అత్యంత ప్రజాదరణతెలంగాణరాజకీయాలు

కల్లలు చేసిన కలల ప్రాజెక్టు


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌‌ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేయాలని అనుకున్నారు. కానీ.. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కె.చంద్రశేఖర్‌‌రావు ఆ ప్రాజెక్టును మూలనపడేశారు. ప్రాజెక్టు ఎక్కడో తుమ్మిడిహెట్టి దగ్గర కట్టడం వల్ల తెలంగాణ కలిగే లాభం ఏం లేదని వాదించారు. ఎలాగైనా ఆ ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని అనుకున్నారు.

ఆ ప్రాజెక్టు డిజైన్‌ను మారుస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు కేసీఆర్‌‌. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని గొప్పలు చెప్పారు. ఈ ఒక్క ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుందని అటు సీఎం కేసీఆర్‌‌.. ఇటు ఆయన టీమ్‌ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా అదే నిజం అని నమ్మారు. దీనికితోడు ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌ లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఒకవిధంగా చెప్పాలంటే కాళేశ్వరం కేసీఆర్‌‌ కలల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తిచేసేందుకు రాష్ట్ర ఖజానాను పూర్తిగా ధారబోసారు. అంతేనా.. ఎన్నో రకాల అప్పులు చేశారు. ఆ ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చుతో రాష్ట్ర ఖజానా ఇప్పటికీ పుంజుకోవడం లేదు అది వేరే విషయం అనుకోండి.

‘‘రాష్ట్రానికే తలమానికం అని చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేవలం 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లలోని భూములకు కూడా సాగునీరు అందించని దుస్థితిలో ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌‌పూర్‌‌ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ కట్టారు. లింక్‌‌‒1 కింద మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారు. పంప్‌‌హౌస్లు నిర్మించారు. పనులు పూర్తయ్యాక భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలలో 30 వేల ఎకరాలకు నీళ్లిస్తామని ప్రకటించారు. పంపింగ్‌‌ మొదలై రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు ఏ ఒక్క ఎకరానికి కూడా ప్రభుత్వం నీళ్లివ్వలేదు.’’

* సమయానికి లిఫ్ట్‌ చేయక.. ఎండుతున్న పొలాలు
కానీ.. అంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి.. రాష్ట్ర రైతాంగానికి ఏపాటి మేలు జరిగింది..? అంటే లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన ఆ ప్రాజెక్టు రైతులకు ఆపతి కాలంలోనూ నీరివ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. ప్రాజెక్టు కింద సాగు చేసిన లక్షల ఎకరాల పంటలు నీళ్లందక ఎండిపోతున్నాయి. ఆయకట్టు మొత్తానికి నీళ్లు ఇస్తామన్న రాష్ట్ర సర్కార్ మాటలు నమ్మి పంటలు సాగు చేసిన రైతులు ఆగమవుతున్నారు. ఎండిన పొలాలను చూసి తల్లడిల్లిపోతున్నారు. సమయానికి గోదావరి నీళ్లను ఎత్తిపోయడంలో సర్కార్ ఫెయిల్ అవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గత సీజన్లో (2019 జూన్ నుంచి 2020 మే వరకు) 60 టీఎంసీల నీళ్లను ఎత్తిపోస్తే ఈ సీజన్‌లో కేవలం 33 టీఎంసీలు లిఫ్ట్ చేసింది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు అడుగంటాయి. ఎగువన ప్రాణహిత నదిలో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో తగ్గింది. నీళ్లు ఎక్కువగా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇటీవల ఆఫీసర్లు మోటార్లను ఆఫ్‌ చేశారు. మొత్తంగా ఈ సీజన్లో 53 రోజులు మాత్రమే మోటార్లను నడిపించారు. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌ను రీచ్ కాలేకపోయింది. ఏటా 225 టీఎంసీలు ఎత్తి పోసి 40 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మళ్లీ ఉత్తదే అయింది. ఈ సీజన్లో 15 శాతం నీళ్లు కూడా లిఫ్ట్ చేయలేదు.

* 100 టీఎంసీలు ఎక్కువగా లిఫ్ట్ చేస్తామని చెప్పి
గత సీజన్ కంటే ఈ సీజన్లో (2020 జూన్ నుంచి 2021 మే వరకు) దాదాపు100 టీఎంసీలు ఎక్కువగా గోదావరి నుంచి నీళ్లు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తామని కొన్నాళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ సీజన్‌లో చాలా ఆలస్యంగా ఎత్తిపోతలు చేపట్టారు. జనవరి 17న కాళేశ్వరం ప్రాజెక్టు ఆఫీసర్లు నీటి ఎత్తిపోతలు ప్రారంభించగా.. మొత్తం 17 మోటార్లలో 7 మోటార్ల ద్వారా మార్చి 9 వరకు కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ నుంచి 33 టీఎంసీల నీటిని లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేసి ఆఫ్‌ చేశారు. ప్రాణహితలో నీళ్లు తగ్గడంతో 27 రోజుల కింద మోటార్లు బంద్చేసినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో ఈ సీజన్‌లో ఎత్తిపోతలు 33 టీఎంసీలతోనే ఆగిపోయినట్లయింది.

* ఉన్న నీళ్లు మూడు, నాలుగు లక్షల ఎకరాలకే..
ఏటా 225 టీఎంసీలు ఎత్తిపోసి18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.83 లక్షల ఎకరాల పాత ఆయకట్టుకు నీళ్లిచ్చే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నిర్మించారు. ఇందుకోసం మొదట కన్నెపల్లి పంప్హౌస్ దగ్గర 11 మోటార్లు ఏర్పాటు చేశారు. మూడో టీఎంసీ కోసం మరో ఆరు మోటార్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం అదనంగా రూ. 20 వేల కోట్లకు పైగా బడ్జెట్‌ ఖర్చు చేశారు. కన్నెపల్లి పంప్హౌస్ దగ్గర 17 మోటార్లకు రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తి పోసే కెపాసిటీ ఉన్నప్పటికీ, ఈ సీజన్‌లో కేవలం ఏడు మోటార్లను నడిపించారు. దీంతో వరద వచ్చిన రోజుల్లో 33 టీఎంసీల నీటిని మాత్రమే లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేయగలిగారు. ఈ నీళ్లు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే సరిపోతాయి. దీంతో ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల పంటలు నీళ్లు అందక ఎండిపోతున్నాయి.

* కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలే..
గతేడాది కాళేశ్వరం కింద కొత్తగా 12.71 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని ప్రభుత్వం బడ్జెట్ప్రతిపాదనల్లో పేర్కొంది. కానీ.. కొత్తగా ఒక్క ఎకరాకూ ఇవ్వలేకపోయింది. సర్కారు మాటలు నమ్మి పెండింగ్ప్రాజెక్టులు, కెనాల్స్ పూర్తవుతాయని, ఆయకట్టు చివరి భూములకూ నీళ్లొస్తాయని, చెరువులు నిండుతాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు ఆనందపడ్డారు. దీనికితోడు భారీ వర్షాలు కురవడం, ప్రాజెక్టులన్నీ నిండటంతో రైతులు కాళేశ్వరం, దాని పరిధిలోని మిడ్మానేరు, లోయర్ మానేరు డ్యాంల కింద, అటు మల్లన్నసాగర్వరకు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని రైతులు లక్షలాది ఎకరాల్లో వివిధ పంటలు ముఖ్యంగా వరి సాగు చేశారు. కానీ.. పెండింగ్రిజర్వాయర్లు పూర్తికాకపోవడం, ఉన్న ప్రాజెక్టుల్లో నీళ్లు తగ్గడం, కాళేశ్వరం నుంచి వాటర్ లిఫ్టింగ్ఆగడంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఈ యాసంగిలో ఆయా ప్రాజెక్టుల కింద వారబందీ పద్ధతిలో నీళ్లు ఇస్తుండడంతో చివరి ఆయకట్టు భూముల్లోని వరిపొలాలు ఎండిపోతున్నాయి.

* డెడ్ స్టోరేజీ దగ్గర మేడిగడ్డ
వేసవి ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కానేలేదు. మార్చినెల మొన్నటితో ముగిసింది. ఏప్రిల్‌ ప్రారంభమైంది. ఇంకా మే నెల గడవాల్సి ఉంది. కానీ.. అప్పుడే మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు అడుగంటిపోయాయి. 16.17 టీఎంసీల కెపాసిటీ గల ఇందులో ప్రస్తుతం 2 టీఎంసీలే ఉన్నాయి. యాసంగి పంట చేతికి రావడానికి ఇంకా నెల రోజులకు పైగా పడుతుంది. ఈ టైంలోనే పంటలకు నీటి అవసరం ఎక్కువ. ఇలాంటి టైమ్‌‌లో మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీళ్లు లేకపోవడం, కాళేశ్వరం మోటార్లు బంద్‌‌‌‌‌‌‌‌ చేయడం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పనితీరును తేటతెల్లం చేస్తోంది. మార్చి నుంచి మే నెలాఖరు వరకు ప్రాణహితలో నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రోజూ వెయ్యి క్యూసెక్కుల నీళ్లే మేడిగడ్డకు చేరుతున్నాయి. ఈ కొద్దిపాటి నీటితో రాష్ట్రంలోని 40 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం అసాధ్యం. కాళేశ్వరం వల్లే రాష్ట్రంలో పంటల సాగు పెరిగిందని సర్కార్ చెప్తున్న మాటలకు.. వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని నిపుణులు అంటున్నారు.

* కాళేశ్వరం కింద ప్రాజెక్టుల వారీగా పరిస్థితి ఇదీ..
ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పూర్తి కెపాసిటీ 20.175 టీఎంసీ లు కాగా, ప్రస్తుతం 14.337 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందులో నుంచి డెయిలీ ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మెట్రో వాటర్‌‌‌‌‌‌‌‌ వర్క్స్‌‌‌‌‌‌‌‌కు 281 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఇరిగేషన్ కోసం ఉన్న ఒకే ఒక్క గూడెం లిఫ్టు ద్వారా ప్రతి సీజన్లో 3 టీఎంసీలు ఎత్తిపోసి 30 వేల ఎకరాలకు సాగునీరివ్వాలనేది లక్ష్యం. కానీ.. ఈసారి 10 వేల ఎకరాలకు మించి నీళ్లు అందడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని మిడ్ మానేర్ ప్రాజెక్టు కెపాసిటీ 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.49 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇక్కడి నుంచి వివిధ ప్యాకేజీల ద్వారా 2 లక్షల 20 వేల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉంది. కానీ అందులో సగానికి కూడా అందడం లేదు. చివరి ఆయకట్టుకు నీళ్లందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఎస్సారెస్పీ కింద కూసు మంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో 80,881 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఈ ఆయకట్టు టెయిలెండ్ గా ఉంది. గతంలో ఒకసారి అది కూడా దాదాపు పదేండ్ల కింద ట్రయల్ రన్ నిర్వహించగా, ఈ ఏడాది తొలిసారి కాల్వల ద్వారా జిల్లాకు 10 రోజులు నీళ్లు చేరాయి. ఆ తర్వాత ఇవ్వలేదు. సిద్దిపేట జిల్లా పరిధిలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్‌‌లో ప్రస్తుతం 1.13 టీఎంసీ నీళ్లున్నాయి. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి కాకపోవడంతో దాదాపు 10 వేల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. 50 టీఎంసీల కెపాసిటీతో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ ప్రాజక్టు పనులు పూర్తి కాకపోవడంతో దాదాపు 30 వేల ఎకరాలకు నీళ్లు అందడం లేదు. కొండపొచమ్మ సాగర్ రిజర్వాయర్‌‌లో ప్రస్తుతం 8.02 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో దాదాపు 15 వేల ఎకరాల్లో పంటలకు నీళ్లు అందడం లేదు. కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండీ పూర్తి కెపాసిటీ 24.034 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15.121 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. కాకతీయ కెనాల్ ద్వారా రోజూ 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ కెనాల్ కింద కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లోని 9 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ కూడా వారబందీ అమలు చేస్తున్నారు. కానీ.. టెయిల్ఎండ్ భూములకు వాటర్ పూర్తిస్థాయిలో చేరడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తంగా కేసీఆర్‌‌ కలలు కన్న ప్రాజెక్టు.. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టు.. రైతాంగం ఆశలు పెట్టుకున్న ప్రాజెక్టు.. ఇప్పుడు ఎటూకాకుండా పోయింది. అందరి ఆశలపై నీళ్లు చల్లిన పరిస్థితి తెచ్చింది.

Back to top button