ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

జగన్ సామాజిక న్యాయం ఫలితమిస్తుందా?

Jaganఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ పదవుల పంపిణీలో సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎస్సీ, ముస్లిం సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీ పదవుల పంపిణీలో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డబ్బు, పలుకుబడి కాకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి వారికి పదవులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ర్టంలో ఇన్నాళ్లు ఉన్న సంప్రదాయానికి కొత్త దారులు తెరిచినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రాంతీయ పార్టీల్లో ఆధిపత్యం ఎక్కువగానే ఉంటుంది. అధినేత నిర్ణయాన్ని ఎవరు కాదనలేరు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహించడమే నేతల పని. అనుకున్నది అనుకున్నట్లుగా చేయడంలో ప్రాంతీయ పార్టీలదే పైచేయి. అది టీడీపీ అయినా వైసీపీ అయినా నిర్ణయాల్లో మార్పుండదు. అధినేత ఒకసారి హుకుం జారీ చేస్తే ఇక అంతే సంగతి. అది చట్టం కన్నా ఎక్కువ బలమైనదిగా ముద్ర పడుతుంది. అలాంటి ప్రాంతీయ పార్టీల్లో ఎదగాలంటే కష్టపడాల్సిందే. వారి కనుసన్నల్లో పడితే చాలు పదవులు ఇట్టే వస్తాయి.

ఒకప్పుడు రాజ్యసభ, శాసనమండలి స్థానాలు బాగా డబ్బున్న వాళ్లకే దక్కేవి. కానీ రానురాను పరిస్థితిలో మార్పులు వచ్చాయి. డబ్బుకంటే పనితీరుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో డబ్బు ఉన్నా లేకున్నా ఫర్వాలేదు కానీ అధినేత మెప్పు పొందేందుకు తాపత్రయ పడాల్సిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. పార్టీలకు నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా వారి వ్యక్తిగత ప్రతిష్ట ఆధారంగానే పదవులు దక్కుతున్నాయి.

సామాజికవర్గం, పార్టీకి వారు ఉపయోగపడిన తీరు, భవిష్యత్ లో పార్టీకి వారి అవసరాలన గుర్తించి అధినేత వారికి పదవులు కేటాయిస్తున్నారు. సీఎం జగన్ ప్రస్తుతం తన ప్రభుత్వంలో మైనార్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జకియా ఖాను, మహ్మద్ కరీమున్నీసా, మహ్మద్ ఇక్బాల్ లకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. వీరిలో ఇక్బాల్ తప్ప మిగిలిన ఇద్దరు సామాన్య కార్యకర్తలే. వారికి పెద్దగా ఆస్తులు లేకపోయినా అధినేత ఇష్టంతోనే వారికి పదవులు దక్కాయి.

ఎస్సీలకు కూడా తన ప్రభుత్వంలో జగన్ పెద్దపీట వేస్తున్నారు. నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. పందుల రవీంద్రబాబు, బల్లి కల్యాణ్ చక్రవర్తి, డొక్కా మాణిక్య వరప్రసాద్, కొయ్యమోషేన్ రాజు లకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో జగన్ సామాజికవర్గాలను లెక్కలోకి తీసుకుని పదవులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తనను నమ్ముకున్న వారికి అన్యాయం చేయకుండా వారికి ఏదో విధంగా తృప్తి పరచడం జగన్ ఆలోచనల్లో కనిపిస్తోంది.

Back to top button