ఆంధ్రప్రదేశ్రాజకీయాలుసంపాదకీయం

జగన్ గారూ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి

ఆంధ్ర ప్రజలు రోజు రోజుకీ దురదృష్టవంతులుగా మారుతున్నారు. రాజకీయనాయకులు సమాజాన్ని కలుషితం చేస్తున్నారు. మామూలుగానే తెలంగాణతో పోల్చినప్పుడు ఆంధ్ర సమాజం కులాల కుంపటితో భృష్టు పట్టింది. దానికి రాజకీయనాయకులు ఆజ్యం పోస్తుంటారు. స్థానిక ఎన్నికల సమరమే ఎప్పుడూ ఈ వాతావరణాన్ని ఇంకా దిగజారుస్తుంది. ఈ సారి ఇది తారా స్థాయికి చేరింది. ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకపోయటం, దౌర్జన్యాలకు దిగటం చూస్తుంటే అసలు ఎన్నికలు అవసరమా అన్నంత గా ఏ పార్టీకిచెందని ప్రజానీకం భావిస్తున్నారు. దీనికి తగుదునమ్మా అని అందరూ తలో పిడికెడు అగ్గిరాజేస్తూ వున్నారు.

ఇదంతా ఒక ఎత్తయితే ఎన్నికల వాయిదా ప్రహసనం ఇంకో ఎత్తు. ఉన్నట్టుండి ఓ అర్ధరాత్రి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తూ ప్రకటన విడుదలచేయటం రాష్ట్ర ముఖ్యమంత్రికి కోపం తెప్పించింది. మరుసటిరోజు అసలు నేనా ముఖ్యమంత్రి తనా అని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. ఆయన ఆవేదనకు కొంత అర్థముంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి నో , ప్రధాన కార్యదర్శి నో సంప్రదించి రాష్ట్రం లో కరోనా వైరస్ పై వివరణ తీసుకుంటే బాగుండేది. ఇలా పారదర్శకంగా వ్యవహరించకపోవటం అనుమానాలకు దారితీయటం సహజం. అసలు రాష్ట్రం లో ఏ దశలో ఈ మహమ్మారి ఉందనేది ఎంక్వయిరీ కూడా చేయకుండా కేవలం కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడానని చెప్పటం ఆ రాజ్యాంగ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేదిగా వుంది. మనం చేసేపని నిజాయితీగా చేయటమేకాదు అలాచేసినట్లు ప్రజలు అర్ధంచేసుకొనేలా ప్రవర్తించటం కూడా ఈ రోజుల్లో చాలా అవసరం. కోర్టులు , ఎన్నికల కమిషనర్లు భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సంస్థలు. వాటిపై విశ్వాసం సన్నగిల్లితే ప్రజాస్వామ్యానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈ విషయంలో ఆ పదవుల్లో వున్నవారికి చాలా పెద్ద బాధ్యత ఉందని మరిచిపోకూడదు.

ఇక జగన్ మోహన రెడ్డి ప్రవర్తన ఏ మాత్రం క్షంతవ్యం కాదు. తను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అధికారంతోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని మరిచిపోవద్దు. ఇప్పటికే సమాజం కులాలు, వర్గాలతో కొట్టుకుచస్తుంటే ముఖ్యమంత్రి స్థానంలో వుండి కులంపేరుతో రాజ్యాంగపదవిలో వున్న వ్యక్తిపై ఆరోపణలు చేయటం దారుణం. నిజంగా తనకు అనుమానమున్నా మాట్లాడకూడదు. అప్పుడే ఆ పోస్టుకి వన్నె. అయినా ఒకవేలు అవతలివైపు చూపిస్తే తనవైపు నాలుగువేళ్ళు చూపిస్తాయని మరిచిపోవద్దు. జగన్ మోహన రెడ్డి అధికారం లోకి వచ్చిన తర్వాత కీలక పోస్టుల్లో ఒకే సామాజికవర్గం వాళ్ళు వున్నారని పేర్లతో సహా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టటం చూస్తున్నాము. అదే పని చంద్రబాబు నాయుడు హయం లో కూడా జరిగింది. ఇందులో ఎవరూ పత్తిత్తులు కాదు. కాకపోతే మరీ బరితెగించి ఊళ్లలో అరుచుకున్నట్లు కులాన్ని పెట్టి దూషించటం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వ్యక్తి చేయకూడదు. తన నిర్ణయంపై కోర్టు కెళ్ళటం మీకున్న అవకాశం. దాన్ని వినియోగించుకోవటం వరకు మీ కున్న హక్కు. అంతేగాని మీ స్థాయిని తగ్గించుకొని మాట్లాడటం ఇకనుంచైనా మానుకోవాలి.

సుప్రీమ్ కోర్టు ఉత్తర్వులు సహేతుకంగా వున్నాయి. ఒకవైపు ఎన్నికల కమిషన్ ని మందలిస్తూనే ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సమర్ధించింది. ఎందుకంటే ఇది అన్ని కేసుల్లో పరిష్కృతమైన తీర్పు. ఎన్నికల కమిషన్ నిర్ణయం లో కోర్టులు జోక్యం చేసుకోకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది. అదేసమయంలో ఎన్నికల కమిషన్ హుందాగా, పారదర్శకంగా ప్రవర్తించాల్సివుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకపోవటం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. సుప్రీం కోర్టు కూడా ఇదే చెప్పింది. ముఖ్యమంత్రి గారూ , మీరు ఈ రాష్ట్ర ప్రజలందరికి పరిపాలకులు. ఇప్పటికే మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజాదరణ పొందాయి. స్థానిక ఎన్నికల్లో ప్రజలు మీకే బ్రహ్మరధం పడతారనేది కూడా వాస్తవం. అటువంటప్పుడు మీరు హుందాగా ఉండటానికి ప్రయత్నించండి. అంతేగాని హోదామరచి ప్రవర్తిస్తే ఇప్పుడు మీకు మద్దత్తు తెలిపే ప్రజలే వేలెత్తిచూపుతారు. మీ కేబినెట్ లో కూడా మీరు వేలెత్తి చూపే సామాజిక వర్గ మంత్రులు వున్నారు, మీకు ఓట్లు వేసిన వాళ్లలో కూడా ఆ సామాజిక వర్గ ప్రజలున్నారు. కుల సామరస్యం నెలకొల్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీపై వుంది. సుప్రీం కోర్టు తీర్పు సమతుల్యంగా వుంది. దేశం మొత్తం కరోనా మహమ్మారి భయంతో వుంది. దానికి సంబందించిన పనులపై పూర్తి దృష్టి పెట్టండి. సంక్షేమ పధకాల అమలుపై సుప్రీం కోర్టు వివరణ ఇచ్చింది కాబట్టి వాటిపై దృష్టి సారించండి. ఆంధ్ర సమాజం కుల, మత , ప్రాంత బేధాలనుంచి బయటపడి అందరూ ఒక్కటేనని నినదించే రోజుకు అందరం కృషిచేద్దాం.