జాతీయంరాజకీయాలుసంపాదకీయం

జమ్మూ-కాశ్మీర్ లో దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం

అబ్దుల్లాలు, ముఫ్తీలు, ఆజాద్ లు దోచేసేసారు

నా చిన్నప్పుడు మావూళ్లో భూభాగోతం నాటకం ప్రజానాట్యమండలి వాళ్ళు అద్భుతంగా ప్రదర్శించారు. అది చూసిన జనాలకి భూస్వాములు, రాజకీయ పెద్దలు, కాంట్రాక్టర్లు కలగలిపి పేద ప్రజల్ని ఎలా దారుణంగా అణిచి వేసారో , వాళ్ళదగ్గర భూమి ఎలా అన్యాయంగా లాక్కున్నారో కళ్ళకు కట్టినట్లు నృత్యరూపకంలో చూపించారు. ఇన్నాళ్ళ తర్వాత అంతకన్నా పెద్ద అన్యాయాన్ని జమ్మూ-కాశ్మీర్ లో వెలికి తీసారు. కాకపోతే ఈ భూమి ఒక ఎకరం, వంద ఎకరాలు కాదు. షుమారు 25 లక్షల కాణాలు(ఒక ఎకరానికి 8 కాణాలు). 2019 ఆగస్ట్ 9వ తేదీన ఆర్టికల్ 370 ని తీసివేసిన తర్వాత మోడీ మాట్లాడుతూ జమ్మూ-కాశ్మీర్ ని రెండు, మూడు కుటుంబాలు దోచుకున్నాయంటే ఏమో అనుకున్నాము. ఈ కుంభకోణం చూసిన తర్వాత ఈ విషయం అప్పటికే తన నోటీస్ లో వుంది కాబట్టే ఆ ప్రకటన ఇచ్చాడని అర్ధమయ్యింది. ఈ దోచుకున్న మొత్తం భూమి ఎంతో తెలుసా? ఊపిరి బిగపట్టుకొని వినండి. మొత్తం రాష్ట్రంలోని భూమిలో 15 శాతం. దీన్ని కప్పిపుచ్చుకోవటానికి మతాన్ని అడ్డుపెట్టుకున్నారు, దీన్ని కప్పి పుచ్చికోవటానికి ప్రత్యేక ప్రతిపత్తిని అడ్డుపెట్టుకున్నారు (ఎటువంటి దర్యాప్తు జరక్కుండా), దీన్ని కప్పిపుచ్చుకోవటానికి మానవహక్కుల ఉల్లంఘన వంకను అడ్డుపెట్టుకున్నారు. కమ్యూనిస్టులు, ఉదారవాదులు ఈ తతంగమంతా చూసి చూడనట్లు మిన్నకున్నారు. ఎందుకంటే అబ్దుల్లాలు, ముఫ్తీలు, ఆజాద్ లు సెక్యులరిస్టులు కదా. అవినీతి జరిగినా పర్వాలేదు,దోచుకున్నా పర్వాలేదు సెక్యులరిస్టులయితే చాలు కదా. గుప్కార్ ప్రకటనలో భాగస్వాములం కదా, వాళ్ళను ఒక్కమాట అనకూడదు. ఇక మనం అసలు స్టోరీ లోకి వెళదామా.

రోష్నీచట్టం 2001 కధ కమామిషు

2001 లో ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జమ్మూ-కాశ్మీర్ భూముల 2001 చట్టాన్ని తీసుకొచ్చాడు. దీన్నే రోష్నీ(విద్యుత్తు) చట్టమని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ చట్టం చేయటానికి ప్రధాన ఉద్దేశం (పైకి చెప్పింది) రాష్ట్రంలో వున్న నదులపై జల విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మిస్తే రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడటమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతిచేసి రాష్ట్రానికి కావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. ఏ రాజకీయనాయకుడైనా దోచుకోవటానికి ముందు మంచి ఆశలే చూపిస్తాడు. ఈ చట్టం ప్రకారం ఇప్పటికే ఆక్రమణలో వున్న 25 లక్షల కాణాల భూమిని మార్కెట్ రేటుకి అమ్మితే షుమారు 25 వేల కోట్ల రూపాయలు వస్తాయని ఆ డబ్బులతో ఈ జల విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మించవచ్చని ముఖ్యమంత్రి నమ్మబలికాడు. ఈ విషయం 2000 సంవత్సరంలోనే అప్పటి ఆర్ధికమంత్రి అబ్దుల్ రెహ్మాన్ రాథేర్ చెప్పాడు(ఈయన సుపుత్రుడే హిలాల్ రాథేర్ ఇటీవల జమ్మూ-కాశ్మీర్ బ్యాంకు 177 కోట్ల రూపాయల కుంభకోణంలో పట్టుబడ్డాడు). దీనికి 1990 ని కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.

తర్వాత 2005లో పిడిపి-కాంగ్రెస్ ప్రభుత్వం ముఫ్తీ మహమ్మద్ సయ్యీద్ ముఖ్యమంత్రిగా ఏర్పడింది. ఆయన హయాంలో ఈ కట్ ఆఫ్ తేదీని 2004 గా మార్చాడు. ఆ తర్వాత ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు(ప్రస్తుత రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు) గులాం నబి ఆజాద్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన నేను మాత్రం తక్కువ తిన్నానా అని కట్ ఆఫ్ తేదీని 2007 కి మార్చాడు. అంతేకాదు ఒక వ్యక్తి గాని కుటుంబం కాని ఎంతవరకు స్వంతదారు హక్కులు పొందవచ్చనే అర్హతని 10 రెట్లు పెంచాడు. అంతేనా ఇందులో వ్యవసాయ భూమి వుందని నిర్ణయించి షుమారు మూడున్నర లక్షల కాణాలు ఉచితంగా పంచేసాడు. అంటే ఈ భూపంపకంలో ఈ మూడు కుటుంబాలు ఒకరికి మించి మరొకరు ఉదారంగా భూమిని పంచేశారు. ఇంతకీ ఈ భూమిపై ఎంత ఆదాయాన్ని వసూలుచేసారో చూస్తే మరొక్కసారి గుండె ఆగిపోవటం ఖాయం. కేవలం 76 కోట్ల రూపాయలు మాత్రమే. 25000 కోట్ల ఆదాయం కాస్తా 76 కోట్లకు పడిపోయింది. ఇది ఎవరో దారిని పొయ్యే దానయ్య చెప్పింది కాదు సాక్షాత్తు సి ఎ జి ఇచ్చిన నివేదిక సుమా.

దీనిపై ప్రజాపోరాటం ఎలా జరిగింది?

ఈ మూడు కుటుంబాలు ఒకటైన తర్వాత ప్రజల తరఫున మాట్లాడేవాళ్ళు ఎవరు? మాట్లాడినా వాళ్ళు మతవాదులు కదా. తరగామి ఏమి చేస్తున్నాడో వామపక్ష మిత్రులు చెప్పాలి. చివరకు ప్రొఫెసర్ భల్ల తరఫున షేక్ షకీల్ అహ్మద్ అనే లాయర్ హైకోర్టులో ప్రజావ్యాజ్యం దాఖలా చేసాడు. దానిపై నివేదిక ఇమ్మని హైకోర్టు ఆదేశిస్తే ఎన్నో సంవత్సరాలు వాయిదాలు వేసుకుంటూ, కోర్టు మొట్టికాయలు తింటూ 2015 లో రాష్ట్ర విజిలెన్సు సంస్థ నివేదిక ఇచ్చింది. ఇందులో 25 మంది ప్రభుత్వ అధికారుల పేర్లు కూడా వున్నాయి. అందులో ముగ్గురు డిప్యూటి కమీషనర్ స్థాయి అధికారులు కూడా వున్నారు. ఇంతకన్నా పెద్ద అధికారుల పేర్లు తొలగించారని కూడా వార్తలు వచ్చాయి. ఇందులో అనేక రాజకీయ నాయకులు, వాళ్ళ బినామీలు వున్నారనేది సమాచారం. నేషనల్ కాన్ఫరెన్స్ కి చెందిన నవాయి సుభా ట్రస్ట్, కాంగ్రెస్ కి చెందిన ఖిద్మత్ ట్రస్ట్ లు పెద్ద మొత్తంలో భూమిని పొందాయని కూడా తెలుస్తుంది. జమ్మూ నగరం చుట్టుపక్కలయితే ఒక కాణా 13 కోట్లు వుంటే ఒక కోటికి అమ్మినట్లు తెలుస్తుంది. ఎంత చూసుకున్నా అంతాకలిపి 76 కోట్ల రూపాయలే వసూలయింది గాని భూమిమాత్రం ధారా దత్తమయింది. చివరకు ఈ భూవివాదం చిలికి చిలికి గాలివాన అయి 2018 లో సత్యపాల్ మాలిక్ గవర్నర్ గా వున్నప్పుడు ఈ చట్టాన్ని రద్దుచేసాడు. కానీ భూమి తిరిగి రాలేదు. జమ్మూ-కాశ్మీర్ లా కమీషన్ దీనిపై 2020 మార్చ్ లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక లో ఇచ్చిన అవకతవకలు చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగాల్సిందే. అసలు లబ్దిదారులు మోసం, ప్రభుత్వమే మార్కెట్ రేటుని తగ్గించిన దాఖలాలు, రోడ్డు పక్కన భూములు అమ్మకూడదు లీజుకి మాత్రమే ఇవ్వాలి కాని అలా జరగలేదు, వ్యవసాయ భూముల పేరుతో వ్యవసాయేతర భూములు విక్రయించారు, అటవీ భూములు లక్షల ఎకరాలు ఆక్రమించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వ్యాసం చాలదు. ఒక్కమాటలో చెప్పాలంటే కంచే చేను మేసిందనే సామెతను ఆ నివేదిక కోట్ చేసింది. దోపిడీకి, కుంభకోణానికి ఇంతకన్నా దేశంలో ఎక్కడా పోలిక వుండదేమోనని వ్యాఖ్యానించింది.

సిబీఐ దర్యాప్తుకు ఆదేశం 

ఈ మధ్యలో ఇంకో ప్రజా వ్యాజ్యం వేసారు. అసలు నిజమైన కబ్జాదారులు చాలామంది వున్నారని రాష్ట్ర విజిలెన్సు సంస్థ పూర్తి వివరాలు చెప్పలేదని దీనిపై సిబీఐ దర్యాప్తు జరపాలని కోరింది. దానితో పాటు ఇంకో సామాజిక అంశం తెరమీదకు వచ్చింది. ఈ ప్రజావ్యాజ్యం లో ఈ చట్టం జల విద్యుత్తు ప్రాజెక్టుల ఆదాయం కోసమని బహిరంగంగా చెప్పినా లోలోపల వేరే దురుద్దేశం వుందని కూడా వెల్లడించింది. జమ్మూ ప్రాంతం లో డెమోగ్రఫి మార్చాలనేది ఈ మూడు కుటుంబాల కుట్రలో భాగమని కూడా పేర్కొంది. జమ్మూ ప్రాంతంలో మెజారిటీలో వున్న హిందువులను మైనారిటీలుగా మార్చటానికి ఈ చట్టం తీసుకొచ్చారని పేర్కొంది. ఇప్పటివరకూ 25 వేలమంది లబ్దిదారులను గుర్తించి వారికి భూమి కేటాయిస్తే అందులో 90 శాతం ముస్లింలకే కేటాయించారని క్రమంగా జమ్మూ ప్రాంతం లో డెమోగ్రఫి మార్చాలనేది ఈ కుట్రలో భాగమని కూడా పేర్కొంది. అందుకే ఈ కేటాయింపులు పారదర్శకంగా, ఓ పద్దతి ప్రకారం కాకుండా జరిగాయని ఈ కుటుంబాలు వారి తైనాతీలు పెద్ద ఎత్తున లబ్ది పొందటానికి పేద ముస్లింలకు కూడా కేటాయించి మతపరమైన కోణాన్ని జోడించి తన ఆస్తులను కాపాడుకోవటానికి వేసిన ఎత్తుగడగా వర్ణించారు (ఇందుకు మన ఉదారవాదులు ఒప్పుకోరేమో డెమోగ్రఫి మారిస్తే తప్పేమిటని వాదిస్తారేమో ఎంతయినా ఈ కుటుంబాలు సెక్యులర్ వాదులు కదా).  కాబట్టి ఇవన్నీ బయటకు రావాలంటే సిబీఐ దర్యాప్తు ఒక్కటే మార్గమని కోరింది. దీనిపై ఈ నెల 10 వ తేదీన జమ్మూ హైకోర్ట్ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అసలు ఈ చట్టం చెల్లదని తీర్పిచ్చింది. సిబీఐ దర్యాప్తు జరపాలని ఆదేశించింది. అంతేకాదు రాష్ట్ర యంత్రాంగం సిబీఐ కి అన్ని రికార్డులు ఇవ్వటమే కాకుండా పూర్తిగా సహకరించాలని కూడా కోరింది. అసలు గులాం నబి ఆజాద్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రూపొందించిన 2007 నిబంధనలు శాసన సభ ఆమోదంతో చేసారా లేదా అనేది కూడా దర్యాప్తు చేయమని ఆదేశించింది. జమ్మూలో ఈ తీర్పు పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

ఇది అబ్దుల్లాలు, ముఫ్తీలు, ఆజాద్ లు కైకర్యంలో భాగం కాదా?

సమస్యను పక్కదోవ పట్టించటానికి వాళ్ళ అస్తిత్వానికి ప్రమాదమోచ్చిందని ఇప్పుడు అందరూ ఒకటయ్యారు. గుప్కార్ ప్రకటన పేరుతో ప్రజల్ని మరొకసారి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు కాశ్మీర్ రాజకీయ చరిత్రనే మొదట్నుంచీ వక్రమార్గంలో పయనించింది. వాటిని గురించి ప్రత్యేక వ్యాసంలో చర్చించుకుందాం. ఒక్కమాట మాత్రం చెప్పదలుచుకున్నాను, ఈ కుటుంబాలు బ్లాక్ మెయిల్ చేసి పబ్బం గడుపుకునే రోజులు దగ్గర పడ్డాయి. సామాన్య ముస్లింలలో ఇప్పుడిప్పుడే ఆలోచన మొదలయ్యింది. కేంద్ర ప్రభుత్వం కనుక వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఉద్యోగావకాశాలు కల్పించ గలిగితే , అభివృద్ధిని చూపించ గలిగితే తిరిగి కాశ్మీరం గాడిన పడే అవకాశం వుంది. అసలు ఈ కేంద్ర పాలన రాకపోతే ఈ కుంభకోణం బయటకు వచ్చేది కాదు. ఎందుకంటే ఆర్టికల్ 370 ని అడ్డంపెట్టుకొని అవినీతి నిరోధక చట్టాల్ని రాష్ట్రంలోకి రాకుండా చేసారు. ఇప్పుడు వీళ్ళ అవినీతి ఒక్కకొక్కటే బయటకు వస్తుంది. ప్రజలు కూడా వీళ్ళకు భయపడకుండా బయటకు వస్తున్నారు. కాకపోతే వ్యక్తిగతంగా ఎన్నికైన సర్పంచ్ లను, పంచ్ లను చంపుతూ భయానక వాతావరణం సృష్టించాలని ప్రయత్నం జరుగుతుంది. వీటినుంచి ఎలా బయటపడాలో కేంద్రం లోతుగా ఆలోచించాలి. సమస్య జటిలమైంది, పరిష్కారం వెనువెంటనే రాకపోవచ్చు. కానీ ఆ మార్గంలో పయనించటం తప్ప వేరే మార్గం లేదు. ముఖ్యంగా ఈ అవకాశవాద రాజకీయ కుటుంబాల్ని దరిచేర నీయకుండా ప్రత్యక్షంగా ప్రజలతోనే సంబంధాలు నెరపటానికి ప్రయత్నం చేయటం ఒక్కటే మార్గం.

Back to top button