ఆంధ్రప్రదేశ్కరోనా వైరస్రాజకీయాలు

కరోనా నుంచి కోలుకున్న ప్రకాశం…!

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో అత్యధిక కేసులు వచ్చిన జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా ఉంది. జిల్లా అధికారుల కృషి, తీసుకున్న చర్యల కారణంగా పూర్తి స్థాయిలో రికవరీ సాధించింది. జిల్లాలో కొత్త కేసులు కొన్ని రోజులుగా నమోదు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా 63 పాజిటివ్ కేసులు రాగా, మే 16 నాటికి అందరూ కోలుకుని డిశ్చార్జి అయ్యారు. జిల్లాలో ఇప్పుడు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. దాంతో కరోనా రోగులందరూ కోలుకుని డిశ్చార్జి అయిన తొలి జిల్లాగా నిలిచింది. ఏపీలో మరే జిల్లాలోనూ రోగులు మొత్తం డిశ్చార్జి అయింది లేదు.
వైద్య, పోలీసు, వాలంటీర్ వ్యవస్థ ఎంతో సమన్వయంతో పనిచేసిన ఫలితమే జిల్లాలో జీరో పాజిటివ్ వచ్చిందని చెప్పాలి. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తమ సిబ్బందితో కలిసి తీవ్రంగా శ్రమించారు. గత కొన్నివారాల నుంచి ప్రకాశం జిల్లాలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అధికారులు లాక్ డౌన్ నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేయడం కూడా కరోనా వ్యాప్తిని కట్టడి చేసింది. అయినప్పటికీ ప్రకాశం జిల్లా అధికారులు పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచారు. జిల్లాలో కొత్త కేసులేవీ లేకపోయినా మరి కొన్నాళ్లపాటు ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చినా ముఖానికి మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.