గెస్ట్ కాలమ్తెలంగాణరాజకీయాలు

కేటీఆర్ కు లక్ష ఇళ్లు ఇప్పుడు గుర్తొచ్చాయా?


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేద ప్రజలకు లక్ష రెండు గదుల ఇళ్లను వేగంగా పూర్తిచేసి ఈ సంవత్సరంలోనే అందించాలని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కె టి రామారావు అధికారులను ఆదేశించారు. వచ్చే ఆగష్టు నాటికి 50,000 గృహాలు, దసరానాటికీ మరో 50,000 గృహాలు సిద్దమవుతాయని అధికారులు చెబుతున్నారు.

అయితే నగరంలోని పేదప్రజలకు లక్ష గృహాలు నిర్మించి ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చి నాలుగున్నరేళ్ల అవుతుంది. ఆయనకు ఆ హామీ ఇప్పుడు గుర్తు వచ్చిన్నట్లున్నది. జనవరి, 2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టి ఆర్ ఎస్ ఎస్ ప్రచార బాధ్యతలను నిర్వహించిన కేటీఆర్ ఒక సంవత్సరంలోగా ఒక లక్ష గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

అయితే ఆ హామీని ఆయన ఆ తర్వాత పట్టించుకోలేదు. మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ఫిబ్రవరి, 2021తో పూర్తవుతుంది. అంటే వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరుపవలసి వస్తుంది. ఆ ఎన్నికలకు సన్నాహాలుగానే గతంలో చేసిన వాగ్ధానాలను కేటీఆర్ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకొంటున్నట్లు కనిపిస్తున్నది.

అప్పట్లో కేటీఆర్ చాలా హామీల వర్షం కురిపించారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా మారుస్తామన్నారు. ట్రాఫిక్ జామ్ లు లేకండా అనేక ఎక్సప్రెస్స్ రహదారుల నిర్మాణంతో పాటు, రాపిడ్ ఫ్లై ఒవెర్ల్స్ నిర్మాణం కూడా చేస్తామనన్నారు. ఎన్నో మ్యాప్ లను ప్రజల ముందుంచారు. అయితే అవేమీ పూర్తి కాకపోవడంతో ఇప్పుడు హడావుడిగా కొన్ని పనులైనా చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఒక వంక లాక్ డౌన్ లో ప్రభుత్వ యంత్రాంగం అంతా కరోనా కట్టడిలో నిమగ్నమై ఉండగా,కేటీఆర్ మంత్రిత్వ శాఖ మాత్రం హైదరాబాద్ నగరంలో రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్ల నిర్మాణం వంటి పనులలో తీరికలేకుండా ఉండిపోయింది. ఎట్లాగైనా మరోసారి జి హెచ్ ఎం సిలో తమ పార్టీని గెలిపించాలని పట్టుదలగా కృషి చేస్తున్నారు.

2016లో కాంగ్రెస్, బిజెపి, టిడిపిల మధ్య ప్రతిపక్ష ఓట్ల చీలికతో టి ఆర్ ఎస్ అనూహ్యంగా 99 సీటు గెలుపొందింది. ఎంఐఎంతో వ్యూహాత్మక అవగాహన సహితం తోడ్పడింది. అయితే ఇప్పుడు ఆ పార్టీలు అంత బలంగా లేవు. టి ఆర్ ఎస్ సహితం అంతర్గతంగా వర్గ పోరును ఎదుర్కొంటున్నది. పలువురు బలమైన నేతలు మౌనంగా ఉంటున్నారు. ఇటువంటి సమయంలో నూతన రాజకీయ సమీకరణలకు తెరలేచె అవకాశం లేకపోలేదు.