టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

మెగాస్టార్ గోల్డెన్ జూబ్లీ.. ఫ్యాన్స్ ప్రత్యేక అభినందనలు !

50 years of Mammoottyభారతీయ సినిమా పరిశ్రమలో మలయాళ ఇండస్ట్రీది ప్రత్యేక స్థానం. ఇక మలయాళ చిత్ర సీమలో దిగ్గజ నటుడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిది విశిష్ట స్థానం. సుదీర్ఘ కెరీర్.. 400కు పైగా సినిమాలు.. ఎన్నో సూపర్ హిట్లు, మరెన్నో అవార్డులు రివార్డులు. మమ్ముట్టి సినీ కెరీర్ చాలా వైవిధ్యంగా సాగింది. తొలిసారిగా మలయాళంలో ‘అనుభవంగళ్ పలిచాకల్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.

మొదటి సినిమాలో హీరో కాదు, మమ్ముట్టిది చాలా చిన్న పాత్ర. 1971లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నా.. మమ్ముట్టికి అవకాశాలు రాలేదు. ఎన్నో కష్టాలు పడ్డారు. మలయాళంలో ఎంతోమంది హీరోలు వస్తోన్న రోజులు అవి. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ కూడా మమ్ముట్టికి రావడం లేదు. ఆ తరువాత ఎంతో నిరీక్షణ తర్వాత ‘కాలచక్రం, విక్కనుండు స్వప్నన్గల్’ లాంటి సినిమాల్లో నటించి మమ్ముట్టి మంచి నటుడు అనిపించుకున్నారు.

కెరీర్ అయితే ముందుకు సాగుతుంది. విజయవంతమైన నటుడిగా కూడా ప్రేక్షకులు గుర్తిస్తున్నారు. కానీ, తాను వచ్చింది హీరో అవుదామని. అందుకే మరింత కసితో పని చేశారు. ఈ క్రమంలో రచయితలను నమ్ముకున్నాడు మమ్ముట్టి. మలయాళ సినిమా ఇండస్ట్రీలో టాప్ రైటర్స్ లిస్ట్ చూసుకుని రెగ్యులర్ గా వారిని కలుస్తూ మంచి మంచి కథలను తన కోసం రాయించుకుంటూ మొత్తానికి స్టార్ అయ్యాడు.

మలయాళ ప్రేక్షకుల హృదయాల్లో మెగాస్టార్ గా తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అభిమానులు ముద్దుగా మమ్ముక్క అని పిలుచుకునే ఈ మలయాళ మెగాస్టార్ పూర్తి పేరు ‘మహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్’. వినడానికి చాలా కొత్తగా ఉన్నా… మమ్ముట్టిగా భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నారు.

నిత్యం గొప్ప ప్రశంసలు అందుకోవడం మమ్ముట్టికి ఆనవాయితీ అయిపోయింది కాబట్టి, కొత్తగా ఆయనను పొగడానికి ఇక ఏమి లేదు. అన్నట్టు నేటితో 50 ఏళ్ళ తన సినీ కెరీర్ ని ఒకవిధంగా గోల్డెన్ జూబ్లీని పూర్తి చేసుకున్న మలయాళ మెగాస్టార్ కి ప్రత్యేక అభినందనలు.

Back to top button