తెలంగాణరాజకీయాలుసంపాదకీయం

కెసిఆర్ బీజేపీ కి పరోక్షంగా సాయం ?

కెసిఆర్ తెలంగాణ కి తిరుగులేని నాయకుడు. ఇప్పట్లో తన అధికారాన్ని సవాలు చేసే రాజకీయ ప్రత్యర్థి లేడు. అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని స్థానిక సంస్థల ఎన్నికల దాకా అన్నింటిలో తెరాస తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది ఒక్క లోక్ సభ ఎన్నికలు తప్ప. ఇంకా నాలుగు సంవత్సరాలు ఎటువంటి ఎన్నికలూ లేవు. కేవలం కొన్ని మునిసిపల్ కార్పొరేషన్ల లోనే ఎన్నికల వాతావరణం ఉంటుంది. ఇంతటి సానుకూల వాతావరణం చాలా తక్కువమందికి, చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. ఒకవిధంగా ఇది కెసిఆర్ కి కలిసొచ్చిన కాలమని చెప్పాలి.

ఒవైసీఇంతటి మంచి వాతావరణాన్ని అలాగే కొనసాగించటం ఎవరైనా కోరుకుంటారు. కానీ కెసిఆర్ కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నట్లుగా వుంది.  తో స్నేహం కొంపముంచేటట్లు వుంది. మొదట్లో దీన్ని ఎవరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. కేవలం కొన్ని ముస్లిం ఓట్లకోసం రహస్య ఒప్పందం ఉండేది. తర్వాత ఆ బంధం మెల్లి మెల్లిగా బలపడసాగింది. ఇప్పటివరకు ఎన్నికల్లో మజ్లీస్ పార్టీతో బహిరంగ ఒప్పందం లేదు. అయితే చీకటి ఒప్పందం తో ఇరువురూ కొన్ని నియోజక వర్గాల్లో బలహీనమైన అభ్యర్థులను నిలబెడుతూ ఒకరికొకరు సాయ పడుతున్నారు. ఇది ఇప్పటివరకూ పెద్ద ఇష్యూగా ప్రజలముందుకి రాలేదు. కానీ పరిస్థితుల్లో క్రమేపీ మార్పువస్తున్నట్లు కనబడుతుంది. అందరూ అనుకోవచ్చు ఇది ఎన్నికల్లో ప్రతిబింబించటం లేదుకదా అని. రాజకీయాల్లో మార్పులు అతివేగంగా మారిన సందర్భాలు చరిత్రలో అనేకం వున్నాయి. దీనికి సూచనలు మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ లో సూచాయగా కనిపించాయి.

అయితే అది కూడా రాష్ట్రం మొత్తం ప్రభావం చూపలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆదిశగా పయనించవచ్చని అనిపిస్తుంది. ఒకటి, ఒవైసీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హిందూ-ముస్లిం విభజన రాజకీయాల్లో తలమునకలై వుండటంతో క్రమేపీ ఆ ప్రభావం తెలంగాణ ఓటర్ల మీద పడే అవకాశం వుంది. అదే జరిగితే కెసిఆర్ కి నష్టం జరుగుతుంది. ఎందుకంటే కొత్తగా ముస్లిం ఓటర్లు కెసిఆర్ వైపు మొగ్గుచూపేదేమీ లేదు. ఇప్పటికే వాళ్ళందరూ కెసిఆర్ వైపు వున్నారు. కానీ హిందూ ఓటర్లలో కొంత భాగం పునరాలోచనలో పడటం ఖాయం. దీనికి సిఏఏ పై కెసిఆర్ వైఖరి అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. వచ్చే అసెంబ్లీ లో సిఏఏ కి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే బీజేపీ కి కొత్త ఆయుధం ఇచ్చినట్లవుతుంది. ఇప్పటికే ఒవైసీ తో స్నేహం పై ప్రజల్లో అనుమానాలున్నా ఇటువంటి తీర్మానాలతో బీజేపీ చెబుతున్నట్లు కెసిఆర్ ఒవైసీ గుప్పెట్లో వున్నాడని నమ్మే ప్రజానీకం పెరుగుతుంది. ఇది బీజేపీ కి సానుకూల అంశంగా మారొచ్చు.

ఒవైసీ పార్టీ మజ్లీస్ చరిత్ర తెలిస్తే హిందువుల్లో , లౌకికవాదుల్లో కోపం పెరగటం ఖాయం. నిజాం పాలనలో రజాకార్లు గ్రామాలపై పడి ఏ విధంగా హిందువులపై అకృత్యాలు చేసారో అందరికీ తెలిసిందే. ఆ రజాకార్ల వారసత్వమే మజ్లీస్ పార్టీ . 75 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘోరాల్ని ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు , వాళ్ళ పెద్దలు చెప్పినవి విన్నవాళ్ళు తెలంగాణాలో గణనీయంగా వున్నారు. ఇప్పుడు జరిగే పరిణామాలు చరిత్రను మరొక్కసారి గుర్తుకు తెచ్చే ప్రమాదముంది. ఆచి తూచి అడుగులు వేసే కెసిఆర్ ఈసారి ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకున్నాడో తెలియదు. వాస్తవానికి మునిసిపల్ ఎన్నికలముందే ముస్లిం మతపెద్దల్ని తీసుకొని ఒవైసీ కెసిఆర్ ని కలిసినా ఎన్నికలయ్యేవరకు దీనిపై మాట్లాడని కెసిఆర్ ఇప్పుడు వడి వడిగా అడుగులేయటం వెనక రెండు కారణాలుండొచ్చు. ఒకటి, ఇప్పట్లో ఎన్నికల భయం లేకపోవటం. రెండు, తాను కట్టిస్తున్న యాదగిరి స్వామి ఆలయం హిందువుల్లో తనపై విశ్వాసాన్ని వుంచుతుందనే నమ్మకం. అలాగే ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం దేశంలో బీజేపీయేతర పార్టీలకు నాయకత్వం వహించాలనే కుతూహలం లోలోపల బలంగా ఉండటం. ఏది ఏమైనా ఈ నిర్ణయం తెలంగాణాలో అనుకోకుండా బీజేపీ కి కలిసివచ్చిన అదృష్టమని చెప్పాలి. ఈ నిర్ణయంతో తెలంగాణాలో తెరాస కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగటం ఖాయం. కాంగ్రెస్ స్థానంలో బీజేపీ బలపడటం ఖాయంగా కనిపిస్తుంది. కెసిఆర్ పరోక్షంగా కాంగ్రెస్ ని దెబ్బతీసి బీజేపీ ని ప్రత్యామ్నాయంగా తెలంగాణలో ముందుకుతీసుకొచ్చినట్లయ్యింది. అయితే బీజేపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవటం దాని సామర్ద్యాన్నిబట్టి వుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.