కరోనా వైరస్జాతీయంరాజకీయాలుసంపాదకీయం

వలస కార్మికుల సమస్యతో దేశం అతలాకుతం

లాక్ డౌన్ దేశవ్యాప్తంగా ఇంకో 19 రోజులు పొడిగించటం తో వలస కార్మికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. వారి మానసిక స్థితి ని సానుకూలంగా చూడాలి తప్పితే కేవలం చట్టాల , నిబంధనల చట్రంలో నుంచి చూడకూడదు. అందరూ అనుకుంటున్నట్లు, కొంతమంది మేధావులు వ్యక్తపరుస్తున్నట్లు ఇది వారి ఆర్ధిక దయనీయమైన పరిస్థితి కి సంబందించినది కాదు. అది కేవలం ఒక పార్శ్వం మాత్రమే. ముఖ్యమైనది వారి మానసిక స్థితి కి సంబందించినది. ఇంటికి చాలా దూరంగా ఉండటంతో ఇంటి దగ్గర కుటుంబం , పెళ్ళాం, పిల్లలు, తల్లిదండ్రులు ఎలావున్నారనే  ఆదుర్దా, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కుటుంబం మధ్య ఉండాలనే బలమైన కోరిక వాళ్ళని అశాంతి కి, ఆందోళన కి గురి చేస్తుంది. వలస కార్మికుల్లో కుటుంబంతో నివసించే వాళ్ళు మూడో వంతు మాత్రమే. అదీ అందరి కుటుంబ సభ్యులతో  కాదు. ఈ ఆందోళన నే వీళ్ళను సామాజిక దూరం లెక్కచేయకుండా నిరసనలకు పురికొల్పుతుంది.

ముంబై ఉల్లంఘన చాలా ప్రమాదకరం 

నిన్న ముంబై లో జరిగింది క్షమించరాని ప్రభుత్వ వైఫల్యం. ఇలా ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పటికే డిల్లీ వలస కార్మికుల ఆందోళన, డిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ సంఘటన మనకు నేర్పిన చేదు అనుభవాలనుంచి గుణపాఠం నేర్చుకోకపోవటం దారుణం. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం ఒకత్రాటి పై నడవటంలేదు అనటానికి ఇది ఉదాహరణ. గట్టి నాయకుడు ప్రభుత్వాధినేతగా వున్న చోట ఇటువంటి పరిస్థితుల్లో గట్టి నిర్ణయాలు తీసుకోగలడు. సంకీర్ణ ప్రభుత్వాల్లో అది సాధ్యం కాదు, అదీ పరస్పర విరుద్ధ సిద్ధాంత పార్టీలు కలిసిన చోట. బాంద్రా లో జరిగింది చిన్న విషయం కాదు. ఇంకో నిజాముద్దీన్ మర్కజ్ లాంటిదే. ఇప్పటికే ముంబై లో కరోనా మహమ్మారి జడలు విప్పి స్వైర విహారం చేస్తున్న వేళ ఇంతమంది ఒకచోట గుమికూడటం కారణమేదైనా మహా ప్రమాదం. దీని పరిణామాలు ముందు ముందు ఎలా వుంటాయో నని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ముంబై లో కరోనా మహమ్మారి రెండో దశను దాటి మూడో దశలోకి ప్రవేశించిందనే భయం అందరిలో ఒక వైపు వెంటాడుతుంటే ఇంకోవైపు దాన్ని విస్తరించే కార్యక్రమాలు జరగటం దారుణం. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి.

బాంద్రా ఎమ్యెల్యే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని ప్రకటించాడు. ఆయనేమీ ప్రతిపక్ష బిజెపికి చెందిన వ్యక్తి  కాదు. సాక్షాత్తు అధికార సంకీర్ణానికి చెందిన కాంగ్రెస్ ఎమ్యెల్యే. రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికులకు ఆహారం సరఫరా చేయటం లో విఫలమయ్యిందని అందుకే వాళ్ళలో అశాంతి చెలరేగిందని ప్రకటించాడు. అయితే ఉద్ధవ్ థాకరే మాత్రం అటువంటిదేమీ లేదని చెప్పుకొచ్చాడు. ఇందులో నిజా నిజాల సంగతి ఎలావున్నా వాళ్ళలో ధైర్యాన్ని నింపటం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని చెప్పక తప్పదు. మోడీ నిన్న దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించటానికి ముందే మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. అటువంటప్పుడు మోడీ ప్రకటన వల్లే ఇది జరిగిందని కొంతమంది మాట్లాడటం సమస్యను రాజకీయం చేయటమే అవుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కుమారుడు , మంత్రి అయిన ఆదిత్య థాకరే ప్రకటన బాధ్యతా రాహిత్యంగా వుంది. వలస కార్మికుల్ని కేంద్రం వాళ్ళ స్వస్థలాలకు తరలించటానికి ఏర్పాట్లు చేయక పోవటం వల్లనే ఈ సమస్య ఉత్పన్న మయ్యిందని ప్రకటించటం, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ప్రధాన మంత్రి కి, హోంమంత్రి కి ధన్యవాదాలు తెలపటం చూస్తుంటే తన అపరిపక్వత ఏ స్థాయిలో వుందో అర్ధం చేసుకోవచ్చు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. బ్యాంకు స్కాం లో ఇరుక్కొని సిబిఐ , ఇడి విచారణకు రాకుండా కరోనా కుంటి  సాకులతో కాలం గడుపుతున్న వద్వానా కుటుంబం కి వివిఐపి పాసులు జారీ చేసి నిబంధనలు ఉల్లంఘించటం అక్కడి రాష్ట్ర ప్రజలందర్నీ ఆశ్చర్య పరిచింది. అందరూ అనుకోవటం శరద్ పవర్ ఆజ్ఞలతోనే ఇది జరిగందని . ఇందులో నిజా నిజాలు తెలుసుకోవటం ఇప్పుడు ప్రాధాన్యం కాదు కాబట్టి సర్దిపుచ్చుకుందాం. కానీ ఇలా కరోనా వ్యాప్తి చెందే పనులకు పరోక్షంగా దోహదం చేయటం క్షమించ రాని నేరం.

బాంద్రా వెస్ట్ రైల్వే స్టేషన్ కి ఇన్ని వందలమంది వాళ్ళంతట వాళ్ళే వచ్చారని నమ్మే అమాయకులు ఎవరూ లేరు. వివిధ ప్రాంతాలనుంచి అదీ ఒక్క బాంద్రా స్టేషన్ కే ఇంతమంది ఎందుకు వచ్చారో దర్యాప్తు చేయాల్సి వుంది. ఇప్పటికే అందిన సమాచారం మేరకు కొంతమంది సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టి అందర్నీ ఒకచోట చేర్చారని అర్ధమవుతుంది. వీళ్ళు హోం మంత్రి కి తెలిసినవాళ్ళని కూడా సాక్ష్యాధారాలతో కొన్ని చానళ్ళు ప్రసారం చేస్తున్నాయి. దానిలో నిజా నిజాలు దర్యాప్తులో తేలాల్సివుంది. ఒకవేళ నిజంగా హోం మంత్రికి తెలిసిన వాళ్ళయినా దానికి హోం మంత్రిని బాధ్యుడిని చేయలేము. కాకపోతే ఇటువంటి వ్యక్తులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పగలం. అధికారంలో వున్న ముఖ్యమంత్రి పార్టీ చరిత్ర చూసినా వలస కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పలేం. అసలు శివ సేన పుట్టుకే వలస కార్మికులు, స్థానికేతరులు కి వ్యతిరేకంగా. అందుకే ఆదిత్య థాకరే అలా మాట్లాడాడు. ఇప్పుడు అందరి ఆందోళన అల్లా ఈ అంతర్గత కలహాలతో పరిపాలన కుంటుపడి కరోనా మహమ్మారి కి వ్యతిరేకంగా పటిష్టమైన చర్యలు లోపిస్తాయేమోనని. దేశం మొత్తం మీద అత్యంత ఆందోళన కర పరిస్థితులు ముంబై లోనే వున్నాయి. ఇది సామూహిక విస్తరణ ( Community Spread) దశగా మారిందనో, మారే అవకాశాలు మెండుగా ఉన్నాయనో వస్తున్న వార్తలు అందరి మనస్సుల్నీ తీవ్రంగా కలిచివేస్తుంది.

కేంద్రప్రభుత్వం పారదర్శకత తో వ్యవహరించాలి 

అంటే దీనర్ధం కేంద్రానికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు కాదు. వలస కార్మికుల సమస్యపై కేంద్రం ఇప్పటికే మరింత సానుకూల వైఖరితో చర్యలు చేపట్టి వుండాల్సింది. మోడీ విషయం లో కరోనా మహమ్మారి ని కట్టడి చేయటంలో వున్నంతలో సమర్ధంగానే చేసాడని అనుకున్నా తన ఆలోచనలు, చర్యల్లో పారదర్శకత లోపించింది. ఇంత రహస్యంగా ప్రభుత్వ పనివిధానం ఉండాల్సిన అవసరం లేదు. పరిశ్రమలు ముఖ్యంగా లాక్ డౌన్ వలన నష్టపోయిన పరిశ్రమలు, ఎంఎస్ఎం ఇ లు, వలస కార్మికులు ఎదురుచూస్తున్న ఉద్దీపన, సంక్షేమ ప్యాకేజీలు ఎప్పుడు వస్తాయో అసలు వస్తాయో రావో తెలియని గోప్యత ఉండాల్సిన పనిలేదు. రాష్ట్రాలకు ఏమేర సహాయం చేస్తారో తెలియని పరిస్థితి. ప్రధానమంత్రి  గరీబీ కళ్యాణ్ పధకం తర్వాత మరిన్ని ప్రభుత్వ ప్రోత్సాహ చర్యలు ప్రకటిస్తుందని అందరూ ఎదురుచూస్తుంటే అసలు ప్రభుత్వ ఆలోచన ఏమిటో ఎవరికీ తెలియదు. అన్నీ ఊహాగానాలే.

మోడీ తను  జాతినుద్దేశించి చేసే ప్రసంగాలలో వీటిపై వివరణలు లేకపోవటాన్ని కొంతమేరకు అర్ధం చేసుకోగలం. ఇటువంటి సమయం లో జాతి మొత్తాన్ని సామాజిక దూరం పై కేంద్రీకరించేటట్లు భావోద్రేకాన్ని రగిలించటం అవసరం కాబట్టి సమస్య పక్కదారి పట్టకుండా ఒకే సమస్యపై మాట్లాడని అనుకోవచ్చు. కానీ ఆర్ధిక మంత్రి తో నైనా ఎలా చేద్దామనుకుంటున్నారో ప్రకటించక పోవటం సరైన ఆలోచనకాదు. ప్రతిదీ అంత గోప్యతగా వుంచటం వలన ప్రజల్లో, రాష్ట్ర ప్రభుత్వాల్లో అపార్ధాలు, అశాంతి పెరగటం ఖాయం. ఇప్పటివరకు ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ చెప్పినట్లు గా చేస్తూ వచ్చారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాలతో  వీడియో సమావేశాలు నిర్వహించటం సరిపోదు. తన ఆలోచనలు మరింత పారదర్శకంగా ఉండాల్సిన అవసరం వుంది.

నోట్లు ముద్రించటం పరిష్కారం కాదు 

అదేసమయం లో కొంతమంది మేధావులు చెబుతున్నట్లు క్వాంటమ్ ఈజింగ్ , హెలికాప్టర్ మనీ పధకాలు ఆచరణ సాధ్యం కాదు. ఇది ఒక సిద్ధాంతం మాత్రమే. ఇది పాటించిన అన్ని దేశాల్లో అనుభవం ఒకలా లేదు. ముఖ్యంగా మనలాంటి దేశాల్లో ఇది ఎంతవరకు సాధ్యమో చెప్పలేము. ఇది అధిక ద్రవ్యోల్బణానికి , సమీప భవిష్యత్తు లో కోలుకోలేని ఆర్ధిక దౌర్బల్యానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. ప్రోత్సాహక   ప్యాకేజీలు అవసరమే కానీ మరీ కేవలం నోట్లు ముద్రించి పరిష్కార మార్గాలు కనుక్కోవటం అనుకున్నంత తేలిక కాదు. అలాగే  రాష్ట్రాలు ప్రతిదీ కేంద్రం మీద భారం మోపటమూ సరికాదు. వాళ్ళ పరిధిలో కూడా కొన్ని చర్యలు చేపట్టాల్సి వుంది. ముఖ్యంగా పేదప్రజల ఆకలి తీర్చే పని రాష్ట్రాలదే. కొంతమేర కేంద్రం ఆర్ధిక సహాయం చేసినా పటిష్ట అమలు రాష్ట్రాల చేతుల్లోనే వుంది. ఇప్పటికైనా వలస కార్మికుల్లో ఆర్ధిక సహాయం తో పాటు ఆత్మ స్థైర్యాన్ని నింపే కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టగలిగితేనే లాక్ డౌన్ సంపూర్ణంగా జరిగి కరోనా మహమ్మారి పై విజయం సాధించగలమని గ్రహించాలి.