ఆంధ్రప్రదేశ్కరోనా వైరస్

ఏపీలోని ఆ గ్రామాల్లో కరోనాకు నో ఎంట్రీ.. ఎక్కడంటే..?


దేశంలో మార్చి నెల తొలివారం నుంచి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పలు దేశాల్లో వైరస్ తగ్గినట్టే తగ్గీ మళ్లీ విజృంభిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు పల్లెల్లో మాత్రం ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అలా అని ఆ గ్రామాల్లో ప్రజలు మాస్కులు వాడతారనో శానిటైజర్లను వినియోగిస్తారనో అనుకుంటే మాత్రం పొరపాటేనని చెప్పవచ్చు. ఏపీలోని విజయనగరం జిల్లాలోని తూర్పు కనుమల్లో ఉన్న రాయగడ జమ్ము, పల్లం బరిడి, సంతోషపురం, మోరంగూడ గ్రామస్థులు ఇప్పటికీ ఎటువంటి కరోనా నిబంధనలు కాకుండా సాధారణ జీవనం గడుపుతున్నారు.

ఆ గ్రామాల్లో ప్రజలు నిబంధనలు పాటించకపోయినా కొత్త కేసులు నమోదు కావడం లేదు. బయో గ్రామాలుగా పేరు తెచ్చుకున్న ఈ గ్రామాల్లో రసాయన ఎరువులను వినియోగించకుండానే పంటలను పండిస్తారు. ఇక్కడ ఇప్పటికీ దంపుడు బియ్యాన్నే తింటారు. పని చేసిన తరువాత చేతులను వేపాకుతో శుభ్రం చేసుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. ఎక్కడికి వెళ్లాలన్నా కాలి నడక మార్గం ద్వారానే వెళతారు.

తాము కెమికల్స్ తో వండిన ఆహారపదార్థాలను తినబోమని.. అందువల్ల తమను ఆరోగ్య సమస్యలు వేధించవని వాళ్లు చెబుతున్నారు. 8,557 గిరిజన కుటుంబాలు గడిచిన మూడు సంవత్సరాలుగా ఇక్కడ కెమికల్స్ లేకుండా వ్యవసాయం చేస్తున్నాయి. . స్వచ్ఛమైన ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు తమలో ఇమ్యూనిటీ పెంచుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.

Back to top button