క్రీడలు

ఐపీఎల్: హైదరాబాద్ ఆశలు ఆవిరి

Sourav Ganguly
ముంబయిలో కరోనా కేసుల ఉధృతి ఎక్కువగా ఉండడంతో అక్కడి మ్యాచ్‌లు నిర్వహించలేక.. బీసీసీఐ ప్రత్యామ్నాయ ఆలోచనలో పడినట్లుగా రెండు రోజుల క్రితం వార్తలొచ్చాయి. ఇక హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఏర్పాటు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ.. అదంతా వట్టి భ్రమేనని మరోసారి తేటతెల్లమైంది. ఐపీఎల్ సీజన్‌కు హైదరాబాద్ ఆతిథ్యమిచ్చే అవకాశం ఉందనే వార్తలపై బీసీసీఐ నీళ్లు చల్లింది. ముంబై వేదికగా జరిగే మ్యాచ్‌లను ఇతర నగరాలకు తరలించే ఆలోచనే లేదని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు.

దేశంలో కరోనా పరిస్థితి ఎలా ఉన్నా.. షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌ 2021 సీజన్‌ను నిర్వహిస్తామన్నాడు. ఆటగాళ్లతోపాటు ముంబై వాంఖడే స్టేడియం మైదాన సిబ్బంది, పలువురు ఈవెంట్ ఆర్గనైజర్స్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఐపీఎల్ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. మరోపక్క మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఆలోచన చేస్తుండటంతో ముంబై వేదికగా జరగబోయే మ్యాచ్‌లు తరలింపు ఖాయమనే వార్తలొచ్చాయి. దీంతో బ్యాకప్ వేదికలుగా ఉన్న హైదరాబాద్‌కు మ్యాచ్‌లు తరలిస్తారని అంతా భావించారు.

కానీ.. ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడిన బీసీసీఐ బాస్ ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశాడు. ‘ముంబై వేదికగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లు అక్కడే జరుగుతాయి. మహారాష్ట్రలో లాక్‌డౌన్ ప్రకటిస్తే మాకే మంచిది. ఎందుకంటే జనసంచారం అస్సలు ఉండదు. బయో బబుల్‌లో ఉంటే కొంతమందికి రెగ్యులర్‌గా టెస్ట్‌లు చేయిస్తే సరిపోతుంది. ఒక్కసారి బబుల్‌లోకి ఎంటర్ అయ్యాక ఎలాంటి భయం ఉండదు. యూఏఈలో జరిగిన గత సీజన్‌లో కూడా బబుల్ బయట ఇలాంటి ఘటనలే జరిగాయి. కానీ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా టోర్నీ పూర్తి చేశాం. ఇప్పుడు కూడా అంతే. లాక్‌డౌన్ అనేది మాకు అసలు సమస్యే కాదు. స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని రకాల పర్మిషన్స్‌తో పాటు హామీలు తీసుకున్నాకే ముంబైలో మ్యాచ్‌లు షెడ్యూల్ చేశాం. ఏప్రిల్ 10–-25 తేదీల మధ్య ముంబై వేదికగా కేవలం 10 మ్యాచ్‌లే జరుగుతాయి. బయో బబుల్‌‌లో ఉండటం వల్ల ఎలాంటి టెన్షన్ లేదు. సురక్షిత వాతావరణం ఏర్పాటు చేశాం. ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ సేఫ్‌గా ఉంటారు’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

ఇక.. మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్ కూడా మ్యాచ్‌లు సజావుగా సాగుతాయనే ధీమా వ్యక్తం చేస్తోంది. ‘ముంబై మున్సిపల్‌ కమిషనర్‌తో చర్చించాం. లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం ఉండదనే భరోసా లభించింది’ అని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్ తెలిపింది. కరోనా తీవ్రత కారణంగా వేదికల జాబితా నుంచి ముంబైని తప్పిస్తే హైదరాబాద్‌లో సురక్షితంగా మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ తెలిపాడు.

Back to top button