టాలీవుడ్సినిమా

చంద్రముఖికి తెలియకుండానే సిక్వెల్ ప్లాన్ చేశారా!

చంద్రముఖి అనగానే గుర్తుకొచ్చే పేరు జ్యోతిక. పి.వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి సినిమా తెలుగు, తమిళ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. సస్పెన్స్ థిల్లర్ గా తెరకెక్కిన చంద్రముఖి మూవీ ఆద్యంతం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభులు అద్భుత నటనను కనబర్చారు. ముఖ్యంగా రజనీకాంత్, జ్యోతిక నటన సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

ఈ మూవీ రిలీజయ్యాక ఎక్కడ చూసిన ‘ఉమ్మా..లక..లక..లక..’ అంటూ జ్యోతిక, రజనీ మ్యానరిజం డైలాగులే విన్పించాయి. ‘వారయ్’ అంటూ వచ్చే పాట విశేష ప్రేక్షక ఆదరణ పొందింది. గంగ, చంద్రముఖి రెండు విభిన్న పాత్రల్లో జ్యోతిక అద్భుతంగా నటించి అందరిచేత శభాష్ అనిపించుకుంది. చంద్రముఖి సినిమా అప్పట్లో తెలుగులో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ మూవీకి దర్శకుడు పి.వాసు సీక్వెల్ ప్లాన్ చేశారు. ‘చంద్రముఖి-2’గా ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో చంద్రముఖిగా నటించిన జ్యోతికను ఈ సీక్వెల్ గురించి ప్రశ్నిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ‘చంద్రముఖి-2’ సీక్వెల్ గురించి తనకు తెలియదని.. ఈ సినిమా కోసం తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పింది.

‘చంద్రముఖి-2’ సీక్వెల్లో రజనీకాంత్ స్థానంలో డాన్సర్ కమ్ హీరో లారెన్స్ నటిస్తున్నాడు. ఇదే విషయాన్ని లారెన్స్ గతంలోనే ప్రకటించాడు. ఈ మూవీ చేసేందుకు నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్స్ చెక్కును లారెన్స్ కరోనా బాధితులకు అందజేస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా జ్యోతిక చెప్పిన విషయం చూస్తుంటే చంద్రముఖి పాత్రలో మరేవరైనా నటిస్తారా? అనే సందేహం కలుగుతోంది. జ్యోతిక లేకుండా చంద్రముఖి సీక్వెల్ తీస్తారా? అనేది తేలాల్సి ఉంది. రజనీకాంత్-జ్యోతిక లేకుండా చంద్రముఖి-2 మూవీని ఊహించడం అభిమానులకు కష్టంగానే ఉండబోతుంది. ఈనేపథ్యంలో దర్శకుడు పి.వాసు చంద్రముఖి క్యారెక్టర్లో జ్యోతికను తీసుకుంటారా? లేక కొత్తవారిని ట్రై చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. సినిమా షూటింగులు ప్రారంభమయ్యే నాటికి చంద్రముఖి క్యారెక్టర్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతవరకు వేచి చూడాల్సిందే..!