టాలీవుడ్సినిమా

కేసీఆర్, జగన్ ల వ్యూహానికి ప్రతిపక్షాల కుదేలు

అంతన్నారు.. ఇంతన్నారు.. మన తెలుగు రాష్ట్రాల సీఎంలు.. చివరకు అందరినీ రెచ్చగొట్టి మౌనముద్ర వేశారు. నిజానికి ఇది ఇద్దరూ ఆడించిన ఆట అనే అనుమానం కలుగకమానదు. ఎందుకంటే ఆ అంత టామ్ జెర్రీలా సాగిన ఈ వ్యవహారంలో కేసీఆర్, జగన్ అంత త్వరగా కూల్ అయిపోయి విమర్శలు చేసుకోకపోవడం గమనిస్తే అలానే అనిపిస్తోంది మరీ..

*మౌనం దాల్చిన సీఎంలు..
పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ నీటి వివాదానికి చెక్ పడింది. కేంద్ర గ్రీన్ ట్రిబ్యూనల్ బ్రేక్ వేసింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో టాపిక్ ను డైవర్ట్ చేసి తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రతిపక్షాలను బుక్ చేశాయని చెప్పవచ్చు. ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేశాయి. దిక్కుతోచక ప్రభుత్వాలకే మద్దతు ఇచ్చే పరిస్థితిని కేసీఆర్, జగన్ కల్పించారనే చెప్పాలి. ఇంత పెద్ద రచ్చ జరిగాక రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లు మౌనంగా ఉండడం నిజంగానే అనుమానాలకు తావిస్తోంది.

*జగన్ తో దోస్తీకే కేసీఆర్ మొగ్గు.. నో విమర్శలు
మొన్నటి కేసీఆర్ ప్రెస్ మీట్ ను ప్రతిపక్షాలు కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలతోపాటు ఎల్లో మీడియా ఆసక్తిగా గమనించాయి. కేసీఆర్ పోతిరెడ్డిపాడుపై స్పందిస్తాడని.. ఏపీని తిడుతాడని.. జగన్ తో ఫైటింగ్ చేస్తాడని అందరూ భావించారు. కానీ జగన్ ను ఒక్క మాట అనకుండా కేసీఆర్ ప్రెస్ మీట్ ముగించాడు. ఏపీతో స్నేహాన్ని కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. దీంతో బ్రేకింగ్ న్యూస్ ల కోసం కాచుకు కూర్చున్న ఎల్లో మీడియాకు షాక్ తగిలింది. ప్రతిపక్షాల ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారు. కేసీఆర్ వ్యాఖ్యలతో రచ్చ చేద్దామనుకున్న ఎల్లోమీడియా, టీడీపీకి కేసీఆర్ గట్టి షాక్ ఇచ్చారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ట్వీట్ చేశారు.

*జగన్ సైతం అదే బాట..
ఇక జగన్ సైతం కేసీఆర్ ను ఒక్క మాట అనకుండా తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టులపై ఫిర్యాదులతోనే సరిపుచ్చారు. సీరియస్ గా స్పందించలేదు. వైసీపీ మంత్రులు, ఎంపీలు కూడా ఈ విషయంలో నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిచ్చింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే కేసీఆర్ సామరస్యంగా మాట్లాడారని పొగడడం విశేషం. చంద్రబాబు ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారని ఎద్దేవా చేశారు. ఇక పోతిరెడ్డిపాడుపై ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ఏపీలో అందరూ సైలెంట్ అయ్యారు.

*జగన్ సన్నిహితుడి క్లారిటీ
ఏపీ సీఎం జగన్ సలహాదారు కూడా ఈ వివాదంపై హాట్ కామెంట్స్ చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చర్చిస్తుందని సమస్య పరిష్కరిస్తుందని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తాజా విలేకరుల సమావేశంలో ఇదే అన్నారు.

*ఇద్దరి సీఎంల స్కెచ్చా?
దీన్ని బట్టి ఇద్దరు సీఎంలు తమ ప్రాంత, జల సమస్యలపై పోరాడుతున్నట్టు చాలా కలరింగ్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. జలాలు, ప్రాజెక్టుల విషయంలో ఎవరూ వెనక్కి తగ్గరన్న సంకేతాలను ప్రజల్లోకి పంపించారు. ఈ విషయం తెలియక ప్రతిపక్షాలు సైతం జగన్, కేసీఆర్ ప్రభుత్వాలకు మద్దతిచ్చి బుట్టలో పడిపోయాయి. దీన్ని ఇద్దరు సీఎంలు అనుకునే ఈ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. వీళ్ల వ్యూహాలకు పాపం ప్రతిపక్షాలే బలైపోయాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

-నరేశ్ ఎన్నం