టాలీవుడ్సినిమా

జగనూ.. ఇక పెద్ద సినిమాలు బతికేది ఎలా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ని టార్గెట్ చేస్తూ టికెట్ రేట్ల పెంపుకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం జీవోని విడుదల చేసి.. మొత్తానికి ఆర్ధికంగా వకీల్ సాబ్ కి బాగానే నష్టం చేసింది. ఈ విషయం పై ఎన్ని విమర్శలు చెలరేగినా.. ఈ ఆరోపణలను అసలు పట్టించుకున్నట్టు కూడా లేరు జగన్ యాడ్ కో. అయితే ఎవరి సినిమా అయినా.. ఏ రోజైనా.. టికెట్‌ ధర మాత్రం ఒకటే ఉండాలన్నది ప్రభుత్వం ఉద్దేశం అట. మంచిందే, ఈ ఉద్దేశం మిగిలిన అన్ని సినిమాలకు కూడా వర్తిస్తే.. అది హర్షించతగ్గ విషయమే.

కాకపోతే, మిగిలిన సినిమాలకు అది వర్తిస్తుందా ? తొలి రోజైనా, తొలి మూడు రోజులైనా టికెట్ల ధరలు పెంచటం ఎందుకు అని సగటు ప్రేక్షకుడి ప్రశ్న సబబే అంటూ జగన్ ప్రభుత్వం, మొత్తానికి ఈ వివాదంలోకి ప్రేక్షకులను కూడా లాగి.. వారి అభిప్రాయాలకు తగ్గట్టే మా ప్రభుత్వం కూడా ఏకీభవించింది అంటూ తమ తప్పేం లేదు అన్నట్టు ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయినా ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశామని, నటీనటులకు ఎక్కువ పారితోషికం ఇచ్చామని.. తదితర కారణాలతో టికెట్ల రేట్లు పెంచుతామంటే ఇకపై కుదరదని ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది.

ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద సినిమాల మేకర్స్ కి పెద్ద తలనొప్పి తెచ్చేలా ఉంది. భారీ అంచనాలు ఉన్న సినిమాకి మొదటి మూడు రోజులు టికెట్లు పెంచుకుని భారీ కలెక్షన్స్ ను వసూళ్లు చేస్తూ ఉంటారు మన మేకర్స్. ఇది ఆనవాయితీగా వస్తోన్న ఆచారం. అయితే ఇకపై ఏ సినిమాకి అంటే “ఆర్ఆర్ఆర్”, “రాధేశ్యామ్”, “పుష్ప” ఆచార్య, వంటి భారీ చిత్రాలకు కూడా టికెట్ ధరలు పెంచేందుకు వీలు ఉండదు.. మొదటి రోజు కూడా సాధారణ రేట్స్ కే సినిమాని ప్రదర్శించాలి అనే నియమాన్ని జగన్ ప్రభుత్వం ఫిక్స్ చేస్తే.. ఇక పెద్ద సినిమాలు బతికేది ఎలా ?

Back to top button