ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

రఘురామను లేపుతూ టీడీపీ చంపేస్తున్న మీడియా?

శత్రువుకు శత్రువు మిత్రుడన్న సామెత ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో ఉంది. ఏపీలో అధికార వైసీపీని దెబ్బకొట్టడానికి కాచుకు కూర్చున్న టీడీపీ అనుకూల మీడియాకు ఇప్పుడు ‘కోతికి కొబ్బరి చిప్ప’ దొరికినట్టుగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దొరికేశారు. సొంత అధికార పార్టీపైనే తిరుగుబాటు చేసిన రఘురామను ఇప్పుడు టీడీపీ మీడియా నెత్తిన పెట్టుకుంటోంది.

ఎంతలా అంటే రఘురామకు టీడీపీ పత్రికలు, మీడియాలో బ్యానర్ స్థలాన్ని ఇచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లను కూడా పక్కనపెట్టేస్తున్న పరిస్థితి దాపురించిందట.. టీడీపీ నేతలు కూడా ఈ పరిణామంపై నెత్తినోరు బాదుకుంటున్నారట..

రఘురామ ఇప్పుడు ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని జగన్, విజయసాయిరెడ్డిలపై పోరాడుతున్నారు. ఆయనను టీడీపీ మీడియా ఒక హీరోలా ప్రొజెక్ట్ చేస్తోంది. టీడీపీని, చంద్రబాబు లోకేష్ లను కూడా ప్రాధాన్యత తగ్గించి రఘురామను లేపుతోంది. అది టీడీపీ అధిష్టానానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నదే అయినా అది వారికి అర్థం కావడం లేదని సగటు టీడీపీ వాది మొత్తుకుంటున్నాడట..

తాజాగా టీడీపీ అనుకూల దినపత్రికలు గమనిస్తే రఘురామకృష్ణం రాజు వార్తలు పెద్ద ఎత్తున కవర్ చేశారు. చంద్రబాబు, లోకేష్ వార్తలకు కనీస కవరేజ్ కూడా ఇవ్వలేదు.

నిజానికి రఘురామకృష్ణంరాజు ప్రెస్ మీట్లు, మాటల దాడులపై ప్రజలూ ఎవరూ పెద్దగా దృష్టి సారించడం లేదు. మొదట్లో పట్టించుకున్న వారు కూడా ఇప్పుడు ఆయన రోజూ చేసే యాగి చూసి పట్టించుకోవడం లేదు. సొంత పార్టీపైనే దాడిచేసిన తిరుగుబాటుదారుడు కనుక ప్రారంభంలో కొంచెం ఆసక్తికరంగా , ఆశ్చర్యకరంగా జనాలు భావించారు. కానీ ఇప్పుడు వైసీపీ ఎంపీని పూర్తిగా టీడీపీ అనుకూల వ్యక్తిగా అందరూ పరిగణిస్తున్నారు.

మెజార్టీ ప్రజానీకం, వైసీపీ నేతలు ఇప్పుడు రఘురామను పట్టించుకోవడం లేదు. అయినా కూడా టీడీపీ మీడియా మాత్రం రఘురామక అంత ప్రాముఖ్యతను ఇస్తూ సొంత పార్టీ నేతలనే పట్టించుకోని ధైన్యం కనిపిస్తోంది. ఈ పరిణామం కేవలం రఘురామరాజుకు మాత్రమే సంతోషాన్ని కలిగించవచ్చు. కానీ ఇది టీడీపీకి ఎంత మాత్రం ఉపయోగపడదనడంలో ఎలాంటి సందేహం లేదు.

Back to top button