జాతీయంరాజకీయాలుసంపాదకీయం

దేశం లో మత సామరస్యం సాధ్యమేనా? ( Part1)

కరోనా మహమ్మారి మనల్ని విషయాల్ని లోతుగా అధ్యయనం చేయటానికి అవకాశం కల్పించింది. సామాజికపరంగా భారతదేశం ఎదుర్కుంటున్న అతి పెద్ద సవాలు మత సామరస్యం. 130 కోట్ల ప్రజానీకం కలిగిన మనదేశం అనేక మతాలూ, కులాలు, జాతులు, సంస్కృతులు కలిగిన వైవిధ్యభరిత దేశం. ఇదే మన బలం, బలహీనం కూడా. ఇందులో ఒక్కోసారి ఒక్కో అంశం దేశాన్ని అల్లకల్లోలం లోకి నెట్టుతుంది. కొన్నాళ్ళు కుల ఘర్షణలు, మరి కొన్నాళ్ళు సంస్కృతుల ( ద్రావిడ ) అశ్తిత్వపోరాటాలు, ఇంకొన్నాళ్ళు జాతుల ( ఈశాన్య భారతం) సంఘర్షణలు జరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం మత అస్థిత్వ ఆందోళనలు అధికమయ్యాయి. ఇవి ఎన్నాళ్ళు కొనసాగుతాయో, ఎలా ముగింపు జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి  ఏర్పడింది. మరి పరిస్థితి ఇలాగే కొనసాగితే సామాజిక అశాంతి తో దేశం బలహీనపడే అవకాశాలున్నాయి. దీనికి పరిష్కారం సాధ్యం కాదా? ప్రతి సమస్యకు వెదికితే పరిష్కారం దొరుకుతుంది. అందుకనే మనకున్న పరిమిత అవగాహనతో  ఈ సమస్యను అవగతం చేసుకొని ఎలా పరిష్కరించుకోవాలో జరిపే మేదోమధనమే ఈ చిన్ని ప్రయత్నం. ఇదేమీ సమగ్రమూ కాదు, ఖచ్చితమూ కాదు. దయచేసి దీన్ని ప్రశాంతంగా , విశాల దృక్పధంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.

మతపరంగా దేశ జనాభా 

2011 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 79.8 శాతం, ముస్లింలు 14.2 శాతం, క్రైస్తవులు 2.3 శాతం , సిక్కులు 1.7 శాతం , బుద్ధులు 0 .7  శాతం, జైనులు 0 .37 శాతంగా వున్నారు. ఇవి అధికారిక లెక్కలు. కానీ అనధికారికంగా ఈ లెక్కల్లో వాస్తవం లేదు. హిందువులు, క్రైస్తవులు లెక్కల్లో చాలా తేడా వుంది. క్రైస్తవులు వాస్తవానికి ఈ లెక్కల కన్నా చాలా ఎక్కువగానే వున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో  దాదాపు 15 నుంచి 20 శాతం దాకా ఉండొచ్చని ఓ అంచనా. కానీ లెక్కల్లో మాత్రం అక్కడా దేశ సగటుకి దగ్గరగానే చూపిస్తున్నారు. కాబట్టి దేశం మొత్తం మీద చూస్తే క్రైస్తవులు షుమారు 7 నుంచి 8 శాతం దాకా ఉండొచ్చని ఓ అంచనా. ఇంకా ఎక్కువకూడా వున్నా ఆశ్చర్య పడాల్సిందేమీ లేదు. ఆ మేరకు హిందువుల జనాభా శాతం తక్కువవుంటుంది. వీటితో పాటు పార్సీలు వాళ్లమతమైన జొరాస్ట్రియన్ , అలాగే బహాయ్ మతస్తులు కూడా వున్నారు. ఈ రెండు మతాలూ పర్షియా ( ప్రస్తుత ఇరాన్ ) కి సంబంధించినవే. అలాగే యూదులు కూడా పురాతనకాలం నుంచీ ఇక్కడ ఉంటూ వచ్చారు.వీళ్ళందరూ వేధింపులు తట్టుకోలేక భారత్ కు వలస వచ్చారు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే  భారత్ మొదట్నుంచీ మత సహనాన్ని , ఇతర మతస్తుల్ని గౌరవిస్తూనే వచ్చింది.

సమస్యకు మూలాలు 

సమస్య కొన్ని శతాబ్దాలనుండి కొనసాగుతున్నా ఆధునిక బ్రిటిష్ భారతం లో 1857 ప్రధమ స్వాతంత్ర సంగ్రామంలో హిందూ ముస్లింలు కలిసికట్టుగా బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడటం తో కొత్త కోణం ఆవిష్కరించబడింది. అప్పటివరకు విడిపోయిన హిందూ ముస్లిం సమాజాలు ఒక్కటికావటం తో బ్రిటిష్ వారు ఖంగు తిన్నారు. వాళ్ళ ఆధిపత్యం కొనసాగాలంటే సామాజిక విభజన జరగాలని వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. 1858 లో బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోకి వచ్చినతర్వాత ప్రభుత్వ విధానంగా దీన్ని అమలు చేయటం మొదలుపెట్టారు.  గాంధీజీ స్వాతంత్రోద్యమంలోకి వచ్చి నాయకత్వం వహించిన తర్వాత బ్రిటిష్ వాడిని ఎదురించాలంటే హిందూ ముస్లిం ప్రజల మధ్య ఇక్యతా భావం పెరగాలని భావించాడు. అందుకే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రద్దయిన ఖలీఫా ని పునరుద్ధరించాలని జరిగిన ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్ధించాడు. ఆయనకు చేదోడువాదోడుగా మౌలానా కలాం ఆజాద్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ లాంటి ముస్లిం నాయకులు అదే ఇక్యతా స్పూర్తిని కొనసాగించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం సమయం కోసం ఎదురుచూస్తూనే వుంది. అదీగాక కాంగ్రెస్ రాను రాను బ్రిటిష్ వ్యతిరేక వైఖరిని ముమ్మరం చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం ఏదో ఒకరోజు భారత్ విడిచి వెళ్ళక తప్పదని అంచనా వేసింది. అదేసమయం లో వాళ్ళకో సురక్షిత స్థావరం భారత ఉపఖండం లో కావాలని భావించింది. అప్పటికే ‘గ్రేట్ గేమ్’  నడుస్తూవుంది. రష్యా సేనలు భారత సరిహద్దులవరకు విస్తరించటం, పర్షియా జలసంధి లో వారి వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవటం లాంటి వారి ప్రయోజనాలకోసం సురక్షిత స్థావరం అవసరం ఏర్పడింది. ఆ ఆలోచనే పాకిస్తాన్ ఆవిర్భావానికి పునాదివేసింది. ఆ సూత్రధారి కి పాత్రధారిగా మహమ్మదాలీ జిన్నా ని ముందుకు తీసుకొచ్చారు. నిజానికి పశ్చిమాన ముస్లింలు మెజారిటీ గా వున్న పంజాబ్ , వాయవ్య సరిహద్దు ప్రాంతం లో ముస్లిం లీగ్ కి ప్రజాదరణ లేదు. పంజాబ్ లో అన్ని మతాలతో కూడిన యూనియనిస్టు పార్టీ విభజనకు ముందు అధికారం లో వుంది. వాయవ్య సరిహద్దు ప్రాంతం కాంగ్రెస్ కి కంచుకోట. అంటే ఈ రెండు ప్రధాన ప్రావిన్సుల్లో దేశ విభజన కావాలని ముస్లిం ప్రజానీకం కోరుకోలేదు. పాకిస్తాన్ కావాలని కోరే జిన్నాకు మద్దతిచ్చిన వారు యూనియన్ ప్రావిన్సెస్ ( ప్రస్తుత ఉత్తర ప్రదేశ్) , బీహార్ తదితర హిందీ ప్రాంతాల్లోనే ఎక్కువగా వుండేవారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ రోజు మనం ఎదుర్కుంటున్న పశ్చిమ సరిహద్దు సంఘర్షణ మొదట్నుంచీ లేదు. బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇవ్వటానికి జరిపిన సంప్రదింపుల్లో వ్యూహాత్మకంగా ముస్లింల తరఫున కేవలం జిన్నానే ఎంచుకున్నారు. అప్పటికి తనకు ముస్లింల మద్దత్తు లేదు. చివరకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ని కూడా ముస్లిం ల తరఫున మాట్లాడకుండా జిన్నా విధించిన షరతులకు బ్రిటిష్ ప్రభుత్వం తలాడించింది. చివరకు గత్యంతరం లేని పరిస్థితులు సృష్టించి విభజన చేయటం లో బ్రిటిష్ సూత్రధారి అనేది నిర్వివాదాంశం. అలాగే కాశ్మీర్ కూడా పాకిస్తాన్ లో కలవాలనే బ్రిటిష్ కోరుకుంది. అందుకనే మౌంట్ బాటన్ స్వయంగా శ్రీనగర్ వెళ్లి మహారాజు కి సలహా కూడా ఇచ్చాడు. కాశ్మీర్ ఉత్తర ప్రాంతాలైన గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతాన్ని బ్రిటిష్ అధికార్ల సాయం తోనే ముందుగానే పాకిస్తాన్ లో కలిపేశారు. కాబట్టి ఈ సమస్యకు మూలాలు విభజన లోనే వున్నాయి. బ్రిటిష్ వాడు రగిలించిన అగ్గి ఇంకా రాజుకుంటూనే వుంది.

మరి ఇప్పుడు సమస్య ఎందుకొచ్చింది?

స్వాతంత్రానంతర భారతం లో అందరూ కలిసి పోయే వాతావరణాన్ని రాజకీయనాయకత్వం కలిగించలేకపోవటం పెద్ద వైఫల్యం గా చెప్పొచ్చు. ప్రభుత్వ చట్టాలు తరతమ భేదం లేకుండా అందరికీ వర్తించాల్సిందిపోయి ప్రతిదీ రాజకీయం చేయటం కూడా ఒక కారణం. ఎక్కువకాలం అధికారం లో వున్న పార్టీ ఈ గుర్తింపు రాజకీయాలకు ఆదిలోనే ముగింపు పలకాల్సింది పోయి గుర్తింపు రాజకీయాల్ని మరింత ప్రోత్సహించటం తో మెజారిటీ హిందువుల్లో క్రమ క్రమేణా తమకు అన్యాయం జరుగుతుందనే భావన పెంపొందటం చివరకు హిందువులు కూడా ప్రత్యేకంగా సమీకరించబడటం జరిగింది. అవి పెరిగి పెద్దవై ఇరువైపులా గుర్తింపు సమీకరణలు జరగటం ఈ ఘర్షణ వాతావరణానికి కారణమయ్యింది. దీనికి కొన్ని ఘటనలు ఆజ్యం పోశాయి.

1984 లో జరిగిన ఇందిరా గాంధీ హత్య తర్వాత భావోద్రేకంతో మైనారిటీ సిక్కులను ఊచకోత కోయటం ప్రధాన మత ఘర్షణగా చెప్పొచ్చు. ఇందులో చనిపోయిన వేలాదిమంది సిక్కులకు హత్యతో సంబంధం లేకపోయినా వాళ్ళు ఆ మతం లో పుట్టటమే వాళ్ళు చేసిన శాపం. రెండోది, 1989 – 90 లలో జరిగిన కాశ్మీరీ పండిట్ల ఊచకోత, బలవంతపు గెంటివేత. దీనికి కారణం పాకిస్తానీ ప్రేరేపిత కాశ్మీర్ ఉద్యమం, 1988 రాష్ట్ర ఎన్నికలు కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి రిగ్గింగ్ చేయటం . ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా ఓడినట్లు ప్రకటించటంతో అప్పటికే పాకిస్తాన్ అనుకూల ప్రభావం లో వున్న అనేకమంది తీవ్రవాదం వైపు మొగ్గు చూపటం జరిగింది. జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, హరియత్ లాంటి సంస్థలు స్థాపించినవారిలో ఎక్కువమంది ఆ ఎన్నికల్లో పోటీ చేసి మోసగించబడ్డ వారే. ఆ కోపం మత ప్రక్షాళన పేరుతో కాశ్మీరీ హిందువులపైకి మళ్ళింది. దాని ఫలితమే హిందువులను చంపటం, ఏరివేయటం. ఈ రెండు సంఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వం మిలాఖాత్ కావటం మత సమీకరణలు పెరగటానికి దోహదం చేశాయి. హిందువులు క్రమ క్రమేణా తమ అస్తిత్వం పేరుతో బిజెపి గొడుగున సమీకరించ బడ్డారు. హిందువులకు అత్యంత పవిత్రమైన రామ జన్మభూమి ని తిరిగి ఇచ్చివేయాలనే ఆందోళన ఇరుసుగా ఈ సమీకరణ జరిగింది. చివరకు స్వాతంత్రానంతర అతి పెద్ద మత ఘర్షణ గా మారి బాబ్రి మసీదు కూల్చివేతకు దారితీసింది. 2001 లో జరిగిన ఘటనలు ఈ ఘర్షణలను శాశ్వతం చేశాయి. అయోధ్యను దర్శించి తిరిగివస్తున్న కరసేవకులను గోధ్రా లో రైల్ బోగీకి తాళం వేసి సజీవ దహనం చేయటం తో గుజరాత్ లో భావోద్రేకాలు పెచ్చరిల్లి వేలమంది ముస్లింలు ఊచకోత కు గురికాబడ్డారు. తిరిగి ప్రతీకారం తో కొంతమంది హిందువులు కూడా హత్య కావించబడ్డారు. ఇది అన్ని సంఘటనల్లో అతి పెద్దది, ఘోరమైనది. అక్కడనుండి ఈ మత సమీకరణ నిత్య యవ్వనంగా కొనసాగుతూనేవుంది. మధ్య మధ్య లో ఆటవిడుపులు వున్నా కరోనా మహమ్మారి లాగా అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తూనే వుంది.

సమీకరణలో రాజకీయ పార్టీల పాత్ర 

ఈ సమీకరణల్లో మత ఛాందసవాసులు పైచేయి సాధించారు. ఉదాహరణకు ముస్లిం మహిళల విడాకుల భరణం విషయం లో  షాబాను వేసిన కేసులో సుప్రీం కోర్టు తీర్పుపెద్ద వివాదాన్ని సృష్టించింది. ముస్లిం మత పెద్దలందరూ కలిసి రాజీవ్ గాంధీ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో తీర్పుని కాలరాయటానికి కొత్త చట్టాన్నే తీసుకురాగలిగారు. దీనితో విభేదించిన మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ తన మంత్రి పదవి కి రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు. దురదృష్టవశాత్తూ ఇటువంటి సంతుష్టీకరణ చర్యలు అనేకం కాంగ్రెస్ హయాం లో జరిగాయి. ఈ  సంఘటనలు ముస్లిం సమాజం లో సంస్కరణలు కాక్షించే వర్గాలను నీరుకార్చి మత చాందసవాదులకు ఊతమిచ్చింది.

ఓ విధంగా ఈ సంతుష్టీకరణ చర్యలే హిందువుల్లో నానాటికీ బిజెపి బలపడటానికి కారణమయ్యింది. బిజెపి ప్రధానంగా హిందువుల పార్టీ అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే బిజెపి జన సంఘ్ లాగా కేవలం అగ్రవర్ణాల పార్టీగా కాకుండా హిందువుల్లోని అన్ని వర్ణాలను ఆకర్షించ గలిగింది. జనతా పార్టీ నుంచి విడిపోయిన తర్వాత తన స్వరూపాన్ని మార్చుకొని అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేసింది. ముస్లిం లలో కూడా ఒకవర్గాన్ని, ముఖ్యంగా మహిళలను తనలో చేర్చుకోవటానికి ప్రయత్నం చేసింది. అదేసమయం లో హిందూ సమీకరణ నే తన ఇరుసుగా ఉంచుకుంది. ఆ విధంగా పశ్చిమ, ఉత్తర భారతం లో హిందువుల్లో స్థానం సంపాదించి హిందూ సమీకరణ వేదిక గా ఎదిగింది. అధికారం లోకి వచ్చిన తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరించటానికి ప్రయత్నం చేస్తూ వుంది.

అదేసమయంలో ముస్లిం లు ఒక పార్టీగా ఎదగకపోయినా ముస్లిం అనుకూల , బిజెపి వ్యతిరేక దృక్పధం ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీ వైపు రాష్ట్రం ప్రాతిపదికగా సమీకరించబడ్డారు. కాబట్టి సమాజం రాను రాను మత సమీకరణ దిశగా మార్పు చెందింది. సమాజం ఈ విధంగా తయారు కావటానికి రాజకీయ పార్టీల అవకాశవాదం, వైఫల్యం కారణంగా చెప్పొచ్చు. మరి ఇది ఇలా కొనసాగవలసిందేనా ? దీనికి పరిష్కారం లేదా? మత సామరస్యం నీటి మూటేనా? మతం గుర్తింపుతో కాకుండా మానవత్వంతో సంబంధాలు అభివృద్ధి అయ్యే అవకాశాలు లేవా? 21 వ శతాబ్దం లోనూ , కరోనా మహమ్మారి మానవ వినాశనాన్ని చూసిన  తర్వాత కూడా ఈ గుర్తింపు సమీకరణాల కోరలనుంచి బయటపడలేమా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చే భాగం లో పరిశీలిద్దాం.

( సశేషం)
Also Read:  మత సామరస్యం సాధ్యమేనా? (Part 2)