తెలంగాణరాజకీయాలు

కేసీఆర్ కు కరోనా మరక.. వదిలేలా లేదుగా?


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రి అయిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. కేసీఆర్ ముందుచూపుతోనే టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిందని టీఆర్ఎస్ నేతలు చెబుతుంటారు. సీఎం కేసీఆర్ ఆరేళ్ల పాలనలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించింది. ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందరివాడుగా కేసీఆర్ ఖ్యాతిగడించారు. ఈ ఆరేళ్ల కాలంలో తెలంగాణలో కేసీఆర్ మాటకు ఎదురులేకుండా పోయింది. అయితే చైనా నుంచి వచ్చిన మాయదారి రోగం సీఎం కేసీఆర్ కు కరోనా మరక అంటించింది. ఆయనను ముప్పుతిప్పులు పెడుతోంది. ఈ మహమ్మరి పట్ల తొలినాళ్లలో కేసీఆర్ ప్రదర్శించిన నిర్లక్ష్యం ఇప్పుడు ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువ అవుతుండటంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

బతికుంటే బలుసాకు తిందాం.. ఇంటికి పోదాం!

కరోనాను విషయంలో సీఎం కేసీఆర్ తొలినాళ్లలో చాలా నిర్లక్ష్యం ప్రదర్శించారనే భావన తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతోంది. కరోనా తెలంగాణ టెంపరేచర్లో బతుకదని.. 20డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో కరోనా స్మాష్ అవుతుందని.. సాధారణ జ్వరం వస్తే ఎలాంటి మందులు తీసుకుంటారో అలాంటిదే ఇదని.. పారాసిటామాల్ వేసుకుంటే సరిపోతుందని.. తెలంగాణ ప్రజాప్రతినిధులు మాస్కులు లేకుండా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కేసీఆర్ మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఆ తర్వాత కేసీఆర్ ఈ మహమ్మరి ఎంత డేంజరో తెలుసుకొని దేశంలో అందరి కంటే ముందుగానే లాక్డౌన్ విధించారు.

లాక్డౌన్ అమలు చేసిన తొలినాళ్లలో కరోనా కేసుల సంఖ్య అదుపులోనే ఉంది. అయితే లాక్డౌన్ సడలింపుల అనంతరం సర్కార్ ఉదాసీనంగా వ్యవహరించడం కరోనా వ్యాప్తికి అవకాశం ఏర్పడింది. వైరస్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా విస్తరించింది. మరోవైపు వైరస్ సోకిన కాంటాక్టులను పూర్తిస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం కట్టడి చేయడంలో విఫలం అవడంతో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడానికి కారణమని చెప్పొచ్చు. లాక్డౌన్ సడలింపులకు ముందు కేవలం హైదరాబాద్లో మినహా అన్ని జిల్లాల్లో కరోనా కేసులు జీరోకు చేరువయ్యాయి. అయితే లాక్డౌన్ సడలింపుల తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షేనా?

ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య పెరిగిపోవడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ పై నగరవాసులు తీవ్రస్థాయిలో మండిపడిపోతున్నారు. కరోనాపై ప్రభుత్వం చేతులేత్తిసిందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వ్యాపారులు సర్కారును నమ్ముకోకుండా వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛంధంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని ఆరోపిస్తున్నారు. స్వీయ నియంత్ర‌ణ పాటించ‌డం ద్వారానే మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోగ‌లుగుతామ‌ని వ్యాపారులు చెబుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సర్కార్ అలర్ట్ అయింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ప్రజలు కూడా లాక్డౌన్ విధించాలని కోరుతుండటంతో అందుకనుగుణంగా సీఎం కేసీఆర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఈసారి లాక్డౌన్ చాలా కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కిందటిసారి విధించిన లాక్డౌన్ ఫెయిల్ అవడంతో ఈసారి చాలా కఠినంగా లాక్డౌన్ ఉంటుందని తెలుస్తోంది.

కేవలం రెండుగంటలే నిత్యావసర సరుకులు కొనుగోలు పర్మిషన్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మిగతా సమయమంతా కర్ఫ్యూ ఉంటుందని సమాచారం. ఈమేరకు సీఎం కేసీఆర్ క్యాబినెట్ ను సమావేశపరిచి రెండ్రోజుల్లో కీలక నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కు అంటిన కరోనా మరక ఇప్పట్లో వదిలేలా కన్పించడం లేదు. దీనిని ఆయన ఏవిధంగా వదిలించుకుంటారో వేచి చూడాల్సిందే..!