జాతీయంరాజకీయాలువారాంతపు ముచ్చట్లు

ఆదివారం అందరం ఒక్కటవుదాం

ఈవారం ఇంకా భయానకంగా తయారయ్యింది. ప్రపంచం మొత్తంమీదకరోనా వైరస్ బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 11 వేలు దాటింది. వచ్చేవారం, ఆ పైవారం వార్తలు ఇంకా వినటానికి కష్టంగా ఉండొచ్చు. భారత్ ప్రస్తుతం చాలా క్లిష్టదశలో వుంది. వచ్చే నెలరోజులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వుంది. అందుకని ఈ వారం ముచ్చట్లు సరదాగా కాకుండా సీరియస్ గానే చెప్పుకుందాం. ఈ మహమ్మారి అంతమయ్యేవరకు వేరే విషయాలు మన వారాంతపు ముచ్చట్లలో మాట్లాడుకోవద్దు. దీన్ని ఎలా తరిమి కొట్టాలా అనేదే మన ముచ్చట్లలో ఉండాలి. ఇక మొదలుపెడదామా.

అశాస్త్రీయ ఆలోచనలు, ప్రచారాలు

ఒకవైపు ఈ మహమ్మారి ని ఎలా మట్టుబెట్టాలా అని తలలు బద్దలు కొట్టుకుంటుంటే సాంఘిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అసలు మనకేమీకాదని , భారత దేశపు ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు, వాతావరణ పరిస్థితులు మనన్ని కాపాడతాయనే ప్రచారం జరుగుతుంది. ఈ వాదనను స్వయంగా ప్రధానే ఖండించారు . ప్రపంచంలో మనమూ భాగమేనని మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ మహమ్మారి మనన్ని కాటేయటం ఖాయమని చెప్పకనే చెప్పాడు. ప్రధానమంత్రే దీని తీవ్రతను తక్కువ చేయొద్దని హెచ్చరించిన తర్వాత ఎవరూ లైటుగా తీసుకోరని భావిద్దాం. ఎందుకుచెప్పాల్సివచ్చిందంటే కొన్ని ప్రభుత్వాలు స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తే ఇదే అదను అనుకొని పిల్లలని బయటకు తీసుకురావటాన్ని ఏమనాలో తెలియటంలేదు. ఇంత క్యాజుయల్ గా మీరు ఉండటం తో మీతోపాటు మీ చుట్టుపక్కలవాళ్ళను కూడా ప్రమాదానికి గురిచేస్తున్నారని మరిచిపోవద్దు.

ఇదే అదనుగా కొంతమంది రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. గోమూత్రం తాగితే కరోనా వైరస్ దగ్గరకు రాదనీ, వెల్లుల్లి రసం తాగితే సరిపోతుందని, ఇంకొంతమంది మంచినీళ్లు అయిదు నిమషాలకొక సారి తాగమని, మరికొంతమంది గోరువెచ్చటి ఉప్పు నీళ్లు తాగమని , చివరకు టీవీ మాధ్యమాల్లో కూడా ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఎక్కువమంది, అందులో డాక్టర్లు కూడా వున్నారు సుమా , ఎండలురాగానే తగ్గుతుందని చెబుతున్నారు. దానికి శాస్త్రీయ ఆధారం ఎక్కడా లేదు. ప్రధానమంత్రి కూడా అదే చెప్పాల్సివచ్చింది. ఇంతకుముందు వచ్చిన సార్స్ ని దృష్టి లో పెట్టుకొని ఎండాకాలం లో ఇది తగ్గిపోతుందని చెబుతూ వస్తున్నారు. ఇదికూడా ఊహాజనితమే. ఇది కొత్త వైరస్ . దీని లక్షణాలు ఇదమిద్ధంగా ఎవరూ నిర్ధారణకు రాలేనప్పుడు ఊహాజనిత అభిప్రాయాలకు అర్ధంలేదు. మరికొంతమంది అసలు దీన్ని గురించి గోరింతలు కొండంతలు చేస్తున్నారని ఇది కూడా ఫ్లూ లాంటిదేనని ఇది పెట్టుబడిదారులు వ్యాపారాభివృద్ధి కోసం చేస్తున్నారని కూడా సాంఘిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. సాంఘిక మాధ్యమం ఎంత మంచి చేస్తుందో అంత చెడు చేస్తుందని కూడా దీన్ని చూస్తే అర్ధమవుతుంది. ఫ్లూ వలన మరణాల సంఖ్య వెయ్యికి ఒక్కరుంటే దీనివలన ఎంత అనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాము. చైనా లో 80 వేలకి 3 వేలమంది చనిపోతే ఇటలీలో 40 వేలమందికి 4 వేలు చనిపోయారు. ఈ మహమ్మారిని దయచేసి ఎవరూ తక్కువచేసి చూడొద్దు. దీని విశ్వరూపం, వికృతరూపం ఇంకా పూర్తిగా మనకు అవగాహన కాలేదు. ప్రస్తుతానికి ప్రభుత్వం చెప్పింది తూచా తప్పకుండా పాటించటం మన విధి. అదే మనం సమాజానికి చేయదగ్గ సహాయం.

ప్రభుత్వానికి సహకరించకపోవటం క్షంతవ్యం కాదు

కొంతమంది అతి తెలివితేటలు ప్రదర్శించటం చూస్తున్నాము. విదేశీ ప్రయాణాలనుంచి వచ్చినవాళ్లు విమానం దిగటానికి ఒక గంట ముందు పారాసెటమాల్ గోలీ వేసుకొని థర్మల్ స్క్రీనింగ్ నుంచి తప్పించుకుంటున్నారని ప్రత్యక్ష సాక్షులే చెబుతున్నారు. అలాచేసినవాళ్ళని ఏమనాలి? ఖచ్చితంగా సంఘవిద్రోహక శక్తులేనని చెప్పాలి. హత్య చేస్తేనో , దొంగతనం చేస్తేనో , రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తేనో కాదు ఇటువంటివాళ్లను కూడా వాళ్ళ జతన చేర్చాలి. ఎందుకంటే రేపొద్దున వీళ్ళు కోవిద్ పాజిటివ్ అని తేలితే అప్పటికే ఎంతమందికి ఈ వ్యాధి సోకివుంటుందో తెలియదుకదా. అలాగే కొంతమంది హాస్పిటల్ నుండి పారిపోయి ఎక్కడెక్కడో తిరగటం , రైళ్లలో సుదీర్ఘ ప్రయాణాలు చేయటం ఖచ్చితంగా అతి నేరంగా పరిగణించాలి. వాళ్ళను పట్టుకోవటమే కాదు పరీక్షాకాలం అయినతర్వాత నయమైనా వీళ్ళను శిక్షించాలి. ఇది ఎంత నేరమో టీవీ మాధ్యమాల్లో ప్రచారం చేయాలి. ఇక మత ప్రచారకులు కూడా తక్కువేమీ తినలేదు. 14 రోజుల నిర్బంధ సమయాన్ని పాటించకుండా రైళ్లలో ప్రయాణం చేయటం దారుణం. ఇలా సహకరించని వాళ్ళ విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందనే భావం కలిగించాలి. కనీసం అప్పుడైనా ముందు ముందు అలా జరగకుండా ఉంటాయి.

ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి

అయినవాడి కో నిబంధన కాని వాడికి ఇంకో నిబంధన ఉండరాదు. ఈ విషయం లో తెలంగాణ ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్నాయి. సిర్పూర్ ఎమ్యెల్యే కోనేరు కోనప్ప విదేశాలనుంచి వచ్చి ప్రభుత్వ క్వారంటైన్ లో ఉండకుండా ఎకాఎకిన ఊరెళ్ళటమే కాకుండా సమావేశాల్లో పాల్గొనటం క్షంతవ్యం కాదు. స్వీయ నిర్బంధంలో నన్నా ఉండివుంటే బాగుండేది. రూల్స్ సామాన్యులకేనా విఐపి లకు కాదా. వాస్తవానికి వాళ్లకు ఇంకా కఠినంగా ఉండాలి. ఇంకో వుదంతం . వరంగల్ కి చెందిన ఒకతను ఫ్రాన్స్ నుంచి మార్చి 12 వ తేదీన హైదరాబాద్ లో దిగి ప్రభుత్వ క్వారంటైన్ లో ఉండకుండా 150 కిలోమీటర్లు హన్మకొండ వెళ్లి మార్చి 19 వ తేదీన పెళ్లి కూడా చేసుకున్నాడు. షుమారు 1000 మంది అతిధులు హాజరయ్యారట. అందులో తెరాస ప్రముఖురాలు కూడా ఉందట. ఇంతకీ అతను ప్రముఖ రాజకీయనాయకుడికి దగ్గర బంధువట. కెసిఆర్ గారూ , వీటి విషయం లో మీరు తక్షణమే చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ బాధ్యతారాహిత్యమవుతుంది.

ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఏకంగా లండన్ నుంచి వచ్చి లక్నో లో మూడు కార్యక్రమాల్లో పాల్గొంది. ఆ కార్యక్రమాల్లో ప్రముఖ రాజకీయ నాయకులు వసుంధర రాజే , ఆమె తనయుడు దుశ్యంత్ సింగ్ పాల్గొన్నారు. ఆ తర్వాత దుశ్యంత్ సింగ్ పార్లమెంటు సమావేశాల్లో , రాష్ట్రపతి విందులో పాల్గొనటం పెద్ద దుమారం లేపింది. ఆవిడపై యోగి ఆదిత్యనాథ్ కేసు పెడుతున్నట్లు ఇంతకుముందే వార్తల్లో వచ్చింది. మరి అదేపని మన ముఖ్యమంత్రి కూడా చేస్తే ప్రజలకు సందేశమిచ్చినవారు అవుతారు. అప్పుడే నైతికంగా ప్రజలకు నిబంధనలు పాటించమని చెప్పే హక్కు ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందని ఆశిద్దాం.

చైనా ద్వేషం మంచిది కాదు

ఈ వైరస్ వచ్చిన దగ్గర్నుంచి చైనా పై , చైనీయులపై విశ్వవ్యాప్తంగా వ్యతిరేకప్రచారం జరుగుతుంది. ఇది సరైనది కాదు. మన దేశ విదేశాంగ విధానాల్లో చైనా అనుసరిస్తున్న విధానాలను మనమందరం వ్యతిరేకిస్తున్నాము. అది మన దేశ రక్షణ, విదేశాంగ విధానానికి సంబంధించింది. కానీ ఈ వైరస్ అక్కడ్నుంచి వచ్చింది కాబట్టి చైనీయులను ద్వేషించటం ఎంతవరకు సబబు? వారి ఆహారపు అలవాట్లకు సంబంధించి ఈ మహమ్మారి ఆగిపోయిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి సారిస్తుందని అనుకుందాము. కానీ ఆ దేశాన్ని ఈపరంగా ద్వేషించటం దీనికి స్వయంగా అమెరికా అధ్యక్షుడే నాయకత్వం వహించటం శోచనీయం. చివరకు ఎక్కడిదాకా వెళ్లిందంటే చైనా అమలుచేస్తున్న ‘ఒక బెల్టు, ఒక రోడ్డు ‘ పధకం , అందులో భాగమైన చైనా-పాకిస్తాన్ ఆర్ధిక నడవా వీటివల్లే ఈ వైరస్ ఈ దేశాల్లో వస్తుందనే వాదన దారుణం. ద్వేషానికి కూడా హేతుబద్ధ కారణం ఉండాలి. చైనా- పాకిస్తాన్ ఆర్ధిక నడవా ను తీవ్రంగా వ్యతిరేకించే వాళ్లలో నేనూ ముందున్నాను. కానీ దాన్ని రాజకీయంగానే ఎదుర్కొవాలిగానీ ఇలా చౌకబారు ప్రచారం మంచిదికాదు. వైరస్ ని అడ్డంపెట్టుకొని చైనాపై రాజకీయ కక్షసాధింపు అదీ జాతిపరమైన వ్యతిరేకప్రచారం మంచిదికాదు. ఈ రోజు చైనాకు జరిగేదే రేపు భారత్ కు జరగదని చెప్పలేము. ఈ వైరస్ ని ప్రపంచానికి చెప్పకుండా చైనా దాచిపెట్టిందని విమర్శించటం నూటికి నూరు పాళ్ళు కరెక్టు . చైనా కనక ముందుగా బయటపెట్టివుంటే ప్రపంచం ఇంకొంచెం ముందు మేల్కొని ఉండేది. ఇందుకు చైనా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలి. చైనా వైఖరి గర్హనీయం.

ఆరోగ్య నిపుణుల హెచ్చరికలను కాదనలేము

ఈరోజుకి కేవలం 300 కేసులు ఉండటం భారత్ సాధించిన విజయంగా భావిస్తూనే ఆరోగ్య నిపుణుల హెచ్చరికలను కూడా పరిగణన లోనికి తీసుకోవాల్సివుంది. భారత్ లో పరీక్షల నిర్వహణపై అనేక సందేహాలు వున్నాయి. ఎన్ని ఎక్కువ పరీక్షలు చేయగలిగితే అంతగా కోవిద్ ని అరికట్టగలమనేది నిపుణుల అభిప్రాయం. ఈ విషయంలో దక్షిణ కొరియా ప్రపంచానికే ఆదర్శంగా నిల్చింది. అందుకే వైరస్ సోకినా వాళ్లలో మరణాల రేటు అన్నిదేశాలకన్నా తక్కువగా వుంది. మనదేశంలో ఇంతవరకు జరిపిన పరీక్షలు చాలా తక్కువగా వున్నాయి. కేవలం 14 వేలేనని తెలుస్తుంది. ఇది ఆందోళనకర విషయం. అందుకనే చాలామంది నిపుణులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు అమెరికా కూడా మొదట్లో ఇలానే ఉండేది. ఈ వైరస్ లక్షణాలు మొదట వారం రోజులు బయటపడకుండా వుండే అవకాశాలు ఎక్కువగా వున్నాయి కాబట్టి పరీక్షల పరిధిని తక్షణం విస్తృత పరచాలి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలుస్తుంది. అంటే కమ్యూనిటీ టెస్టింగ్ కి సిద్ధమవ్వాలి. ఇప్పుడున్న ఐసీయూ బెడ్ల శాతాన్ని పెంచాలి. మూడవ దశ కు ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అలా అయితేనే ఈ మహమ్మారిని ఎదుర్కోలేము. ఇప్పటివరకు ప్రభుత్వం వేగంగానే కదులుతుందని చెప్పాలి. ఇతరదేశాల వారి ప్రవేశాల్ని నియంత్రించటం, చివరకు నిషేదించటం లాంటి ముందస్తు చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం ప్రో యాక్టీవ్ గా ఉందని చెప్పాలి. దానితో బాటు అంతరంగికంగా పరిస్థితుల్ని చక్కదిద్దటం లో కొంతమంది నిపుణుల ఆందోళనలను పరిగణలోనికి ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిద్దాం.

మరికొన్ని

ఈ సమయం లో ఈ విషయం లో రాజకీయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. కేరళ లో ప్రభుత్వం చేసినట్లు మోడీ చేయటం లేదనే వాదన కొంతమంది వామపక్ష మేధావులు ప్రచారం చేయటం తగదు. దీనికి ఎక్కడా పరిమితులు వుండవు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం బాగాచేస్తుందని ఒకరు, ఉత్తర ప్రదేశ్ లో యోగి బాగా చేస్తున్నాడని ఇంకొకరు మొదలుపెడతారు. ఇప్పుడివి అవసరమా? కేరళ, ఢిల్లీ, యూపీ ప్రభుత్వాల చర్యలని హర్శిద్దాం. పాజిటివ్ గా ప్రచారం చెయ్యండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ బాటలోనే ఉందని అర్ధమవుతుంది. మోడీ జాతినుద్దేశించి ప్రసింగించిన దాంట్లో ఆర్ధికమంత్రి అధ్యక్షతన కోవిద్ -19 మహమ్మారి ని ఎదుర్కోవటానికి కావాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పటం జరిగింది. అతి త్వరలోనే దీనిపై నిర్దిష్ట నిర్ణయాలు తీసుకుంటామని నిర్మల సీతారామన్ ప్రకటన చేయటం చూసాం. దయచేసి కొద్దిరోజులు అందరూ పాజిటివ్ ప్రచారానికే కట్టుబడదామని ప్రతిజ్ఞ చేద్దాం. అదేసమయం లో మిగతా అంశాల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. కోవిద్-19 వరకు అందరం ఒకటవుదాం. నిర్దిష్ట ప్రతిపాదనలేమన్నా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకి ఇద్దాం.

చివరగా హర్షించాల్సింది పోయినవారం మన వారాంతపు ముచ్చట్లలో టీటీడీ వారి గంటకు 4 వేలమంది సందర్శుకుల నియంత్రణ వద్దని చెప్పాం. పూర్తిగా ఆపట మొక్కటే పరిష్కారమని సూచించాం. ఈ వారానికి మన మొర ఆలకించినట్లున్నారు. అన్ని ఆలయాలు భక్తులను అనుమతించక పోవటం మంచి నిర్ణయం. దానితో పాటు యోగి ఆదిత్యనాథ్ అయోధ్య రామ నవమి ఉత్సవాలను రద్దుచేయటంకూడా ఊపిరి పీల్చుకున్నట్లయింది. ముందుగా అవి జరుగుతాయని ప్రకటించటంతో అన్ని లక్షల మంది గుమిగూడితే మహమ్మారిని ఆపటం కష్టమని నిపుణులు ఆందోళన చెందారు. అలాగే షహీన్ బాగ్ నిరశన కారులు కూడా మానుకోవాలి. మానవాళి మనుగడ ముఖ్యం. జనం ఇంతమంది చెబుతున్నా ఆపకపోవటం మంచిదికాదు. దీన్ని వెనకుండి నడిపిస్తున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి. జనం సహనానికి పరీక్ష కాకూడదు.

జనతా కర్ఫ్యూ ని వందశాతం అమలుచేద్దాం

ప్రధానమంత్రి మోడీ ఇచ్చినపిలుపుమేరకు అందరం జనతా కర్ఫ్యూ ని స్వచ్చందంగా పాటిద్దాం. ఎవ్వరూ ఇళ్లనుంచి బయటకు రావద్దు. ఇది రెండు విధాలా మంచిది. ఒకటి స్వీయ క్రమశిక్షణ వస్తుంది. రెండు, సామాజిక దూరాన్ని పాటించటం తో ఈ మహమ్మారి వ్యాప్తిని కొంతమేర అరికట్టవచ్చు. ఇటువంటి జాతీయ విపత్తుల్లో భారత జాతిమొత్తం ఒక్కటని చాటుదాం. ఆదివారం ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9 గంటలవరకు గృహనిర్బందాన్ని పాటిద్దాం. దయచేసి దీన్ని ఇంకో సోషల్ గాదరింగ్ గా మార్చుకోవద్దు. ఈ ఒక్కరోజు పూర్తిగా ఎవరింట్లో వాళ్ళు వుండండి. బయటకు రాకండి.

ఆదివారం సాయంత్రం 5 గంటలకు కృతజ్ఞతలు చెప్పటం మరవకండి

మనకోసం, మన క్షేమం కోసం డాక్టర్లు, నర్సులు , మిగతా పారా మెడికల్ సిబ్బంది అహర్నిశం కష్టపడుతున్నారు. ముందుగా వారికి చేతులెత్తి నమస్కారాలు. అలాగే ఎంతోమంది ఈ క్లిష్ట సమయం లో కూడా వారి వారి డ్యూటీలు నెరవేరుస్తున్నారు. రోజు వచ్చే పాలవాడు, పేపర్ బాయ్ , ఆన్ లైన్ లో అర్దర్లు ఇస్తే ఇంటికి తెచ్చే స్విగ్గి , జొమాటో లాంటి ఫుడ్ వర్కర్లు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్ లైన్ వ్యాపార సిబ్బంది, బిగ్ బాస్కెట్, గ్రోఫెర్ లాంటి ఇంటిసరుకుల సిబ్బంది, పోస్టుమాన్, కొరియర్ బాయ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా మంది ఈ విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా మీడియా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా విధినిర్వహణ చేయటం, సమాజానికి సమాచారాన్ని అందించటం మనందరికీ ఉత్తేజాన్నిస్తుంది. ప్రభుత్వ సిబ్బంది కూడా సమయంతో సంబంధం లేకుండా రేయింబవళ్లు కష్టపడటం చూస్తున్నాము. అలాగే బ్యాంకు సిబ్బంది ఆర్ధిక కార్యకలాపాలు ఆగకుండా సమాజసేవ చేస్తున్నారు. వాళ్లలో ప్రధాని మోడీ ఉటంకించిన వారిలో తమ పేరులేదని ఆవేదనతో సామాజిక మాధ్యమాల్లో ఎన్నో పోస్టులు పెట్టారు. వాళ్ళ ఆవేదన సహేతుకమే. నోట్ల రద్దు సమయంలో కూడా రేయింబవళ్లు కష్టపడి సామాజిక కర్తవ్యం నెరవేర్చటం తెలిసిందే. అయితే బ్యాంకు సిబ్బంది అందరికీ మనవి ఏమిటంటే మోడీ చెప్పివుంటే బాగుండేది, కాకపోతే మనతో పాటు ఇంకా ఎంతోమంది, ఎన్నోరకాల వర్గాలు పనిచేస్తున్నారు. అందుకని పేరు పేరునా చెప్పటం సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే పనిచేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలుగా అర్ధంచేసుకోండి. అందరం ధన్యవాదాలు చెప్పేదాంట్లో బ్యాంకు సిబ్బంది కూడా వున్నారని మరిచిపోవద్దు.

మరి ఇక సిద్ధమవుదామా. ఆదివారం 5 గంటలకు 5 నిముషాలు చప్పట్లతోనో , గంట కొట్టటం తోనో పైన చెప్పిన అందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, సంఘీభావం తెలుపుదాం. కలిసిరండి. జయహో భారత్ , జయహో మన ఐక్యత, జయహో మన సంకల్పం.

ఇవీ ఈవారం ముచ్చట్లు కాని ముచ్చట్లు , సెలవా మరి. మరిన్ని ముచ్చట్లతో వచ్చేవారం .

……… మీ రామ్