ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

వలస కూలీలకు మరో ముప్పు..!

వలస కూలీల వెతలు అన్ని ఇన్ని కావు. అయినప్పటికీ వందలు, వేల కిలోమీటర్లు వీరు కాలినడకన గమ్యాన్ని చేరుకునేందుకు ముందుకు సాగుతున్నారు. రైలు, రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారు. ఇప్పుడు వీరికి మరో ముప్పు పొంచి ఉంది. వేసవి ఎండలు తీవ్ర రూపం దాల్చి వడగాలులు వేయడంతో వడదెబ్బకు గురవుతున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 43 నుంచి 48 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ ఎండకు, వడగాలులకు ఇళ్లలో ఉండే ప్రజలే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో నడక ప్రయాణమంటే ప్రాణాల మీద ఆశ వదులుకున్నట్లే. రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లిలో ఈ విషాద సంఘటన జరిగింది.

జాతీయ రహదారిపై వెళ్తున్న వలస కూలీ ఒకరు వడదెబ్బతో మృతి చెందారు. మృతుడు జార్ఖండ్‌కు చెందిన అనిల్ సర్కార్(47)గా గుర్తించారు. చెన్నై నుంచి కాలినడకన 20 మంది వలస కూలీలు జార్ఖండ్ వెళ్తున్నారు. చిన్న ఆవుటపల్లికి చేరుకోగానే అనిల్ సర్కార్‌కు తీవ్రమైన నీరసంతో కుప్పకూలిపోయాడు. ఎండలో నడవటమే కారణంగా చెబుతున్నారు. కిందపడిన కొద్దీ సేపటికే అతను మృతి చెందాడు. అయితే అతని బృందంలో మిగిలిన వారు అనిల్ మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో స్థానికులు ఆత్కూరు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనిల్ సర్కార్ మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మరోవైపు రాష్ట్రంలో వలస కూలీలు ఎవరు నడిచి వెళ్లేందుకు అవకాశం ఇవ్వొద్దని, వారిని ప్రత్యక్షంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకూ చేర్చాలని ముఖ్యమంత్రి జగన్ అదేశించినప్పటికీ కొంతమంది వలస కూలీలు కాలినడకన ప్రయాణం చేస్తున్న దృశ్యాలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. వలస కూలీల నడక ప్రయాణాన్ని అధికారులు సరైన విధంగా స్పందించక పోవడంతోనే ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

Back to top button