గెస్ట్ కాలమ్జాతీయంరాజకీయాలు

భారతీయుల విశ్వాసమే మోదీ ఆయుధం: రాం మాధవ్

హంగేరి దేశ ప్రధాని విక్టర్ ఒర్బాన్ కరోనా వైరస్ వ్యాధి (కోవిద్-19)పై తన పోరాటానికి పార్లమెంట్ ఆటంక పరుస్తున్నదని భావించారు. పార్లమెంట్ లో తనకున్న ఆధిక్యతను ఆసరాగా తీసుకోని అత్యవసర అధికారాలను సొంతంచేసుకొన్నాడు. ఇప్పుడు ఆయన న్యాయవ్యవస్థ సమీక్షకు అవకాశంలేని ఉత్తర్వుల ద్వారా హంగేరీని పాలించవచ్చు. ఆయన ఉత్తర్వులను విమర్శిస్తే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

అసాధారణ సమయాల్లో అసాధారణ నిర్ణయాలు అవసరం. అందులో కొన్ని సమర్ధనీయమే. కానీ ప్రజారోగ్య అత్యవస పరిస్థితిని అనువుగా తీసుకోని కొందరు నాయకులు సర్వాధికారాలు చేజిక్కించుకొని నియంతలుగా మారుతున్నారని విమర్శకులుపేర్కొంటున్నారు. మనం రష్యా లేక చైనా గురించి మాట్లాడటం లేదు. సాంప్రదాయక ప్రజాస్వామ్య దేశాలైన బ్రిటన్, ఇజ్రాయెల్ లకు కూడా విశ్వ మహమ్మారిపై పోరులో అత్యవసర అధికారాలు వాడుకోవటం తప్పలేదు.

ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యాయస్థానాలను మూసివేయవలసిందిగా ఆదేశించారు. అవినీతి కేసులో నేర విచారణనుండి స్వయంగా తప్పించుకోవటానికే ఈ చర్య తీసుకొన్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. నెతన్యాహు దేశ అంతర్గత భద్రతా సంస్థలను పౌరులపై విస్తృత నిఘా విధించేందుకు అనుమతించారు. ఇజ్రాయెల్ లో లాక్ డౌన్ ఉల్లంఘించిన వారికి ఆరునెలల కారాగార శిక్ష విధిస్తున్నారు.

స్థిరమైన ప్రజాస్వామ్య సంస్థలు, పద్ధతులు కలిగిఉన్న యునైటెడ్ కింగ్డమ్ లో సైతం మహమ్మారి సంబంధిత బిల్లును వేగిరంగా ఆమోదింపచేసుకోవటం ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలకు విశేషాధికారాలు కల్పించారు. ఈ చట్టం వ్యక్తులను కాలపరిమితి లేకుండా నిర్బంధించే అధికారాన్ని కల్పిస్తుంది. బ్రిటన్ ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్ హాంకాక్ సాధారణంగా బ్రిటన్ వ్యవహరించే తీరుకు ఇది భిన్నమైనదేనని అంగీకరించారు.

ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యూటీర్ట్, థాయిలాండ్ ప్రధానమంత్రి ప్రయూత్ చాన్ ఓచ్ లు విశేష అధికారాలు కల్పించుకొన్నారు. ఇటలీ, స్పెయిన్ దేశాలు వేలాది ప్రజలను వేరువేరుగా ఉంచటానికి (క్వారంటైన్ చేయటానికి) సైన్యం పై ఆధారపడవలసి వచ్చింది. హంగేరి, లెబానాన్, మలేషియా, పెరూ మొదలగు దేశాలు ఆంక్షలను అమలు చేయటంకోసం సైన్యాన్ని వీధుల్లోకి తీసుకొని రావలసి వచ్చింది.

జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ లు కూడా సాయం కోసం సైన్యం వైపు చూడవలసివచ్చింది. యునైటెడ్ కింగ్డమ్ ఇరవై వేల మంది సైనికులతో ‘కోవిద్ స్పందన సమూహాన్ని’ ఏర్పరచింది.

అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మొదటి దశలో వ్యక్తులను విచారణ లేకుండా నిరవధికంగా నిర్బందించే విశేషాధికారం కల్పించచుకోవటానికి, దేశంలో ఆశ్రయం కోరే విదేశీయులకు చట్ట బద్ధంగా ఉన్న హక్కులను రద్దు చేయటానికి ప్రయత్నం చేసినా, అమెరికన్ కాంగ్రెస్ జోక్యంతో న్యాయ మంత్రిత్వ శాఖ కోరికల చిట్టా నీరుకారింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అక్కడి రాష్ట్రాల గవర్నర్లకు లాక్ డౌన్ విషయంలో సర్వాధికారాలు ఉండటం వలన దేశాధ్యకుడు ట్రంప్ అధికారాలు కాస్తంత పరిమితమైనవిగానే ఉన్నాయి.

అలా వివిధ దేశాల్లో జరుగుతున్న పరిణామాలను భారత దేశంలో జరుగుతున్న దానితో పోల్చి చుస్తే, ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి అత్యవసర అధికారాలకోసమో, విశేషాధికారరలకోసమో అడుగలేదు. సెన్సార్షిప్ విధించటమో లేక విచారణ లేకుండా నిర్బందించే చర్యలకో దిగలేదు.

ప్రచార మాధ్యమాల గొంతునొక్కుతున్నారంటూ వినపడుతున్న అపస్వరాలన్నీ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నవే. సుప్రీంకోర్టు కేవలం తప్పుడు వార్తల పట్ల జాగ్రత్త వహించమని, అధికార గణాంకాలకు చోటివ్వమని మాత్రమే మీడియాను కోరింది.

మోదీ సైన్యాన్ని విధుల్లోకి రమ్మని పిలువలేదు. ప్రజల ప్రాధమిక మానవ హక్కులను కొట్టిపారేయలేదు. చాలావరకు లాక్ డౌన్ సూచనలన్నీ ప్రజాహితం కోరి చేస్తున్నవే. ప్రజలు స్వచ్చందంగా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కఠిన చర్యలకు ఉపక్రమించాలని మోదీ కి ఎవరూ సలహా ఇవ్వకపోలేదు. మోదీ నిరంకుశ అధికారాల మీద కాకుండా, ప్రజాస్వామ్య మాధ్యమాల మీదే ఆధారపడ్డారు. తాను స్వయంగా ‘ప్రపంచ యుద్ధం తరహా పరిస్థితి’ గా వర్ణించిన పరిస్థితులలో కూడా మోదీ మౌలిక మానవ హక్కులను ఆదరిస్తూ ప్రజాస్వామ్యవాదిగా నిలబడ గలిగారు.

కోవిద్ పై యుద్ధంలో 130 కోట్ల భారతీయుల విశ్వాసమే మోదీ ఆయుధం. ఇటీవల మోదీ జాతికి ఇచ్చిన సందేశంలో శాసనం (రాజకీయ నాయకత్వం), ప్రశాసనం (ప్రభుత్వోద్యోగులు), జనతా జనార్దన్ (దైవాంశ సంభూతులైన ప్రజలు) కోవిద్ పై తన పోరాట సమూహమని పేర్కొన్నారు.

దేశంలో సగం రాష్ట్రాలలో బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్నా మోదీ ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కోలేదు. ఇది మోదీ విశ్వనీయత స్థాయి ఉన్నతంగా ఉందని తెలియజేస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, న్యూ యార్క్ గవర్నర్ ఆండ్రూ సుయోమో ల మధ్య ఇటీవల కాలంలో వాగ్వివాదం చోటుచేసుకోవటం గమనార్హం.

‘ప్రజల ద్వారా, ప్రజలకొరకు, ప్రజలచే” ప్రభుత్వం ఉండటమే ప్రజాస్వామ్యమని గంభీర ప్రకటనలు వింటుంటాం. కానీ చాల దేశాల్లో ప్రజలచే విషయాలు నడపబడటం అనేది అరుదు. కానీ మోదీ దానిని మర్చి వేశారు. మోదీ ప్రజలను కేవలం ఓటర్లుగానో లేక ప్రేక్షకులుగానో చూడలేదు, పాలనలో ప్రజలను పాత్రధారులుగా చేసాడు. ఇది మోదీ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్షణం.

స్వచ్ఛ భారత్ పేరున పారిశుధ్యం కొరకు చేసిన మొట్టమొదటి భారీ ప్రచారోద్యమం నుండి నేటి మహమ్మారితో పోరాటం వరకు ప్రజలను ఎక్కువ క్రియాశీల పాత్రధారులను చేసే ప్రత్యేకమైన నేర్పును మోదీ కనపరిచాడు.

ఫ్రాన్సిస్ ఫుకుయామా అనే రాజకీయ శాస్త్రవేత్త చట్టబద్ధమైన పాలన, చట్టంచే పాలనల మధ్య ఆసక్తికరమైన వ్యత్యాసాన్ని పేర్కొన్నారు. రాజ్యాంగం ఏర్పరిచిన నియమాలు శిరోధార్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో చట్టబద్ధ పాలన సాగుతుంది. నియంతలు మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తి కి పూర్తి విరుద్ధంగా చట్టం అదనుగా పాలన చేయాలని చూస్తారు.

మోదీ చట్టబద్ధమైన పాలన పట్ల నిబద్ధతను స్పష్ఠంగా కనపరిచారు. తబ్లిగీ జమాత్ మర్కజ్ అనే మత వర్గంచే లాక్ డౌన్ నిభందనలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించటం, భారీ సంఖ్యలో వలస కార్మికులు వెనుకను తరలిపోవటం వంటి రెచ్చగొట్టటానికి ఆస్కారం ఉన్న సంఘటలు జరిగాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించిన సంఘటనలు సైతం ఉన్నాయి. అయినప్పటికీ మోదీ తన కార్య పద్దతి నమూనాను మార్చుకోలేదు.

మోదీ ప్రజలలో సహజసిద్ధంగా అంతర్గతంగా ఉండే మంచితనాన్ని ప్రేరేపించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. తన సందేశంలో మోదీ ప్రజలను భగవత్ స్వరూపులుగా వర్ణించి వారి మహా శక్తిని, విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించమని కోరారు. కరోనా పోరాటయోధుల్ని అభినందిస్తూ కరతాళ ధ్వనులను చేయమన్నప్పుడు, వారి కొరకు దీపలు వెలిగించమని పిలుపు యిచ్చిన సందర్భంలోనూ లభించిన అపూర్వ ప్రజా స్పందన మోదీ వెనుక ప్రజలు స్థిరంగా నిలబడ్డారని సూచించింది.

మోదీ కరోనా విశ్వ మహమ్మారిపై పోరును మరో స్థాయికి తీసుకొనివెళ్ళారు. శాస్త్రీయ పద్దతులను అవలంభిస్తూ, సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తూ, కరోనా వ్యతిరేక పోరులో 130 కోట్ల మంది ప్రజలను పాత్రధారులను చేసారు. దూరదృష్టితో, తనదైన విలక్షణ పద్దతిని అవలంభిస్తూ “మానవ కేంద్రిత అభివృద్ధి సహకారం” అనే నమూనాను మోదీ ప్రపంచం ముందు ఆవిష్కరించారు.

(రాం మాధవ్ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ గోవేర్నర్స్ సభ్యులు. వ్యాసంలో అభిప్రాయాలు వ్యక్తిగతం.)