జాతీయంరాజకీయాలు

భారత్ -నేపాల్ లొల్లి.. చక్రం తిప్పుతున్న చైనా?

భారత్ – నేపాల్ మధ్య కొత్త రహదారి వివాదానికి కారణమైంది. టిబెట్ లోని భారతీయులు పవిత్రంగా భావించే మానస సరోవర్ యాత్రకు చేరుకోవడానికి భారత దేశం ఉత్తరఖండ్-నేపాల్ సరిహద్దుల్లో లిపులేఖ్ మార్గాన్ని నిర్మించింది. దీనిపై నేపాల్ అభ్యంతరం తెలిపింది. నేపాల్ దేశం ఏకంగా సాయుధ పోలీస్ దళాన్ని కాలాపానీ సమీపంలో మోహరించి భారత్ తో కయ్యానికి కాలుదువ్వింది.

*అసలేంటి వివాదం
భారతీయులు శివుడు కొలువై ఉంటాడని నమ్మే కైలసమైన టిబెట్ లోని మానస సరోవర్ యాత్రకు భారత్ నుంచి సిక్కిం, ఉత్తరాఖండ్, నేపాల్ ద్వారా వెళుతుంటారు. మానస సరోవర్ యాత్రకు ఇన్నాల్లు వ్యయప్రయాసలకు ఓర్చి ప్రయాణించాల్సి వచ్చేది. చైనా భూభాగం నుంచి 9 కి.మీలు నడిచే వెళ్లాల్సి ఉండేది. దీంతో భారత్ ఉత్తరాఖండ్ లోని దర్బులా రోడ్డుకు అనుసంధానించి లిపులేఖ్ పాస్ రోడ్డును ఈనెల 8న భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించాడు. దీని ద్వారా మానససరోవర్ కు తొందరగా చేరుకోవచ్చు. వాహనంలోనే ప్రయాణించవచ్చు. ఇదే నేపాల్ అగ్రహానికి కారణమై చిచ్చు రేగింది.

*ఈ భూభాగం తమదేనంటున్న నేపాల్
భారత్ తమ భూభాగంలో రోడ్డు నిర్మించిందని నేపాల్ దేశం వ్యతిరేకత వ్యక్తం చేసింది. భారత్ లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు తమవి అంటూ తాజాగా కొత్త మ్యాపును నేపాల్ మంత్రిమండలి ఆమోందించి తీర్మానాన్ని నేపాల్ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది . గత పాలుకుల మాదిరి తాము భారత్ కు ఆ ప్రాంతాలు విడిచిపెట్టమని.. దక్కించుకుంటామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కీలక వ్యాఖ్యలు చేశారు.

*దీటుగా స్పందించిన భారత్
కాగా నేపాల్ కొత్త మ్యాప్ పై భారత్ దీటుగా స్పందించింది. నేపాల్ సరిహద్దులకు సంబంధించి ఈ కొత్త మ్యాప్ ను తాము అంగీకరించబోమని.. ముమ్మాటికీ లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు భారత్ లో అంతర్భాగమని స్పష్టం చేసింది.

*నేపాల్ ఎదురుతిరుగుడు వెనుక చైనా?
చైనా అండతోనే నేపాల్ చెలరేగిపోతోందని.. వివాదాన్ని రాజేస్తోందని భారత్ అనుమానిస్తోంది. ప్రస్తుతం మానస సరోవర్ యాత్ర కోసం భారత్ వేసిన రోడ్డు చైనా సరిహద్దు వరకు ఉంది. యుద్ధ సమయంలో మన సైనికులు అక్కడికి తొందరగా చేరుకునేలా ఈ రోడ్డు ఉంది. దీంతో రక్షణ పరంగా వూహాత్మకంగా మన దేశానికి ఈ రహదారి కీలకమైంది. అందుకే నేపాల్ తో ఈ ప్రాంతాన్ని దక్కించుకునేందుకే చైనా నాటకాలాడుతోందని.. నేపాల్ ను రెచ్చగొడుతోందని భారత్ భావిస్తోంది. .

*మిత్రదేశం నేపాల్ తో చెడిన సంబంధాలు
ఇన్నాళ్లు భారత్ కు ఫేవర్ గా ఉండే తోటి హిందూదేశం నేపాల్ ఈ వివాదంలో చైనా చేతిలో కీలుబొమ్మగా మారిందన్న అనుమానాలను భారతీయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రధాని చైనా అండతో చెలరేగిపోతున్నారన్న అనుమానాలకు బలం చేకూరేలా పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. భారతీయుల పవిత్రక్షేత్రం మానస సరోవర్ కు రాకుండా.. చైనాకు డైరెక్ట్ రూట్ లేకుండా చేయాలనే డ్రాగన్ దేశం నేపాల్ తో ఇలా చేయిస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి.

-నరేశ్ ఎన్నం