తెలంగాణమిర్చి మసాలావైరల్

చిరు, మోహన్ బాబుల మధ్య ట్వీట్ల జోక్స్..వైరల్


“కొత్త భిక్షగాడు పొద్దెరగడని” తెలుగులో ఒక సామెత ఉండేదిలే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి కూడా అలానే ఉంది. ఇటీవలే ట్విట్టర్ లో కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకున్న చిరు, పోస్టులతో హల్ చల్ చేస్తున్నాడు. లాక్ డౌన్ పుణ్యమా అని ఇంట్లో ఉన్న చిరు ఎక్కువ సమయం ఆన్ లైన్ లోనే సమయం గడుపుతున్నట్లు ఉన్నారు.చిరు ట్విట్టర్ ఎంట్రీ పై అభిమానులు, ప్రముఖ సినీ హీరోలు హర్షం వ్యక్తం చేస్తూ..ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. అలాంటి వారందరికీ చిరు తీరికగా రిప్లై లు ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, చిరంజీవికి స్వాగతం పలికారు.. మిత్రమా స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. దీనికి మెగాస్టార్ స్పందిస్తూ . “రాననుకున్నావా, రాలేననుకున్నావా” అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ కి రిప్లై ఇచ్చిన మోహన్ బాబు .. ఈ సారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతాను అని అన్నారు. దీంతో ఆ ట్వీట్‌ కు చిరంజీవి కౌంటర్ ఇస్తూ.. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే హగ్స్, షేక్ హాండ్స్ ఇచ్చుకోకూడదు, సోషల్ డిస్టెన్స్ అవసరం అంటూ అదరగొట్టారు. అంతేకాదు ఆయన ట్వీట్‌‌ లో రాస్తూ.. కరోనా పై అవగాహన కోసమే కాకుండా మన చుట్టుపక్కల వారిని ఎలా కాపాడోలో తెలియాలంటే లక్ష్మీ రూపొందించిన వీడియో చూడాలని మోహన్ బాబును కోరారు చిరంజీవి. వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.