ఆంధ్రప్రదేశ్ప్రత్యేకంరాజకీయాలు

ఏపీ కోవిడ్ రోగులకు తెలంగాణలో నో ఎంట్రీ

No entry in Telangana for AP covid patients

కరోనా మానవత్వాన్ని చంపేస్తోంది. ఎవరిని వారిని స్వార్థంగా తయారు చేస్తోంది. ఇప్పుడు ఎవరి బతుకులు వారు చూసుకోవడానికే సమయం సరిపోవడం లేదు. ఇక పక్క వారి గురించి ఆలోచించే తీరికనే లేదు.

ఇన్నాళ్లు కలిసి మెలిసి సాగిన తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు కరోనా చిచ్చు పెడుతోంది. తెలంగాణలోని హైదరాబాద్ సహా ఆస్పత్రుల్లో బెడ్స్ అన్నీ నిండిపోయాయి. కార్పొరేట్ ఆస్పత్రులున్న హైదరాబాద్ కు ఏపీలోని డబ్బున్న వారు, నేతలు, ఇతరులు వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో తెలంగాణ వాసులకు పడకలు దొరకక నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఏపీ నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల్లోనే ఆపివేసి వెనక్కి పంపించేస్తున్నారు తెలంగాణ పోలీసులు. కోవిడ్ రోగులతో వచ్చే అంబులెన్స్ లకు తెలంగాణలో అనుమతి లేదని.. హైదరాబాద్ లో పడకలు, ఆక్సిజన్ కొరత ఉందని చెప్పి వెనక్కి పంపిస్తున్నారు.

తాజాగా ఏపీకి సరిహద్దున గల కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ గేట్ వద్ద తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. కోవిడ్ రోగులతో వెళుతున్న అంబులెన్స్ లను వెనక్కి పంపుతున్నారు.సూర్యపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద కూడా ఏపీ కరోనా రోగులను వెనక్కి పంపిస్తున్నారు. హైదరాబాద్ లో పడకలు, ఆక్సిజన్ లేవని పోలీసులు ముందే చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు.

ఇలా కరోనా విపత్తుతో హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రులకు మెరుగైన వైద్యం కోసం రావాలనుకుంటున్న ఏపీ వాసులకు చుక్కెదురు అవుతోంది. ఏపీలో సరైన ఆస్పత్రులు, కార్పొరేట్ ఆస్పత్రులు లేకపోవడంతో వారంతా తెలంగాణలోని హైదరాబాద్ వైపు చూస్తున్నారు. కానీ ఇక్కడ పడకలు ఖాళీగా లేకపోవడంతో ఇక పోలీసులే సరిహద్దుల్లో అడ్డుకుంటున్న దుర్భర పరిస్థితి నెలకొంది.

Back to top button