తెలంగాణరాజకీయాలుసంపాదకీయం

కేటీఆర్: నాన్నపై ప్రేమ.. బీజేపీపై కోపం

KTR on fire against BJP leaders

ఎందుకో ఈ మధ్య ఎంతో ఓపిక ఉండే మంత్రి కేటీఆర్ బయటపడుతున్నాడు. కోపాన్ని అణుచుకోవడం లేదట.. బీజేపీ పేరు చెబితేనే ఒంటికాలిపై లేస్తున్నాడు. ఆ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరీనూ.. ఏకంగా కేసీఆర్ ను నానా మాటలు అంటున్నాడు. ఈరోజు అయితే సాగర్ వచ్చే కేసీఆర్ ను ఏకవచనంతో అనరాని మాట అన్నాడు.

ఈ విషయం తెలిసిందో ఏమో కానీ తన నాన్న, తెలంగాణ రాష్ట్ర ప్రధాత అయిన కేసీఆర్ ను అంటారా అని బీజేపీపై నిప్పులు చెరిగారు. ‘ఇదే చివరి హెచ్చరిక బిడ్డా’ అంటూ బీజేపీ నేతలను తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

నిజానికి రాజకీయాల్లో విమర్శలు సహజం. కేసీఆర్ అలాంటి విమర్శలు, ఎత్తు పల్లాలు ఎన్నో చవిచూశాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో అయితే కేసీఆర్ పడ్డ తిట్లు అవమానాలకు లెక్కనే లేదు. అందుకే ఆయన అగ్ని పర్వతం మీదపడ్డా కూడా తొణకడు.

కానీ మన యువ మంత్రి కేటీఆర్ మాత్రం తన నాన్న అయిన కేసీఆర్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ సహా ఇతరులు పరుష పదజాలంతో తిట్టడాన్ని అస్సలు జీర్ణించుకోవడం లేదు. అందుకే వరంగల్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై దాడిచేసిన బీజేపీ నేతల ఆఫీసును తగులబెట్టి వారిని జైల్లో పెట్టించారు గులాబీ శ్రేణులు. ఈ ఉదంతం విషయంలో అప్పట్లో తిట్టకు తిట్టు.. దాడికి దాడి అని కేటీఆర్ తొడగొట్టాడు.

ఇక ఈరోజు బండి సంజయ్ సాగర్ ప్రచారంలో కేసీఆర్ ను ఏకవ్యాఖ్యంతో దారుణ విమర్శలు చేశారు. ‘టీఆర్ఎస్ బ్యాచ్ దండుపాళ్యం బ్యాచ్ అని.. టీఆర్ఎస్ దొంగలు వస్తున్నారని.. మద్యం, మాయమాటలతో మోసం చేస్తారని.. ఎన్నికల ప్రచారానికి కోతల రాయుడు కేసీఆర్ వస్తున్నారని’ తీవ్ర పదజాలంతో బండి సంజయ్ దూషించారు.

ఇదే మంత్రి కేటీఆర్ లో కోపానికి కారణమైంది. తాజాగా బీజేపీ నేతలపై కేటీఆర్ రెచ్చిపోవడానికి ఇదేకారణమని గులాబీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

Back to top button