తెలంగాణరాజకీయాలువైరల్

వైరల్ వీడియో: షర్మిల సభకెళ్లి పుస్తెలు అమ్ముకుంటున్నా..

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను షర్మిల సభకు జనాన్ని పోగేసి తీసుకెళ్లాలనని.. అందుకు చాలా ఖర్చు అయ్యిందని ఆ వీడియోలో మహిళ వాపోయింది. ఆ డబ్బు కట్టేందుకు ఇప్పుడు తాను తన పుస్తెల తాడు అమ్ముకుంటున్నానని ఏడుస్తూ వాపోయింది. తన భర్త కూడా ఈ సభకు తీసుకెళ్లాడని ఆ ఖర్చు మా మీద పడి ఇలా పుస్తెలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మహిళ వాపోయింది.

మహిళ తీసుకున్న సెల్ఫీ వీడియోలో తన మెడలోని మంగళసూత్రం తీసేసి ఏడుస్తూ తాను షర్మిల పెట్టబోయే పార్టీ వెంట తిరిగి తప్పు చేశానని.. ఎవరూ రాజకీయ పార్టీలను నమ్మవద్దని.. తిరిగి ఇలా జనాలను తరలించి అప్పుల పాలు కావద్దని విజ్ఞప్తి చేసింది.

తన మెడలో ఉన్న పుస్తెల తాడులోని మంగళసూత్రాలను కత్తిరించి తాడును వేరు చేసి దీన్ని అమ్మేస్తానంటూ ఆ మహిళ ఏడుస్తూ చెప్పుకొచ్చింది. తనలాగా మరెవరూ పార్టీల వెంట తిరగవద్దని వీడియోలో మహిళ కోరింది. లేకపోతే తనలాగే పుస్తెలు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన చెందింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నిజమైనదా? లేదా ఎవరైనా షర్మిలకు వ్యతిరేకంగా సృష్టించారా అన్నది తేలాల్సి ఉంది. షర్మిల అభిమానులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. ఇది ఇతర పార్టీల కుట్ర అంటున్నారు. షర్మిలపై అభిమానాన్ని దెబ్బతీసేందుకు ఇలా వ్యూహం పన్నారని అంటున్నారు.

Back to top button