అంతర్జాతీయంకరోనా వైరస్రాజకీయాలు

కరోనా వేళ.. చిన్నారుల్లో వింత లక్షణాలు..!


చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే అన్నిదేశాలకు కరోనా పాకింది. చైనాలో కంటే చైనాయేతర దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా కన్పిస్తుంది. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, యూరప్ దేశాలు కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. బ్రిటన్లో కరోనా వైరస్ విజృంభిస్తుండగానే మరోవైపు అక్కడి చిన్నారులు పెద్దసంఖ్యలో అనారోగ్యం బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

బ్రిటన్లోని చిన్నారుల్లో టాక్సిక్‌ షాక్‌ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయని స్థానిక వైద్యులు చెబుతున్నారు. గడిచిన మూడురోజులుగా కడుపుమంట, గుండె సంబంధిత వ్యాధులతో బాధుపడుతున్న వందలాది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ లక్షణాలు కరోనా బాధితుల్లోనూ ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. చిన్నారులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించాలని కోరింది. అనుమానితులను గుర్తించి ఐసీయూల్లో చికిత్స అందించాలని వైద్య సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది.

ఒకవైపు కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగోనేందుకు సెంటిస్టులు కష్టపడుతుండగా మరోవైపు చిన్నారుల్లో కొత్త లక్షణాలు బయటపడుతుండటం కలవరం రేపుతోంది. కాగా బ్రిటన్లో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య ఒక లక్షా 69వేలకు చేరుకోగా 24వేల మంది మృత్యువాతపడ్డారు.