ఈ దురాచారాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ‘నిమ్న కులాల’ వారిని ఆకర్షించటానికి ప్రయత్నించారు. దక్షిణాది లో వీరి ప్రయత్నం కొంతమేర సఫలీకృత మయ్యింది. ఇది బౌద్ధం లాగా తాత్విక చర్చలతో మనసులు గెలుచుకోవటమో, లేక ఇస్లాం లాగ బలవంతంగానో కాకుండా ఆర్ధిక సహాయం తో, విద్య, వైద్య సౌకర్యాల తో, ప్రభుత్వ తోడ్పాటుతో , హిందూ సమాజం లోని అసమానతలను ఎత్తిచూపటం తో ప్రజల్ని గెలవాలని చూసారు. అయితే పరిమితంగానే విజయవంతమయ్యారు. ముఖ్యంగా ఆదివాసుల్లో , దళితుల్లో కొంతమేర స్థానం సంపాదించుకో గలిగారు. ఇది మొదటి రెండు ప్రమాదాల్లాగా హిందూ మత ఉనికిని దెబ్బ తీసే స్థాయికి చేరలేకపోయింది.  దీనికి కారణాలు ఇంతకుముందే వేరే భాగం లో చర్చించుకోవటం జరిగింది. ఇలా చరిత్రలో హిందూ మతం పడిలేస్తూ ప్రయాణం సాగించి ప్రస్తుతం నిలదొక్కుకొని రాటు తేలింది. అయినా ఇప్పటికీ కులవ్యవస్థ అంతరంగిక శత్రువుగా వుంటూనే వుంది. దీనిపై వచ్చే భాగం లో చర్చించుకుందాం.

చరిత్ర ని చరిత్రగా చూద్దాం 

దురదృష్టవశాత్తు భారత చరిత్ర ఎన్నో వక్రీకరణలకు గురయ్యింది. ఆధునిక స్వాతంత్ర పోరాట చరిత్ర లో ఎలాగయితే కాంగ్రెస్ తప్ప   మిగతా వారి పోరాటాల్ని విస్మరించటమో , తక్కువ చేసి చూపించటమో జరిగిందో మధ్యయుగపు చరిత్ర ముఖ్యంగా వెయ్యేళ్ళ ముస్లిం పాలన చరిత్రపై కూడా చాలా వరకు వక్రీకరణలకు గురయ్యింది. ఈ వెయ్యేళ్ళు జరిగిన పోరాటాల్ని విస్మరించటం, తక్కువచేసి చూపటం  పనిగట్టుకొని జరిగింది. చరిత్రను రాసేటప్పుడు ఇప్పుడు పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని చరిత్రను కప్పిపుచ్చకూడదు. ఆ రోజు జరిగింది జరిగినట్లు చెప్పగలగాలి. అయితే ఎవరైనా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వారికి ఆపాదించటం చేయరాదు. అది ఘోరమైన తప్పవుతుంది. నేను అమెరికా లో నా తమ్ముడు కూతురు పాఠ్య పుస్తకాలు చూసి ఆశ్చర్య పోయాను. వాళ్ళకున్న అమెరికా చరిత్ర లో తెల్ల వాళ్ళయిన యూరపు దేశస్తులు ఏ విధంగా రెడ్ ఇండియన్లు గా పిలువబడే స్థానిక జాతిని నాశనం చేసారో కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. వాళ్ళ పూర్వీకులు ఆ పని చేసారు కాబట్టి దాచుకోవటానికి ప్రయత్నించలేదు. అమెరికా స్థానిక రెడ్ ఇండియన్ లపై మ్యుజియం ల్లో పూర్తి వివరాలు వుంటాయి. అలాగే మనం చరిత్ర చదివేటప్పుడు జరిగింది జరిగినట్లు చదవాలి . అంతేగాని మసిపూసి మారేడుకాయ చేయకూడదు. అదేసమయం లో దాన్ని చరిత్రగానే చూడాలి. వర్తమాన సమాజానికి అన్వయించి వివక్ష చూపకూడదు.  మరి ఇప్పటికైనా చరిత్రను తిరగరాసి నిజాల్ని ప్రజలకి తెలియ చెప్పాల్సిన భాద్యత ప్రభుత్వం పై వుంది. మిగతాది వచ్చే భాగం లో .

( సశేషం)