ఆంధ్రప్రదేశ్తెలంగాణప్రత్యేకంరాజకీయాలు

జ‌ల‌జ‌గ‌డంః జ‌గ‌న్ వ్యూహంలో కేసీఆర్ చిక్కిన‌ట్టే?

రెండు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదం సుప్రీం చెంత‌కు చేరిన విష‌యం తెలిసిందే. దీనిపై ఇటీవ‌ల స్పందించిన ధ‌ర్మాస‌నం.. రెండు రాష్ట్రాలూ కూర్చుని మాట్లాడుకోవాల‌ని, తాము మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేస్తామ‌ని చెప్పింది. అయితే.. దీనిపై ఏపీ స‌ర్కారు త‌న అభిప్రాయాన్ని చెప్పేసింది. త‌మ‌కు కోర్టు ద్వారా వ‌చ్చే న్యాయ ప‌రిష్కార‌మే కావాల‌ని, విచార‌ణ కొన‌సాగించాల‌ని న్యాయ‌స్థానాన్ని కోరింది. జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఎవ‌రికి మేలు? ఎవ‌రికి ఇబ్బంది? అనే చ‌ర్చ మొద‌లైంది. అయితే.. మెజారిటీ మాత్రం జ‌గ‌న్ కే మంచి జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఎలా అన్న‌ది చూద్దాం.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2015లో కృష్ణాజ‌లాల విష‌యంలో రెండు రాష్ట్రాలూ ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్ర‌కారం.. ఏపీకి 500 టీఎంసీలు, తెలంగాణ‌కు 300 టీఎంసీల నీళ్లు వాడుకోవాల్సి ఉంది. ఒప్పందం కుదిరిన ద‌గ్గ‌ర్నుంచి ఇదే ప‌ద్ధ‌తి కొన‌సాగుతోంది. వైసీపీ పోతిరెడ్డిపాడు విస్త‌ర‌ణ చేప‌ట్ట‌డంతో గొడ‌వ మొద‌లైంది. ఆ త‌ర్వాత తెలంగాణ విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌డంతో రెండు రాష్ట్రాల మ‌ధ్య పంచాయితీ ముదిరింది. వివాదం సుప్రీం చెంత‌కు చేర‌డం.. కేంద్రం కూడా గెజిట్ జారీచేయ‌డం జ‌రిగిపోయింది.

ఇప్పుడు గ‌న‌క మ‌ళ్లీ మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో కూడిన ఒప్పందాలు చేసుకుంటే.. ఏపీకి న‌ష్టం జ‌రుగుతుంద‌నే అభిప్రాయం ఉంది. ఎందుకంటే.. నీటి కేటాయింపుల్లో 50 – 50 వాటాను అనుస‌రించాల‌ని కేసీఆర్ డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కూర్చుని మాట్లాడుకుంటే.. ఖ‌చ్చితంగా ఈ అంశంపై తెలంగాణ పేచీ పెడుతుంద‌ని, అందుకే.. జ‌గ‌న్ స‌ర్కారు ఆలోచించి, న్యాయ విచార‌ణ‌కే మొగ్గు చూపింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

న్యాయ విచార‌ణ కొన‌సాగితే ఎన్నేళ్లు ప‌డుతుందో తెలియ‌దు. అప్ప‌టి వ‌ర‌కు 2015లో చేసుకున్న ఒప్పంద‌మే అమ‌ల్లో ఉంటుంది. అంటే.. ఏపీకి 500 టీఎంసీల నీటి కేటాయింపులు జ‌రుగుతాయి. కాబ‌ట్టి.. ఇబ్బంది లేద‌ని జ‌గ‌న్ భావించార‌ని చెబుతున్నారు. 2015నాటి ఒప్పందం చేసుకున్న‌ది కూడా కేసీఆర్ స‌ర్కారే కాబ‌ట్టి.. దానిపై నెగెటివ్ కామెంట్ చేయ‌డానికి అవ‌కాశం లేదు. ఈ విధంగా కేసీఆర్ ను జ‌గ‌న్ లాక్ చేశార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అంతేకాకుండా.. ఏపీలో విప‌క్షాల‌కు సైతం ఈ విష‌యంలో జ‌గ‌న్‌ చెక్ పెట్టార‌ని అంటున్నారు. నీటి గొడ‌వపై ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు నాయుడు స్పందించ‌లేదు. ఇద్ద‌రూ కూర్చొని మాట్లాడుకుంటే.. అప్పుడు మాట్లాడుదామ‌ని ధోర‌ణిలో బాబు ఉన్నారు. ఇద్ద‌రు సీఎంలు పొలిటిక‌ల్ డ్రామా ప్లే చేస్తున్నార‌ని ఇప్ప‌టికే ఆరోప‌ణ‌లు వస్తున్న సంగ‌తి తెలిసిందే. కాబ‌ట్టి.. రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్న త‌ర్వాత విమ‌ర్శ‌లు గుప్పిద్దామ‌ని భావించి ఉంటారు. అయితే.. జ‌గ‌న్ తన నిర్ణ‌యం ద్వారా ఆ ఛాన్స్ లేకుండా చేశార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మొత్తంగా ఒకే దెబ్బ‌కు మూడ్నాలుగు పిట్ట‌లు కొట్టేశార‌ని.. కేసీఆర్ కు, బాబుకు ఒకే డెసిష‌న్ తో చెక్ పెట్టార‌ని అంటున్నారు.

Back to top button