టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

ఈ వారం బాక్సాఫీస్ వ‌ద్ద‌ జాతరే జాత‌ర‌!

సినిమా రిలీజుల్లో వేగం మొద‌లైంది. గ‌డిచిన రెండు వారాల్లో మొత్తం 9 చిత్రాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యాయి. రాబోయే ఫ్రైడే రోజున ‘అంత‌కు మించి’ అన్న రేంజ్ లో సినిమాలు వచ్చేస్తున్నాయి. ఆగ‌స్టు 15 స్వాతంత్ర్య దినోత్స‌వం కూడా ఉన్న నేప‌థ్యంలో.. చాలా మంది మేక‌ర్స్ ఈ వారాన్నే టార్గెట్ చేశారు. థియేటర్లు, ఓటీటీలు క‌లుపుకుంటే.. మొత్తం ప‌ది సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో ఇంగ్లీష్ సినిమాల‌ను కూడా చేర్చామంటే.. ఆ నంబ‌ర్ 15కు చేరుతోంది. ఇంకేముందీ..? బాక్సాఫీస్ వద్ద రచ్చ రచ్చ జరగబోతోంది. మరి, ఆ సినిమాలేంటో చూసేద్దామా?  

క‌న‌బ‌డుట లేదుః చాలా రోజుల త‌ర్వాత సునీల్ మ‌ళ్లీ హీరోగా క‌నిపించ‌బోతున్న చిత్రం ‘క‌నుబ‌డ‌ట లేదు’. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్న ఈ చిత్రం ఆగ‌స్టు 13న రిలీజ్ కాబోతోంది. సునీల్ డిటెక్టివ్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రాన్ని బాల‌రాజు తెర‌కెక్కించారు. మ‌రి, ఈ కేసును హీరో ఎలా తెర‌కెక్కించాడో తెలియాలంటే 13వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

సుంద‌రిః అర్జున్‌-పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ సుంద‌రి. మ‌గాళ్ల వ‌ల్ల ఒక అమ్మాయి జీవితం ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంది? అన్న‌దే ఈ చిత్ర క‌థాంశం. క‌ల్యాణ్ గోగ‌న తెర‌కెక్కించిన ఈ చిత్రం కూడా ఆగ‌స్టు 13వ తేదీనే రిలీజ్ కాబోతోంది.

ఒరేయ్ బామ్మ‌ర్దిః హీరో సిద్ధార్థ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్ర‌మిది. జీవీ ప్ర‌కాశ్ కీల‌క పాత్ర పోషించారు. సిద్ధార్థ్ ట్రాఫిక్ పోలీస్ గా న‌టిస్తుండ‌గా.. బైక్ రేస‌ర్ కావాల‌ని త‌పించే యువ‌కుడి పాత్ర‌లో జీవీ ప్ర‌కాష్ న‌టించారు. బిచ్చ‌గాడు చిత్రాన్ని రూపొందించిన శ‌శి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ మూవీ సైతం ఆగ‌స్టు 13నే రిలీజ్ కాబోతోంది.

బ్రాందీ డైరీస్ః కొత్త న‌టీన‌టుల‌తో క‌లెక్టివ్ డ్రీమ‌ర్స్ ప‌తాకంపై లీలా శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘బ్రాందీ డైరీస్’. శివుదు దర్శకత్వం వహించారు. యువతను టార్గెట్ చేసిన ఈ చిత్రాన్ని కూడా ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఆగ‌స్టు 13నే రిలీజ్ చేయ‌బోతున్నారు.

ది కంజురింగ్ః హాలీవుడ్ హార‌ర్ మూవీ ఇది. ప్యాట్రిక్ విల్స‌న్‌, వెరా ఫార్మిగా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. దెయ్యం నాచేత చేయించింది అనేది ట్యాగ్ లైన్‌. జూన్లోనే అమెరికాలో రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు ఇండియ‌న్ బాక్సాఫీస్ మీద దండ‌యాత్ర‌కు సిద్ధ‌మైంది. ఆగ‌స్టు 13 రిలీజ్‌.

పాగ‌ల్ః యువ న‌టుడు విశ్వ‌క్ సేన్ హీరోగా వ‌స్తున్న చిత్రం పాగ‌ల్‌. నివేదా పేతురాజ్ హీరోయిన్‌. న‌రేశ్ కుప్పిలి తెర‌కెక్కించిన ఈ ల‌వ్ స్టోరీని ఆగ‌స్టు 14న రిలీజ్ చేయ‌బోతున్నారు. దిల్ రాజు స‌మ‌ర్పిస్తుండ‌డంతో ఆస‌క్తి పెరిగింది.

షేర్షాః కార్గిల్ వార్‌ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం షేర్షా. బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, కియారా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ప‌ర‌మ్ వీర్ చ‌క్ర అవార్డు పొందిన కెప్టెన్ విక్ర‌మ్ భాత్రా జీవిత క‌థ ఆధారంగా ఈ మూవీ తెర‌కెక్కింది. అమెజాన్ ప్రైమ్ లో ఆగ‌స్టు 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

నెట్రికన్ః హీరోయిన్ న‌య‌న తార ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న లేడీ ఓరియంటెడ్‌చిత్రం నెట్రిక‌న్‌. ఇదొక క్రైమ్ డ్రామా. అమ్మాయిల‌ను కిడ్నాప్ చేసి, హింసించే సైకోను.. ఓ అంధురాలు ఎలా క‌నిపెట్టింది అన్న‌దే ఈ చిత్రం. ఆగ‌స్టు 13 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

భుజ్ ది ప్రైడ్ః ఇది కూడా మ‌రో వార్ డ్రామానే. అజ‌య్ దేవ్ గ‌న్‌, సంజ‌య్ ద‌త్‌, సోనాక్షి సిన్హా, ప్ర‌నీత త‌దిత‌రులు న‌టించిన ఈ మూవీ ఆగ‌స్టు 15న నుంచి స్ట్రీమింగ్ కానుంది. 1971లో ఇండో-పాక్ వార్ స‌మ‌యంలో నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది.

వీటితోపాటు బేక్ స్క్వాడ్, ది కిస్సింగ్ బూత్‌-3, మిషా అండ్ ది వోల్వ్స్ చిత్రాలు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆగ‌స్టు 11 నుంచే ఇవి స్ట్రీమ్ అవుతాయి. వాట్ ఇఫ్‌? అనే మూవీ మాత్రం హాట్ స్టార్ లో వ‌స్తోంది. బెక్కెట్ అనే మ‌రో మూవీ సైతం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. ఇది ఆగ‌స్టు 13 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విధంగా.. ఈ వారం డ‌జ‌నుకు పైగా చిత్రాలు సంద‌డి చేయ‌బోతున్నాయి.

Back to top button