జాతీయంరాజకీయాలు

గాయ‌ని క‌నికాకు మూడోసారి పాజిటివ్‌

విదేశాల నుండి వచ్చి, చడీ చప్పుడు లేకుండా తిరుగుతూ, లక్నోలో విలాసవంతమైన దావత్ లో పాల్గొని, అక్కడ ఆమెను కలిసిన మాజీ సీఎం వస్టుంధార రాజేతో సహా పలువురు రాజకీయ ప్రముఖులను స్వీయనిర్బంధంలోకి పంపి పెను దుమారం రేపిన బాలీవుడ్ సింగర్ కనికాకపూర్‌కు మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ అని వైద్యులు తేల్చారు.

ఇది వరుసగా ఆమెకు పాజిటివ్ రావడం మూడోసారి. ప్రస్తుతం లక్నోలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఆమె ఒక సెలబ్రెటీ వలే కాకుండా, ఒక రోగి వలే వ్యవహరిస్తూ, తమకు సహకరించాలి అంటూ వైద్యులు ఆమెపై చికాకు కనబరచడం తెలిసిందే. అయితే వైద్యులే తనను వేధిస్తున్నారని అంటూ ఆమె ఎదురు దాడికి పాల్పడ్డారు.

లండన్ నుంచి వచ్చిన కనికాకపూర్‌ కరోనావైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత రోగ లక్షణాలు గుర్తించిన వైద్యులు ఆమెకు మార్చి 20న, మార్చి 23న నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజాగా మూడోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనావైరస్ ఆమెకు తీవ్రస్థాయిలో ఉన్నదనే విషయాన్ని వైద్యులు మరోసారి నిర్దారించారు.

కాగా ఆమెతో స‌న్నిహితంగా ఉన్న‌వారంద‌రి వివ‌రాల‌ను సేక‌రించారు. వారంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 63మందికి నెగెటివ్ ఉన్న‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

మరోవంక, క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో కనికాకపూర్ బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదు చేశారు.