ఆంధ్రప్రదేశ్కరోనా వైరస్రాజకీయాలు

ఆ వైసీపీ ఎమ్మెల్యే ‘కరోనా సూపర్ స్ప్రెడర్ ‘ అంటున్న చినబాబు?

ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. జగన్ సర్కార్ ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యం కావడం లేదు. ప్రతిరోజూ 10 వేలకు అటూఇటుగా నమోదవుతున్న కేసులు ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అయితే వైరస్ ఈ స్థాయిలో వ్యాప్తి చెందుతున్నా ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. వైరస్ వ్యాప్తికి పరోక్షంగా ప్రజాప్రతినిధులే కారణం అవుతున్నారు. రాష్ట్రంలోని వైసీపీ నేతలపై ఈ తరహా విమర్శలు ఎక్కువగా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

గతంలో పలువురు వైసీపీ నేతలు కరోనా నిబంధనలు ఉల్లంఘించారని కోర్టుల్లో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. అయినా కానీ వైసీపీ నేతల తీరులో మార్పు రావడం లేదని ఎమ్మెల్యే హోదాలో ఉండి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తాజాగా తన ట్విట్టర్ ద్వారా రాష్ట్రంలో వైసీపీ నేతలు కరోనా వైరస్ సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారని అన్నారు.

తాజాగా శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చిన్నపిల్లలతో కలిసి డాన్సులు వేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. మధుసూదన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినా ఆయన తీరు మారలేదని లోకేశ్ పేర్కొన్నారు. అయితే వైసీపీ నేతలు లోకేశ్ విమర్శలపై ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అయితే వైసీపీ ఎన్ని కౌంటర్లు ఇచ్చినా వైసీపీ నేతలు చేస్తున్న తప్పులు ప్రజల్లో కొంత వ్యతిరేకత పెంచే అవకాశాలు ఐతే ఉన్నాయి. నేతలే మాస్క్ లు పెట్టుకోకుండా ప్రజలకు ఏం సందేశం ఇస్తారని నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తవుతూ ఉండటం గమనార్హం.

Back to top button