ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

MP Raghuram: బ్యాంకులు జాగ్రత్తగా ఉండాలంటున్న రఘురామ

MP Raghuram Krishna

బ్యాంకులకు ఎనిమిది వందల కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఇప్పుడు బ్యాంకులకే హితబోధలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేల కోట్ల అప్పులు తీసుకుంటూ రహస్యాలు పాటిస్తుందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకులు రుణాలిస్తున్నాయని తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కకు మించి అప్పులు చేస్తోందని పేర్కొన్నారు. ఎడ్యుకేషన్ కార్పొరేషన్ పేరుతో ఏపీ రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఎయిడెడ్ కళాశాలల ఆస్తులను అమ్ముకుని తద్వారా వచ్చే ఆదాయంతో అవసరాలు తీర్చుకోవాలని కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కళాశాలలు వాటి ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించరాదని సూచించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మి వచ్చే ఆదాయంతో మరో ఏడాది ప్రభుత్వాన్ని నడిపేందుకు జగన్ చూస్తున్నారని వాపోయారు.

రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు కూడా ఘాటుగానే సమాధానాలు ఇస్తున్నారు. రఘురామపై రాజద్రోహం కేసు పెట్టినా ఆయనలో మార్పు రావడం లేదని మండిపడుతున్నారు. ఎన్ని కోణాల్లో నియంత్రించాలని చూస్తున్నా ఆయనలో వాడి తగ్గడం లేదని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచే కుట్రలో భాగంగా రఘురామ చర్యలు తగ్గడం లేదని వైసీపీ వర్గాలు వాపోతున్నాయి.

ప్రభుత్వ తీరుపై రఘురామ తనదైన శైలిలో ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్వహణ కోసం అందినకాడల్లా అప్పులు చేస్తూ అధోగతి పాలు చేస్తుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మొత్తంలో అప్పులు చేసి రాష్ర్టం కోలుకోని విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నడవడానికి ధనమనే ఇంధనం అవసరమని గుర్తించి ప్రభుత్వ ఆస్తులను అమ్ముతూ పొట్టపోసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Back to top button