అత్యంత ప్రజాదరణసినిమా రివ్యూస్

మూవీ రివ్యూ : వైల్డ్ డాగ్.. హిట్టా? ఫట్టా?

నటీనటులుః నాగార్జున‌, స‌యామీ ఖేర్‌, దియామీర్జా, త‌దిత‌రులు
దర్శకత్వంః అషితోష్‌ సాలోమ‌న్‌
నిర్మాణంః మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్‌
సంగీతంః థ‌మ‌న్‌
రిలీజ్ డేట్ః 02 మార్చి, 2021

ఎప్పుడో సంక్రాంతికే ఓటీటీలో రిలీజ్ అయిపోవాల్సిన‌ సినిమా.. అటూ ఇటూ తిరిగి చివ‌ర‌కు థియేట్రిక‌ల్ రిలీజ్ కు సిద్ధ‌మైంది. ప్ర‌ముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం కుదుర్చుకుని, ఆ త‌ర్వాత సినిమాను బిగ్ స్క్రీన్ కు తీసుకొచ్చారు. అయితే.. అన్నీ మంచి శ‌కున‌ములే అన్న‌ట్టుగా ఈ సినిమాకు చాలా విష‌యాలు క‌లిసి వ‌చ్చాయి. థియేట‌ర్ రిలీజ్ ఒక‌టైతే.. ఈ సినిమా ముక్కోణ‌పు పోటీని ఎదుర్కోవాల్సి ఉండె. కానీ.. అక‌స్మాత్తుగా గోపీచంద్ ‘సీటీ మార్‌’ రిలీజ్ వాయిదా పడింది. ఇక, మరో సినిమా కార్తీ ‘సుల్తాన్’తో థియేటర్ షేర్ చేసుకుంది. అది కూడా డబ్బింగ్ సినిమా కావడంతో.. ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ వైల్డ్ డాగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ విధంగా.. బెస్ట్ అవ‌కాశాల‌తో వ‌చ్చిన ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుందో చూద్దాం.

క‌థః

హైద‌రాబాద్ గోకుల్ ఛాట్ బాంబుపేలుడు ఉదంతాన్ని ఎన్ఐఏ ఎలా డీల్ చేసింది? ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్టు, ఏసీపీ విజ‌య్ వ‌ర్మ ఈ కేసును ఎలా ఛేదించారు? వీరికి ‘రా’ ఏజెంట్లు ఎందుకు సహకరించారు? ఇద్ద‌రూ క‌లిసి టెర్ర‌రిస్టుల క‌థ ఎలా ముగించారు? అన్నది కథ. ఈ సినిమాలో నాగార్జున విజ‌య్ వ‌ర్మ పాత్ర‌లో క‌నిపించారు. ఆయ‌న స‌ర‌స‌న రా ఏజెంట్ గా బాలీవుడ్ బ్యూటీ స‌యామీ ఖేర్ క‌నిపించింది.

క‌థ‌నంః

ఇది ఒక జోన‌ర్ ప్రేక్ష‌కులు మాత్ర‌మే ఆస‌క్తిగా ఎదురు చూసే మూవీ. యాక్ష‌న్ సినిమాల‌ను ప్రేమించే వారికి మాత్ర‌మే ఇలాంటి సినిమాలు మొద‌టి ఛాయిస్‌. అయితే.. ద‌ర్శ‌కుడు అషుతోష్ సాలోమ‌న్ అందరూ చూసే సినిమాగా మ‌లిచాడు. క‌థనంలో ఎక్క‌డా బిగి స‌డ‌ల‌కుండా ముందుకు న‌డిపించారు. ఇన్వెస్ట్ గేష‌న్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను సీట్ల‌కు క‌ట్టిప‌డేస్తాయి. ఫ‌స్ట్ ఆఫ్ కాస్త స్లోగా అనిపించిన‌ప్ప‌టికీ.. సెకండ్ ఆఫ్ నుంచి ఆప‌రేష‌న్ వైల్డ్ డాగ్ మొద‌లవుతుంది. క‌థ ముందుకు సాగుతున్న కొద్దీ.. ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. కొన్ని యాక్ష‌న్ ఎపిసోడ్లు లాజిక్ కు అంద‌లేదు అనిపించిన‌ప్ప‌టికీ.. పెద్ద‌గా ప్ర‌భావం చూప‌వు. భార‌త్ లో మొద‌లైన ఈ దాడి మూలాలు నేపాల్ లో ఉన్న‌ట్టు తేల్చిన ఎన్ఐఏ.. అక్క‌డికి వెళ్తుంది. సినిమా ఇంట‌ర్వెల్ బ్యాంగ్ కూడా ఆక‌ట్టుకునేలా ఉంది. అయితే.. ఈ సినిమాలో పాట‌లు లేక‌పోవ‌డం మైన‌స్‌. దానివ‌ల్ల గ్లామ‌ర్ మిస్స‌యిన ఫీలింగ్ క‌లుగుతుంది. అయిన‌ప్ప‌టికీ.. థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము లేపాడు.

ఇక‌, విజ‌య్ వ‌ర్మ‌గా నాగార్జున యాక్టింగ్ అల్టిమేట్‌. రా ఏజెంట్ గా స‌యామీ ఖేర్ కూడా అద్భుతంగా న‌టించింది. మిగిలిన పాత్ర‌లు కూడా త‌మ ప‌రిధిమేర న్యాయం చేశాయి. ద‌ర్శ‌కుడు కొత్త‌వాడైనా.. అద్భుతంగా తెర‌కెక్కించాడు. అయితే.. కేవ‌లం సినిమా మొత్తం ఇన్వెస్టిగేష‌న్‌, పోలీసులు ఇదే పంథాలో సాగ‌డం అందరికీ న‌చ్చ‌క‌పోవ‌చ్చు. అస‌లు నాగ్ సినిమాలో రొమాన్స్ లేక‌పోవ‌డాన్ని అభిమానులు, ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటార‌న్న‌ది చూడాలి.

బ‌లాలుః క‌థ‌, క‌థ‌నం, నాగార్జున‌

బ‌ల‌హీన‌త‌లుః ఫ‌స్ట్ హాఫ్‌, పాట‌లు లేక‌పోవ‌డం, లాజిక్ లేని కొన్ని స‌న్నివేశాలు

లాస్ట్ లైన్ః ‘వైల్డ్ డాగ్‌’ ఆపరేషన్ సక్సెస్

రేటింగ్ః 2.75/5

Back to top button