కరోనా వైరస్జాతీయంప్రత్యేకంరాజకీయాలుసంపాదకీయం

మోడీ ప్రభుత్వం పై విమర్శల్లో నిజమెంత?

లాక్ డౌన్ ప్రకటించి 7 రోజులు గడిచింది. అంటే మూడు వారాల్లో ఒక వారం అయ్యింది. మోడీ ఇచ్చిన పిలుపు కి దేశ ప్రజలు బాగా స్పందించారని చెప్పాలి. 130 కోట్ల మంది ప్రజలు ఒకే మాటమీద, బాట మీద నడవటం అంత సులువైన పనికాదు. సమస్య అటువంటిది. ఇంట్లో నుంచి కదిలితే ప్రాణానికి ముప్పొస్తుందనే విషయం అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పటం లో మోడీ కృతకృత్యుడయ్యాడని చెప్పొచ్చు. ఇది మనమే కాదు ప్రపంచం మొత్తం చూసింది. అమెరికా, ఇటలీ , స్పెయిన్ , ఫ్రాన్స్ మిగతా ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే భారత్ అమలుచేసిన తీరు అద్భుతం, అమోఘం. చైనా లాగా ముందుగా దాచిపెట్టి తర్వాత కఠినంగా వ్యవహరించినా మాట్లాడలేని నిరంకుశ వ్యవస్థ మన దగ్గరలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ లోనే పారదర్శకంగానే కఠినమైనా నచ్చచెప్పుకొని అమలుచేయాలి. ఇక్కడే యూరప్ , అమెరికా చేయలేని పని భారత్ చేసి చూపించింది. దీనికి మోడీ పై దేశ ప్రజల్లో వున్న చరిష్మా ఉపయోగపడింది. ముందుగా స్వచ్చందంగా జనతా కర్ఫ్యూ పెట్టటం తర్వాత ప్రజలూ , రాష్ట్ర ప్రభుత్వాలే దీన్ని పొడిగించాలనే కోరిక వెలిబుచ్చటం ఆ ఆవకాశాన్ని ఉపయోగించుకొని 21 రోజుల లాక్ డౌన్ ని పెట్టటం చక చకా జరిగిపోయాయి. లాక్ డౌన్ ఎందుకు అవసరమో ప్రజలకు వెలిబుచ్చిన తీరు అమితంగా ఆకట్టుకుంది. చేతులు జోడించి మీ కుటుంబ సభ్యుడిగా అభ్యర్ధిస్తున్నానని చెప్పిన పద్దతికి జనం ఫిదా అయ్యారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక వారం గడిచింది. దీనితో కొంతవరకు వైరస్ గొలుసు కట్టు ని కట్టడి చేయగలుగుతామనే ఆత్మవిశ్వాసం ప్రభుత్వంలో, ప్రజల్లో వస్తూ వుంది. అయితే మధ్యలో రెండు అపశ్రుతులు ఈ ఆత్మవిశ్వాసం పై దెబ్బతీశాయి.

ఈ వారం లో అడ్డువచ్చిన అపశ్రుతులు

ముందుగా చెప్పాల్సింది ఢిల్లీలోని వలస కార్మికుల ప్రహసనం. గత రెండు దశాబ్దాల వేగవంతమైన ఆర్థికాభివృద్ధి లో భాగంగా కార్మికుల వలసలు గణనీయంగా జరిగాయి. బాగా వెనుకబడిన తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుండి పశ్చిమ, దక్షిణ భారతానికి విరివిగా వలసలు జరిగాయి. అలాగే ఉత్తరాన ఢిల్లీ కేంద్రీకృతంగా వలసలు జరిగాయి. అందులోభాగంగానే హైదరాబాద్ లో కూడా ఏ మూల చూసినా , ఏ రంగం లో చూసినా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ , మిగతా ఉత్తరాది కార్మికులు పనిచేయటం చూస్తున్నాం. 21 రోజుల లాక్ డౌన్ ప్రకటనతో ఈ వలస కార్మికుల్లో ఆందోళన నెలకొంది. అన్నిచోట్లా ఎంతో కొంత అశాంతి చెలరేగింది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళను బుజ్జగించటం లో సఫలీకృతమయ్యాయి. కానీ ఢిల్లీ లో పెద్దఎత్తున తిరుగు వలసలు జరగటం అందరినీ ఆశ్చర్య పరిచింది. దీనికి మూలాలు ఎక్కడున్నాయనే దానిలోకి వెళ్లి పరిశోధించే సందర్భం ఇది కాదు కాబట్టి ప్రస్తుతం దాన్ని అరికట్టటం పైనే అందరి దృష్టీ వుంది. దాదాపు ఈ వారం అంతా జరిగిన ఈ ప్రహసనం లో “సామాజిక దూరం” అనే పవిత్రకార్యం దెబ్బతింది. వేలమంది ఒకచోట గుమికూడటం తో ఈ వైరస్ ఎంతమేర విస్తరించిందో కొన్ని రోజులు పోతే గానీ అర్ధం కాదు. దీనితోనే అందరూ 21 రోజుల లక్ష్యం ఎంతమేరకు గండిపడిందనే ఆలోచనతో ఉద్విగ్నంగా ఉంటే నిన్న బయటపడ్డ సంఘటన మరింత ఆందోళన కి గురిచేస్తుంది.

ఢిల్లీ లోని మర్కాజ్ మసీదు లో జరిగిన తబ్లీఘి జమాత్ సభల సందర్భంగా జరిగిన ఉల్లంఘనలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. అయోధ్య రామనవమి ఉత్సవాలు, తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలు లాంటి కార్యక్రమాలు రద్దు చేయటం ఆలస్యమైనప్పుడు ఒకింత ఆందోళనతో మా సంపాదకీయాల్లో వాటిని వెంటనే రద్దు చేయాలని కోరటం జరిగింది. లాక్ డౌన్ ప్రకటించిన రాత్రి షహీన్ బాగ్ ప్రదర్శనలకు శుభం పలకటం తో హమ్మయ్య అని దేశమంతా ఊపిరి పీల్చుకుంది. ఈ నేపధ్యం లో ‘ సామాజిక దూరం’ ప్రయోగం లాక్ డౌన్ తో విజయవంతమవుతుందని దానితో కరోనా మహమ్మారిని 21 రోజుల్లో తన్ని తరిమేయొచ్చని అందరూ భావించారు. మధ్యలో ఢిల్లీ వలస కార్మికుల సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించటంతో వచ్చే రెండు వారాల తర్వాత హాయిగా ఉండొచ్చని భావించిన ప్రజానీకానికి మర్కాజ్ జమాత్ ఉదంతం పెద్ద షాక్ నిచ్చింది. దీని ప్రభావం ఒక ప్రాంతం మీదో, ఒక రాష్ట్రం మీదో కాకుండా మొత్తం దేశం మీద ఉండటం తో జనంలో మళ్ళా భయం మొదలయ్యింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే దీని ప్రభావం ఎంతవుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రాలో అధికార పార్టీ ఎం ఎల్ ఏ జనతా కర్ఫ్యూ రోజు రాత్రి ఇచ్చిన విందుకి వందలాది మంది హాజరవ్వటం తో ఈ వైరస్ మూలాలు ఎంత లోతుగా విస్తరించినాయోనని ఆందోళనలో వున్నారు. తెలంగాణాలో ఇప్పటికే ఆరు మంది ఈ జమాత్ కి హాజరైన వాళ్ళు చనిపోవటంతో పరిస్థితులు ఉద్విగ్నంగా మారాయి. అయినా ప్రభుత్వాల, ప్రజల పట్టుదల ముందు ఇవేమీ నిలబడవు. తాత్కాలికంగా దీనివలన అవరోధాలేర్పడినా వాళ్ళు ఎక్కడ తిరిగింది, ఎవరెవర్ని కలిసింది కనిపెట్టగలిగితే గొలుసుకట్టు ను ఛేదించిన వాళ్లమవుతాము. ఈ ప్రయత్నంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలీకృతమవుతాయని ఆశిద్దాం.

మీడియా సన్నాయి నొక్కుల వెనక ఆంతర్యమేంటి?

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు బయటపడిన కేసులను పరిశీలిస్తే కొంతమేరకు మన దేశం కర్వ్ ని వంచటం లో సఫలీకృతం అయ్యిందనే చెప్పొచ్చు. ఇది చిన్న విజయం కాదు. మిగతా అన్ని దేశాలతో పోలిస్తే వైరస్ బాధిత కేసుల సంఖ్యను అదుపు లో వుంచగలగటం ఇప్పటివరకు మనం సాధించిన గొప్ప విజయం. అయితే ఈ వారం లో జరిగిన ఈ రెండు అపశ్రుతులు వల్ల ఎంత నష్టం జరిగిందో వచ్చే వారానికి గాని మనకొక అంచనాకు రాలేము. జరిగిన డామేజ్ ని నియంత్రించగలిగేటట్లయితే ఈ యుద్ధం లో మనం సక్సెస్ అయినట్లే. లేకపోతే విలువ కట్టలేనంత దెబ్బ ని ఎదుర్కోవలసి ఉంటుంది. అదే జరిగితే మనం దీర్ఘ కాలిక లాక్ డౌన్ కి సిద్ధంగా ఉండాల్సి వుంది. ఇంత పెద్ద దేశం లో ఈ ఎదురుదెబ్బలు సహజం. ఇప్పుడు కావాల్సిందల్లా మనలో ఐక్యత. అది లేకపోతే అమెరికా లో పరిస్థితే మనకూ పునరావృతమవుతుంది. ఇప్పటివరకూ పార్టీలను పక్కన పెడితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కలిసికట్టుగా పనిచేస్తున్నాయని చెప్పాలి. ఇది అభినందించ దగ్గ విషయం. అమెరికా లో ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా అధ్యక్షుడు గవర్నర్లు తన్నుకు చేస్తున్నారు. దానితో ప్రజలు చస్తున్నారు. వాళ్ళతో పోలిస్తే మనం చాలా విజ్ఞతతో , సంయమనం తో ముందుకెళ్తున్నామని ఘంటాపధంగా చెప్పగలం. జయహో భారత్. అయితే మధ్య మధ్య లో కొన్ని మీడియా సంస్థలూ , కాంగ్రెస్ పార్టీ చికాకు కలిగిస్తున్నాయి.

ముఖ్యంగా కొన్ని ఆన్ లైన్ వార్తా సంస్థలు తమ ఎప్పటి సహజ మోడీ వ్యతిరేక ధోరణి లోనే ఇప్పుడూ ప్రవర్తిస్తున్నాయి. ప్రపంచం మొత్తం భారత ప్రభుత్వాన్ని , మోడీ ని అభినందిస్తుంటే దాన్ని భరించలేని ఈ సంస్థలు సన్నాయి నొక్కులు నొక్కుతూనే వున్నాయి. ఇందులో ప్రధానంగా ” వైర్ , ప్రింట్, క్విన్ట్ , స్క్రోల్, క్యారవాన్ ” లాంటి సంస్థలు ముందు వరసలో వున్నాయి. ఇందులో స్వయం ప్రకటిత వామపక్ష మేధావులు, ఉదారవాదులు, హిందుత్వ వ్యతిరేకులు, మోడీ వ్యతిరేకులు తమ తమ పద్ధతుల్లో ప్రచారం చేస్తూ వుంటారు. అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. నిజమైన ఉదారవాదులైతే అన్ని రకాల భావాల్ని ఆహ్వానిస్తారు. కానీ చిక్కల్లా ప్రస్తుతం మనమొక యుద్ధం లో వున్నాం. ఆ యుద్ధం లో ప్రజలకి విశ్వాసం కలిగించాలి , ఆత్మవిశ్వాసం సడలకుండా ఉండేవిధంగా నిర్మాణాత్మక విమర్శలు ఉండాలి. కానీ ఈ పత్రికల వ్యాసాలు ఆ కోవలో లేవు. ఎక్కడ ప్రభుత్వానికి పేరొస్తుందోనని అసహనంతో రాస్తున్నట్లుగా వున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ చర్యలు ప్రోత్సాహకారంగానే , ముందుచూపుతోనే ఉన్నాయనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర అంతర్జాతీయ సంస్థల అంచనా. కానీ వీళ్లకు అవేమీ కనిపించటంలేదు. వీళ్ళ వాదనల్లో పస ఎంతో ఒక్కసారి పరిశీలిద్దాం.

అంతర్జాతీయ ప్రయాణీకుల్ని మార్చ్ 22వ తేదీ కాకుండా ఎప్పుడో నిషేధించి వుండాల్సింది. నిజమే అయ్యుండొచ్చు. 22వ తేదీకి ప్రామాణికత ఏమీ లేదు. ప్రభుత్వం జనవరి 30వ తేదీ మొట్టమొదటి కరోనా వైరస్ బాధితుడిని గుర్తించినప్పటినుంచి ప్రభుత్వం ఆంతరంగిక సమావేశాలు నిర్వహిస్తూనే వుంది. స్వయంగా ప్రధానే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వచ్చాడు. అంటే ముందునుంచే ప్రభుత్వం దీని తీవ్రతని గుర్తించిందన్నమాట. ట్రంప్ లాగానో, చైనా లో లాగానో నిర్లక్ష్యంగానో, రహస్యంగానో వుండలేదు. మార్చ్ 22వ తేదీన అంతర్జాతీయ విమానాలు రద్దు చేయటానికి ముందే మెల్లి మెల్లిగా ఒక్కొక్క నిర్బంధాన్ని అమలుచేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఎప్పటికప్పుడు నిపుణులతో సమీక్ష చేసుకుంటూ నియంత్రణా చర్యలు అమలుచేసుకుంటూ వచ్చారు. మరీ ముందు తీసుకోకపోవటానికి వాళ్లకున్న కారణాలు పూర్తిగా తెలియదు. వ్యాసాలు రాసిన వాళ్ళు అధికారులతో మాట్లాడి వివరణ తీసుకొని సంతృప్తి చెందకపోతే అది వేరే విషయం. అటువంటిదేమీ ఉన్నట్లు లేదు.

ఇక రెండో ఆరోపణ: వచ్చిన అంతర్జాతీయ ప్రయాణీకులనందరినీ ప్రభుత్వ క్వారంటైన్ లోకి పంపించకపోవటం మోడీ చేసిన పెద్ద తప్పు. అంటే 15 లక్షలపైగా అంతర్జాతీయ ప్రయాణీకుల్ని ప్రభుత్వ శిబిరాల్లో ఉంచటం. ఇది ఆచరణ సాధ్యమేనా? ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమైనా చేయగలిగిందా ? ప్రపంచం మొత్తానికి ఈ వార్త ఎప్పుడు బయటకు పొక్కిందో మనకీ అప్పుడే కదా తెలిసింది. మనకు అదనపు సమయం ఎక్కడుంది? జనవరి 21వ తేదీనే ప్రపంచం మొత్తానికి తెలిసింది. ప్రభుత్వ వనరులూ , పరిమితులు, సామర్ధ్యం, అవసరం అన్నీ పరిగణన లోకి తీసుకొని వ్యూహాలు రచించుకుంటారు. అంతర్జాతీయ ప్రయాణీకులపైకూడా విమానాశ్రయాల్లో థర్మల్ పరీక్షలు జరపటం, కరోనా బాధితులు ఎక్కువున్న దేశాలపై నిషేధం విధించటం, కొన్ని దేశాలనుంచి వచ్చే వాళ్ళను విధిగా ప్రభుత్వ క్వారంటైన్ లో ఉంచటం చేస్తూ వస్తూ చివరగా మొత్తం సర్వీసుల్ని నిషేధించారు. అలాగే దేశీయంగా రైళ్లను, విమాన సర్వీసుల్ని నిషేదించారు. దాని కొనసాగింపుగా లాక్ డౌన్ ప్రకటించారు. వున్న పరిమితుల్లో భారత ప్రభుత్వ చర్యలు వైరస్ గొలుసు కట్టు ను బద్దలుకొట్టటానికి ఉపకరించాయనేది ప్రపంచ సంస్థల అభిప్రాయం.
మూడోది: ఎక్కువమందికి టెస్టులు చేయలేదనేది. దీనిపై ఆరోగ్యశాఖ ఎన్నోసార్లు వివరణ ఇచ్చింది. ఇంతవరకు ” సమూహ విస్తరణ ” జరగలేదనేది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి రోగ లక్షణాలు కనబడకుండా రెండో దశలో అవసరం లేదనేది వాళ్ళ అభిప్రాయం. దాన్ని ఇప్పుడు విస్తరించారు. శ్వాస కోశ సంబంధిత బాధితులందరికీ పరీక్షలను విస్తరించారు. అయితే పైన చెప్పిన అపశ్రుతులు జరిగిన నేపథ్యంలో టెస్టింగ్ ని ఇంకా విస్తరిస్తారేమో చూడాలి.
నాలుగోది: ఆరోగ్య సిబ్బందికి కావాల్సిన వ్యక్తిగత రక్షణాత్మక వస్తువులు సరిపడా స్థాయిలో లేవనేది. దీనిలో కొంత వాస్తవమున్నా ప్రపంచం మొత్తం ఈ సమస్యను ఎదుర్కొంటుంది. మనకు దిగుమతిచేసుకుందామనుకున్నా ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా. ఇప్పటివరకు మనం ప్రమాదకర పరిస్థితుల్లో లేము. ఈ సమస్యను అధిగమిస్తామని నమ్మకముంది. భారతీయ కంపెనీలు వెంటిలేటర్ల తయారీని చేపట్టాయి. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తాయని ఆశిద్దాం.

ఈ ఆరోపణలు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి, దాని పరిష్కారానికి ఉపయోగపడితే మంచిదే. కానీ చెప్పే వ్యక్తులు ఎవరూ అనేది కూడా ముఖ్యమే. ఇందులో ఎవరో ఒకరిద్దరు తప్పిస్తే ఎక్కువమంది మోడీ గుడ్డి వ్యతిరేకతతో పని చేస్తున్న వారే. అటువంటప్పుడు వీరి లక్ష్యాలు సరైనవేనని చెప్పటం కష్టమవుతుంది.

కాంగ్రెస్ నాయకుల నిర్వాకం వెగటు పుట్టిస్తుంది

రాహుల్ గాంధీ ఎప్పటిలాగే అనవసర వివాదాల్లోకి చొరబడుతుండటం జాలి వేస్తుంది. రామాయణం సీరియల్ తిరిగి ప్రసారం చేస్తామంటే దాన్ని వ్యతిరేకించటం తన అపరిపక్వతని తెలియజేస్తుంది. ఆ ప్రకటన తో మెజారిటీ హిందువుల్లో వ్యతిరేకతని కొనితెచ్చుకున్నట్లయ్యింది. ఆ ప్రకటన ఈ సందర్భం లో అవసరమా? అంతటితో ఆగకుండా కాంగ్రెస్ నాయకులందరూ ప్రధానమంత్రి నిధి కోసం కొత్తగా పెట్టిన ఖాతా పై విమర్శించటం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. ఏదో సాంకేతికత అంశాల్ని పట్టుకొని అదేదో మోడీ స్వంతానికి వసూలు చేస్తున్నట్లు మాట్లాడటం ఈ సమయం లో రోత పుట్టిస్తుంది. ఇటువంటి చర్యలు చూసిన తర్వాత కాంగ్రెస్ చరిత్ర నుంచి పాఠాలు నేర్వక పోవటం చూస్తుంటే తన భవిష్యత్తుని తానే నాశనం చేసుకుంటుందని అనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ సమయం లో నోరు మెదపక పోతేనే ప్రజలు హర్షిస్తారు. ముందు ఈ లోపల వాళ్ళ అంతర్గత సమస్యల్ని పరిష్కరించుకుంటే మంచిది.

భారత్ నిరక్షరాస్యులు ఎక్కువగా వున్న దేశం కావొచ్చు. పేదరికం ఎక్కువ వున్న దేశం కావొచ్చు. రక రకాల సంస్కృతులు, భాషలు కల దేశం కావొచ్చు. కానీ సమస్యలొచ్చినప్పుడు అందరూ ఒక్కటే అనే భావన బలంగా వున్న దేశం కూడా. ఇంత పెద్ద దేశం మలేరియా ని రూపుమాపింది. ఇంత జనాభా వున్న దేశం పోలియో ని సమూలంగా నిర్మూలించగలిగింది. అదే స్పూర్తితో కరోనా వైరస్ ని కూడా తరిమి తరిమి కొట్టటంలో కూడా విజయం సాధిస్తుందని గట్టిగా నమ్ముదాం. ప్రభుత్వాలు తీసుకొనే కార్యక్రమంలో మనందరం భుజం భుజం కలిపి సహకరిద్దాం. విజయం సాధిద్దాం.

Back to top button