టాలీవుడ్సినిమాసినిమా రివ్యూస్

మధ రివ్యూ: థ్రిల్లర్ చిత్రాల్లో కొత్త అడుగు

నటీనటులు : త్రిష్నా ముఖర్జీ, రాహుల్
దర్శకత్వం : శ్రీవిద్య బ‌స‌వ
నిర్మాత‌లు : ఇందిరా బ‌స‌వ‌
సంగీతం : న‌రేశ్ కుమ‌ర‌న్‌

కొత్తగా చిత్రాలు నిర్మించే వారు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే వాళ్లకి దగ్గర దారి థ్రిల్లర్ జానర్. ఇలాంటి చిత్రాలయితే ఖర్చు తక్కువ ప్రేక్షకుల రీచ్ ఎక్కువ. ఒకవేళ చిత్రం అటూ ఇటూ అయినా నిర్మాతలకు పెద్ద ఎఫెక్ట్ పడదు. అలాంటి ఫార్ములాని నమ్ముకొని నూతన దర్శకురాలు శ్రీ విద్య బసవ నిర్మించిన చిత్రం “మధ”. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని చూడక ముందే విశ్వ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలు ఈ సినిమాని ఫెస్టివల్స్ లో చూసి 26 అవార్డులు ఇచ్చాయి.

కథ :
అనాధ అయిన నిషా (త్రిష్ణా ముఖర్జీ ) ఒక యాడ్ ఏజెన్సీ లో ప్రూఫ్ రీడర్ గా పని చేస్తుంటుంది.పబ్ లు ఫ్రెండ్స్ అంటూ హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తుంటుంది. ఆ సమయంలో అర్జున్ అనే ఒక వీడియో జర్నలిస్ట్ పరిచయమౌతాడు.వారిద్దరి పరిచయం ప్రేమకు దారి తీస్తుంది. అంతలో ఊహించని రీతిలో నిషా విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటుంది. దాంతో అందరూ ఆమెను పిచ్చిదానిగా ముద్ర వేసి మెంటల్ అసైలం కు పంపుతారు. అక్కడ రకరకాల చిత్రహింసలు చవి చూసిన నిషా చివరకు ఎలా బయటికి వచ్చింది అన్నదే చిత్ర కథ.

దర్శకత్వం:
గత అనుభవం లేక పోయినా తాను వ్రాసుకొన్న కథని తెర కెక్కించడం లో దర్శకురాలు శ్రీవిద్య బసవ చూపిన ప్రతిభ మెచ్చుకో తగిన రీతిలో ఉంది. చిన్న , చిన్న పొరబాట్లు ఉన్నప్పటికీ మొత్తం మీద సినిమాని ఆసక్తిగానే మలిచింది. సినిమా కధకు తగ్గ వాతావరణం ఎంచుకోవడంలో దర్శకురాలు తీసుకొన్న శ్రద్ద శ్లాఘనీయం. సాధారణ థ్రిల్లర్ కధకి సైన్స్ జోడించడమే చిత్రం లో ఉన్న కొత్త పాయింట్. ఆ పనిని శ్రీవిద్య బసవ బాగా నిర్వర్తించింది. కానీ హీరో పాత్రని మౌల్డ్ చేయడంలో కొంచెం పాత రూటులోనే వెళ్ళింది.గతంలో కృష్ణ నటించిన గూడుపుఠాణి, చిరంజీవి నటించిన రాజా విక్రమార్క ఫార్ములానే ఈ చిత్రం లో కూడా ఫాలో అవ్వడం జరిగింది. అదొక్కటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక మిగతా సినిమాలో టెంపో బాగానే మెయింటైన్ చేసింది. దర్శకురాలిగా మంచి మార్కులు కొట్టేసింది.

నటీ నటులు :
మధ చిత్రం లోని నటీనటుల గురించి చెప్పుకోవాలంటే ముందుగా హీరోయినే త్రిష్ణా ముఖర్జీ గురించి చెప్పుకోవాలి. ఈమె తన అసాధారణ ప్రతిభ తో సినిమా మొత్తం రక్తి కట్టించింది. హిందీ లో క్రైమ్ పెట్రోల్ వంటి సీరియల్స్ , జాంగో వంటి థ్రిల్లర్ మూవీస్ చేసిన అనుభవం త్రిష్ణ ముఖేర్జీ కి బాగానే పనికొచ్చింది. సినిమా మూడ్ కి తగట్టు నటించి మెప్పించింది. ఇక హీరో పాత్రలో నటించిన వెంకట్ రాహుల్ ఉన్నంతలో బాగానే చేసాడు.మెగా స్టార్ చిరంజీవి సొంత మేనమామ (అంజనీ దేవి గారి తమ్ముడు ) కొడుకు అయిన వెంకట్ రాహుల్ కి ఇంతకు ముందు అలియాస్ జానకి (2013 ) , బిల్లా రంగ ( 2014 ) వంటి చిత్రాల్లో నటించిన అనుభవం వుంది. వాటితో పోల్చుకుంటే ఈ సినిమా లో బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇక శేఖర్ కమ్ముల స్కూల్ నుంచి వచ్చిన అనీష్ కురువిల్ల విలన్గా బాగా రాణించాడు.

సాంకేతిక నిపుణులు :
మధ సినిమా చూస్తునంత సేపు ప్రేక్షకులు ఒకే మూడ్ లో ఉండటానికి ప్రధాన కారణం సినిమాకి డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ చేసిన అభిరాజ్ నాయర్ అని చెప్పక తప్పదు. ముఖ్యంగా మెంటల్ అసైలం సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా అంతర్జాతీయం గా పలు ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు గెలుచు కొన్నదంటే అందుకు కెమెరా మాన్ నాయర్ ప్రతిభ కూడా ఒక కారణం అని చెప్పక తప్పదు. ఇక సినిమాకి సంగీత అందించిన నరేష్ కుమరన్ కూడా తన శాఖ కి న్యాయం చేకూర్చాడు. ఇక ఎడిటర్ రంజిత్ టచ్ రివర్ కూడా సినిమాని బాగా ఎడిట్ చేసాడు.

విశ్లేషణ :
ఒక డ్రగ్ మాఫియా కధకి సైన్స్, సస్పెన్సు జోడించి దర్శకురాలు సినిమా తీయడం ఒక ఎత్తు. అయితే దాన్ని తెరపై నటీనటులు, సాంకేతిక నిపుణులు రక్తి కట్టించడం మరో ఎత్తు. అవి రెండూ రైలు పట్టాల్లా సమాంతరంగా వెళ్లడం తో సినిమా కి నిండుతనం వచ్చింది. ఆసక్తిని రేపి మనం సినిమా చూసేలా చేసింది. మొత్తం మీద శ్రీ విద్య బసవ తన తొలి ప్రయత్నం లో విజేత అయ్యింది. .
Well begin is half done