ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

CM Jagan Secret G.O.s: పారదర్శకతకు పాతరేస్తున్న జగన్

ఆంద్రప్రదేశ్(Andhra Pradesh) లో ప్రస్తుతం జీవోల రచ్చ సాగుతోంది. ఇన్నాళ్లు కాన్ఫిడెన్షియల్, బ్లాంక్ జీవోలు తీసుకొచ్చిన జగన్(Jagan) ప్రభుత్వం ఇప్పుడు అందులో ఏమి ప్రజలకు తెలియకుండా ఉండాలని భావిస్తోంది.

CM Jaganఆంద్రప్రదేశ్(Andhra Pradesh) లో ప్రస్తుతం జీవోల రచ్చ సాగుతోంది. ఇన్నాళ్లు కాన్ఫిడెన్షియల్, బ్లాంక్ జీవోలు తీసుకొచ్చిన జగన్(Jagan) ప్రభుత్వం ఇప్పుడు అందులో ఏమి ప్రజలకు తెలియకుండా ఉండాలని భావిస్తోంది. దీంతో జగన్ ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కాన్ఫిడెన్షియల్ జీవోలపై విమర్శలు చేసినా ప్రస్తుతం ఆయన అదే బాటలో పయనిస్తున్నారు. దీంతో రాష్ర్టంలో పెద్ద దుమారమే రేగుతోంది. సామాజిక మాధ్యమాల్లో రచ్చ సాగుతోంది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ప్రభుత్వంలో ఉండగా మరోలా వ్యవహరిస్తున్నారు. విశ్వసనీయత, పారదర్శకత పై పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా జీవోలు రహస్యంగా ఉంచుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రహస్య జీవోలు, ఖాళీ జీవోలు, కనిపించని జీవోలు అంటూ తెలుగుదేశం పార్టీ జగన్ నిర్ణయంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాన్ఫిడెన్షియల్ జీవోలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తున్నదేమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

పరిపాలనలో పారదర్శకత ఉండాలని భావించిన జగన్ ప్రస్తుతం ఇంత గోప్యత ఎందుకు పాటిస్తున్నారని విమర్శిస్తున్నారు. చీకటి జీవోలు విడుదల చేస్తూ ప్రజల కళ్లకు గంతలు కడుతున్నారని టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను రహస్యంగా ఉంచుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రతిపక్షాలు సైతం గగ్గోలు పెడుతున్నాయి. చీకట్లో పాలన సాగించే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రతిష్ట దిగజారిపోతోందని దుయ్యబడుతున్నారు.

ఈనేపథ్యంలో బీజేపీ, టీడీపీ పార్టీలు ఖండిస్తున్నాయి. జీవోలు బయటకు రాకుండా ఉండడం కోసం అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ రికార్డులు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి. జీవోల విడుదలలో రహస్యాలు పాటించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడుతూ రహస్యం పాటించడం ఏమిటని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా జీవోలు వెల్లడించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2016లో ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ ప్రభుత్వ జీవోల వ్యవహారంపై ఉమ్మడి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఇక 2019లో సైతం అన్ని జీవోలు వెల్లడించలేదని బీజేపీ కార్యవరగసభ్యుడు పేరాల శేఖర్ రావు పిటిషన్ దాఖలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న జీవోల తీరుపై ప్రజల్లో కూడా నిరసన వ్యక్తం అవుతోంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే జీవోల విడుదలలో రహస్యం పాటించడంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అన్ని వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని పెదవి విరుస్తున్నారు. జగన్ ప్రభుత్వం జీవోల విడుదలతో ప్రజలకు అన్ని విషయాలు తెలిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందనే నిజాలు దాస్తుందని చెబుతున్నారు.

Back to top button